ETV Bharat / city

EPFO pension news: ఈపీఎఫ్‌వోలో మార్పులకు కేంద్రం యోచన!

author img

By

Published : Sep 20, 2021, 6:54 AM IST

వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులకు పింఛను చెల్లించేందుకు ఉద్దేశించిన పథకంలో మార్పులు చేయాలని కేంద్రం (CENTRAL GOVERNMENT) యోచిస్తోంది. ఎన్‌పీఎస్‌ (EPS) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించి, అందులోని మొత్తంపై వడ్డీని పింఛనుగా (PENSION) ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది.

EPFO pension news
EPFO pension news

ఈపీఎఫ్‌ (EPF) పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులకు పింఛను చెల్లించేందుకు ఉద్దేశించిన పథకంలో మార్పులు చేయాలని కేంద్రం (CENTRAL GOVERNMENT) యోచిస్తోంది. జాతీయ పింఛను పథకం (NPS) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించి, అందులోని మొత్తంపై వడ్డీని పింఛనుగా (PENSION) ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. పదవీ విరమణ తర్వాత మెరుగైన పింఛను (PENSION) పొందేందుకు వీలుగా సంస్కరణలు చేపట్టాలన్న ఆలోచన సాగుతోంది. ఉద్యోగం మధ్యలో మానేసినా రెండేళ్ల వరకు ఉద్యోగులు పింఛను పథకం (EPS) నుంచి నిధులు ఉపసంహరించకుండా నిషేధం విధించనుంది.

ప్రస్తుతమిలా...

పదవీ విరమణ పొందిన కార్మికులు, వేతన జీవులకు ఈపీఎఫ్‌వో (EPFO)సామాజిక భద్రత కల్పిస్తోంది. ఈపీఎఫ్‌(ఉద్యోగుల భవిష్య నిధి)Å ఖాతాలోని నిల్వలు పదవీ విరమణ తర్వాత దక్కుతాయి. ఈపీఎఫ్‌ (EPF) పింఛను (PENSION) పొందేందుకు ఉద్యోగి సొంతంగా ఈపీఎస్‌ (EPS) ఖాతాలో రూపాయి కూడా జమచేయాల్సిన అవసరం లేదు. పదేళ్ల పాటు ఈపీఎఫ్‌వో చందాదారుగా సర్వీసు పూర్తిచేసిన వారికి ఈపీఎఫ్‌ పింఛను అందుతోంది. యాజమాన్యాలు ఉద్యోగి మూలవేతనం, కరవు భత్యం కలిపి అందులో 8.33శాతం చొప్పున ఈపీఎస్‌ ఖాతాలో జమ చేస్తున్నాయి. ఉద్యోగి కనీస వేతనం రూ.15 వేల కన్నా ఎక్కువ ఉంటే, 8.33 శాతం వాటా కింద ఈపీఎస్‌ గరిష్ఠ చందా రూ.1,250 తీసివేయగా మిగిలిన మొత్తం ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసినపుడు ఆ ఉద్యోగి సర్వీసు ఆధారంగా పింఛను మదింపు జరుగుతోంది. పదేళ్ల సర్వీసు ముగిస్తే ఈపీఎస్‌ ఖాతాలో నగదు ఉపసంహరించే అవకాశం ఉద్యోగికి ఉండదు. ఉద్యోగం మానేసిన తరవాత సర్టిఫికెట్‌ వస్తుంది. దీనితో 58 ఏళ్ల వయసు తర్వాత పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రస్తుత పింఛను లెక్కింపులోనూ తగ్గుదల

2014లో నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసే సమయానికి గత ఐదేళ్ల సగటు వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛను లెక్కించాలి. పదవీ విరమణ పొందే సమయానికి గడిచిన ఐదేళ్ల సగటు వేతనాన్ని (గరిష్ఠంగా రూ.15వేలు) సర్వీసుతో గణించి ఆ మొత్తాన్ని 70తో భాగించి కనీస పింఛను ఖరారు చేయాలి. ఇలా చేయట్లేదు. పింఛను లెక్కించే సమయంలో కొత్త నిబంధన అమలు చేస్తోంది. కనీస వేతన పరిమితి అమలైన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత అందాల్సిన పింఛను భారీగా తగ్గుతోంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి 1995 నుంచి 25 ఏళ్లు సర్వీసు చేస్తే.. గరిష్ఠ వేతనం రూ.15,000కు పైనే ఉంటుందనుకుంటే 2014 నిబంధనల ప్రకారం రూ.5 వేలకు పైగా పింఛను అందాలి. కానీ అతనికి 1995 నుంచి 2001 వరకు ఈపీఎఫ్‌ కనీస పింఛను అర్హత వేతనం రూ.5వేల చొప్పున ఆరేళ్ల సర్వీసుకు రూ.428 పింఛను, 2001 నుంచి 2014 వరకు రూ.6,500 వేతనంపై రూ.1207, 2014 నుంచి 2020 వరకు రూ.15 వేల మొత్తంపై రూ.1,285 పింఛను లెక్కిస్తోంది. ఈ మొత్తాన్ని కలిపి ఆ ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత రూ.2,920 ఇస్తోంది. దీంతో ఉద్యోగి 2 వేలకు పైగా నష్టపోతున్నారు.

ఇవీ ప్రతిపాదిత అంశాలు...

  • ఉద్యోగుల పింఛను కోసం ఇక నుంచి ఈపీఎస్‌ (EPS) ఖాతా ప్రత్యేకంగా ఉంటుంది.
  • ఈ ఖాతాలో యజమాని వాటాకు అదనంగా, ఉద్యోగి కోరుకుంటే సొంతగా జమచేయవచ్చు.
  • ఏటా ఈపీఎఫ్‌వో నిర్ణయించే వడ్డీని ఈపీఎస్‌ (EPS) నిల్వల మొత్తానికి వర్తింపచేసి లెక్కిస్తారు.
  • 58 ఏళ్ల సర్వీసు తర్వాత ఈపీఎస్‌ (EPS) ఖాతాలోని మొత్తంపై వడ్డీని పింఛనుగా (PENSION) ఇస్తారు.
  • పదవీ విరమణ చేసినపుడు తక్కువగా.. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పింఛను (PENSION) తీసుకునే అవకాశమూ కల్పించనుంది.
  • ఉద్యోగి మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి పింఛను, ఆ తర్వాత వారసులకు నిల్వలు అందుతాయి.

ఇదీ చూడండి: CORONA: తగ్గుముఖం పడుతున్న కరోనా.. 0.47% పాజిటివిటీ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.