ETV Bharat / city

MLC Elections: శాసనమండలి ఎన్నికలపై సీఈసీ దృష్టి.. రాష్ట్ర పరిస్థితులపై ఆరా..

author img

By

Published : Jul 29, 2021, 9:56 AM IST

cec-focus-on-telangana-mlc-elections-2021
cec-focus-on-telangana-mlc-elections-2021

పలు రాష్ట్రాల్లో పరిస్థితులు కుదుటపడటంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇదే క్రమంలో తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకునేందుకు తాజాగా సీఈసీ లేఖ రాసింది.

రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేసులు ఏమైనా వస్తున్నాయా? తీవ్రత ఏమైనా ఉందా? మండలి ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి? తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్న అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.

ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ మూడో తేదీతో ముగిసింది. సాధారణంగా సభ్యుల పదవీ కాలం ముగియటానికి ముందుగానే ఎన్నికలు నిర్వహించటం ఎన్నికల సంఘానికి ఆనవాయితీ. కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో ఉండటంతో మండలి స్థానాల ఖాళీల భర్తీ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితులు కుదుటపడటంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

ఏకగ్రీవం కానున్నాయా?

ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత నుంచి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అందులోనూ కేవలం ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పదవీ కాలం ముగిసిన సభ్యులు తెరాస పార్టీకి చెందిన వారే. ఎన్నికలు జరగాల్సిన ఆరు స్థానాలను అధికార తెరాస పార్టీనే దక్కించుకోనుంది. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.

హుజూరాబాద్‌ ప్రస్తావన లేదు

మండలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు మార్గం సుగమం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల సంఘం రాసిన లేఖలో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ ప్రస్తావన లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

Bike Theft: 9 ఏళ్ల క్రితం పోయిన బైకుకు చలానాలు.. పట్టుకొమ్మంటే మాత్రం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.