ETV Bharat / city

శుభవార్త: ఒక్కో రైతుకు నేరుగా రూ.1.60 లక్షలు!

author img

By

Published : Jul 6, 2020, 8:45 AM IST

కొవిడ్‌ సంక్షోభం నుంచి పాడి పరిశ్రమను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా పాడి రైతులకు రుణాలివ్వడానికి రూ.15 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న వారికి నేరుగా రూ.1.60 లక్షలు, డెయిరీకి తక్కువగా పాలు పోసే రైతులు అదనంగా పాలు పోయడానికి ఆసక్తి కనబరిస్తే రూ.3 లక్షల వరకు రుణం అందుతుంది.

పాడి రైతులకు రుణ వెల్లువ
పాడి రైతులకు రుణ వెల్లువ

పాడి రైతులకు తీపి కబురు. కొవిడ్‌ సంక్షోభం నుంచి పాడి పరిశ్రమను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా పాడి రైతులకు రుణాలివ్వడానికి రూ.15 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీని కింద సహకార డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు బ్యాంకు రుణాలివ్వనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ)తో పాటు, కరీంనగర్‌ డెయిరీ, ముల్కనూర్‌, రంగారెడ్డి- నల్గొండ జిల్లాలకు చెందిన నార్ముల్‌ (మదర్‌) డెయిరీలకు నిత్యం పాలు విక్రయించే 2.50 లక్షల మంది రైతులకు ఈ ప్యాకేజీ వర్తిస్తుంది.

వ్యవసాయ రైతులకు బ్యాంకులు ఇచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ)లను పాడి రైతులకూ ఇవ్వాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. ఈ కార్డు ఉన్న పాడి రైతుకు నేరుగా రూ.1.60 లక్షల రుణం వస్తుంది. ఇప్పటికే పాడి పశువులున్న రైతులు ఈ సొమ్ముతో ఇతర అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశముంది. ఇప్పటికే ఒకట్రెండు పశువులతో డెయిరీకి తక్కువగా పాలు పోసే రైతులు.. అదనంగా పాలు పోయడానికి ఆసక్తి కనబరిస్తే రూ.3 లక్షల వరకు రుణం అందుతుంది.

ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు..

నాలుగు సహకార డెయిరీల పరిధిలోని 2.50 లక్షల మందిలో 50 వేల మంది ఇప్పటివరకు రుణం కోసం దరఖాస్తులిచ్చారు. ఈ 4 డెయిరీల తరఫున ప్యాకేజీ అమలు బాధ్యతను విజయ డెయిరీ చూస్తోంది. రైతు తీసుకునే రుణంపై 4 శాతం వడ్డీని కేంద్రం రాయితీగా భరిస్తుంది. మరో 3 శాతాన్ని రైతు కట్టాలి.

ఒక రైతు రూ.3 లక్షలతో కనీసం 4 మేలుజాతి పాడిపశువులు కొనవచ్చు. వాటితో రోజుకు 20 లీటర్ల పాలను డెయిరీలకు పోయడానికి అవకాశముంటుంది. కనీసం 2 లక్షల మంది రైతులకు రుణాలిస్తే డెయిరీలకు 40 లక్షల లీటర్ల పాలు అదనంగా వస్తాయని అంచనా. లీటరుకు రూ.30 చొప్పున 40 లక్షల లీటర్లకు రోజుకు రూ.12 కోట్ల సొమ్ము రైతులకు అందుతుంది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చూడండి: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఇవాళ, రేపు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.