ETV Bharat / city

జగన్​కు అర్థమైంది.. వైకాపాకు అవే చివరి ఎన్నికలు: చంద్రబాబు

author img

By

Published : May 9, 2022, 4:53 PM IST

CBN fires on Jagan
జగన్​పై చంద్రబాబు ఫైర్

CBN fires on Jagan: ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలని కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి.. పొత్తులపై మాట్లాడినట్లు చిత్రీకరించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పిల్లిలా భయంతో అందరికాళ్లూ పట్టుకున్న జగన్‌ను సింహంగా పిలవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఓడిపోతే వైకాపాకు భవిష్యత్తు ఉండదని అర్ధమయ్యే.. జగన్‌ మళ్లింపు రాజకీయాలు చేస్తూ తన బలహీనతను బయటపెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు.

CBN fires on Jagan: ఆంధ్రప్రదేశ్​లో భీమిలి పర్యటనలో ప్రజలు 'జై బాబు' అన్న నినాదాలను 'జై జగన్' అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా మొదటి నుంచి మళ్లింపు రాజకీయాలనే తన విధానంగా పెట్టుకుందన్న ఆయన.. తన పర్యటనలకు వస్తున్న అనూహ్య స్పందనను చూసి తట్టుకోలేకే కొత్త డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. పార్టీ ముఖ్య నేతలు, క్షేత్రస్థాయి నేతలతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని దుయ్యబట్టారు.

2024లో ఓడిపోతే వైకాపా అనేది ఉండదనే విషయం జగన్​కు అర్థమైందని చంద్రబాబు అన్నారు. జగన్‌ పోకడలను చూస్తే వచ్చే ఎన్నికలే వైకాపాకు చివరి ఎన్నికలు కానున్నట్లు స్పష్టమవుతోందన్నారు. తెదేపా నిర్వహిస్తున్న 'బాదుడే బాదుడు', సభ్యత్వ నమోదుపై సమీక్షించిన చంద్రబాబు.. గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలని నేతలకు సూచించారు. పులివెందులలో ఎస్సీ కాలనీలో తాగునీరు ఇవ్వలేని ఘటన అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.

"జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. 2024లో ఓడిపోతే వైకాపా అనేది ఉండదని జగన్‌కు అర్థమైంది. జగన్ సింహం కాదు పిల్లి... భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించండి. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అని నినాదాలు చేశారు. జై జగన్‌ అన్నట్లు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి అన్నాను. నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారు." -చంద్రబాబు, తెదేపా అధినేత

చంద్రబాబు పర్యటనలకు వస్తున్న స్పందనను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు నేతలకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పర్యటనలకు స్పందన వస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువతలో అనూహ్య స్పందన కనిపిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అవసరం అనేది ప్రజలు గుర్తించారని.. అధినేత పర్యటనతో రాష్ట్రంలో పొలిటికల్ వైబ్రేషన్ వచ్చిందని చెప్పారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 'సర్కారువారి పాట' సినిమా టికెట్ ధరలు పెంపు.. ఎంతంటే?

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.