ETV Bharat / city

Kishan Reddy: 'సెలవే లేకుండా ప్రధాని పనిచేస్తే.. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్​కే రాడు'

author img

By

Published : Aug 22, 2021, 4:25 AM IST

Updated : Aug 22, 2021, 6:11 AM IST

రాష్ట్రంలో మరో రెండేళ్లలో తెరాస ప్రభుత్వ అడ్రస్‌ గల్లంతు కావటం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సచివాలయమే లేకుండా... తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా పాలన సాగుతోందని మండిపడ్డారు. జనఆశీర్వాద యాత్రలో తెరాస వైఫల్యాలపై విమర్శలు గుప్పించిన కిషన్‌రెడ్డి.... కేంద్రప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. మూడ్రోజుల పాటు పలుజిల్లాల్లో సాగిన ఈ యాత్ర.... హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంతో ముగిసింది.

central minister kishan reddy fire on cm kcr in janashirvadha yatra closing meeting
central minister kishan reddy fire on cm kcr in janashirvadha yatra closing meeting

ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్లలో ఏనాడూ సెలవు తీసుకోకుండా పనిచేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఏడేళ్ల పాలనలో ఎప్పుడూ సెక్రటేరియట్‌కు రాలేదని, ఫామ్‌హౌస్‌, ప్రగతిభవన్‌లకే పరిమితమయ్యారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సెక్రటేరియట్‌కు రావడం లేదని ప్రశ్నిస్తే దాన్ని కూల్చివేసి ఎవరూ ప్రశ్నించకుండా చేశారన్నారు. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఎక్కడ కూర్చుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందన్నారు. నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర శనివారం రాత్రి ముగిసింది. అనంతరం నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ముగింపు సభలో కేంద్రమంత్రిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా పలువురు నేతలు సన్మానించారు. గొంతు బొంగురు పోవడంతో సభలో కిషన్‌రెడ్డి మాట్లాడలేకపోయారు. అంతకు ముందు ఆయన శనివారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించి భువనగిరిలో చివరిరోజు యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఘట్‌కేసర్‌, ఉప్పల్‌, అంబర్‌పేట, నారాయణగూడ, చిలకలగూడ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, బంజారాహిల్స్‌, నాంపల్లి బజార్‌ఘాట్‌ సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి తనకు చెప్పుతో సమానమన్న కేసీఆర్‌... తనకు ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని, అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తినేలా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు తాను కృషి చేశానన్నారు.

యాత్ర విజయవంతంతో తెరాసలో భయం మొదలైంది: బండి సంజయ్‌

కిషన్‌రెడ్డి యాత్ర విజయవంతంతో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పెరిగిందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేసేంద]ుకు కష్టపడి పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి కిషన్‌రెడ్డికి స్వాగతం పలికిన తీరు చూసి తెరాసలో భయం మొదలైందని.. కొన్నిచోట్ల అధికారపార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. దళితబంధు పథకానికి భాజపా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలిస్తున్న సీఎం దళితబంధు పథకాన్ని ఏవిధంగా అమలుచేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కొనసాగిన సమయంలో ఆర్టికల్‌ 370, అయోధ్యలో రామ జన్మభూమి తదితర అంశాలపై కీలక పాత్ర పోషించినందుకే క్యాబినెట్‌ హోదాను ప్రధాని మోదీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘రారా.. పోరా.. సంజయ్‌ అంటూ కిషన్‌రెడ్డి తనను ఆప్యాయంగా పిలుస్తారని సంజయ్‌ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చంద్రశేఖర్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వివేక్‌, రవీంద్రనాయక్‌, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, బాబూమోహన్‌, యాత్ర ఇన్‌ఛార్జి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు.

సంజయ్‌ పాదయాత్రలో కిషన్‌రెడ్డి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభించనున్న ‘మహాసంగ్రామ యాత్ర’లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. తొలిరోజు యాత్రలో సంజయ్‌తో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వరకు కిషన్‌రెడ్డి నడవనున్నట్లు సమాచారం.

భావోద్వేగానికి లోనై కంటతడి

ల్లి వద్దకు బిడ్డ వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంబర్‌పేట వస్తే తనకూ అలాగే ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు తన ప్రాణమని, తాను దిల్లీలో ఉన్నానంటే మీ ప్రేమ, ఆప్యాయతలే కారణమన్నారు. అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తన చివరి శ్వాస వరకు అంబర్‌పేట ప్రజలను మరచిపోలేనన్నారు. కేంద్రమంత్రిగా దేశ సేవ చేసే అవకాశాన్ని అంబర్‌పేట, సికింద్రాబాద్‌ ప్రజలు, ప్రధాని నరేంద్రమోదీ తనకు కల్పించారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్​పేటకు బిడ్డనే: కిషన్​ రెడ్డి

Last Updated : Aug 22, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.