ETV Bharat / city

'కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం.. అన్నివేళలా అండగా ఉంటా'

author img

By

Published : Aug 4, 2022, 10:31 PM IST

Updated : Aug 4, 2022, 11:17 PM IST

Jagan meet
Jagan meet

CM Jagan interact with Kuppam leaders: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో వచ్చే ఎన్నికల్లో వైకాపా జెండా రెపరెపలాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని.. అందులోనూ గెలిచే తొలి సీటు కుప్పం కావాలని సీఎం నిర్దేశించారు. వచ్చే ఎన్నికల్లో భరత్​ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. కార్యకర్తలతో సమావేశాలను ప్రారంబించిన సీఎం, నియోజకవర్గంలో నెలకొన్న పరిస్ధితులపై ఆరా తీశారు. కుప్పం నియోజకవర్గానికి మూడేళ్లలో ఎంతో చేశానని, తన సొంత నియోజకవర్గంలా చూసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు.

Jagan meet YSRCP cadre: నియోజకవర్గాల వారీగా వైకాపా కార్యకర్తలతో భేటీకి శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంతో మొదలుపెట్టారు. కుప్పం నియోజకవర్గంలో 50 మంది కార్యకర్తలను ఎంపిక చేసి.. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో సమావేశమయ్యారు. ఒక్కో కార్యకర్తతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కుప్పంలో గెలిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించారు. పార్టీలో సమస్యలతో సహా వాటికి పరిష్కార మార్గాలు కోరారు. నియోజకవర్గ సమస్యలను కార్యకర్తలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

MLC Bharath: కుప్పంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కుప్పం ఇన్​చార్జ్​, ఎమ్మెల్సీ భరత్ సీఎం జగన్​ను కోరారు. సమస్యల పరిష్కారానికి రూ.67 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా.. రెండు రోజుల్లో జీవో ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు భరత్​ తెలిపారు. హంద్రీనీవా కెనాల్​ పనులు మూడేళ్లైనా పూర్తి చేయలేదని తెలపగా.. వేరేవారికి కాంట్రాక్ట్​ ఇచ్చి ఏడాదిలో పూర్తి చేస్తామని సీఎం తెలిపారన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని.. వచ్చే ఎన్నికల్లో గెలిచే తొలి సీటు కుప్పం కావాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

Jagan focus on Kuppam: కార్యకర్తలు, నేతలు చెప్పిన అభిప్రాయాలు, సమస్యలన్నింటినీ నమోదు చేసుకున్న సీఎం జగన్.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కుప్పంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తానని తెలిపారు. కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భరత్​ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. కుప్పం అభివృద్ధికి అన్నివేళలా అండగా ఉంటానన్నారు. 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని సీఎం సూచించారు. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గంతో సమానంగా చూస్తానని హామీ ఇచ్చారు.

కార్యకర్తలు, నేతలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. కుప్పంలో వైకాపాను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను సత్వరమే చేపట్టాలని సీఎం సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 4, 2022, 11:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.