ETV Bharat / city

రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు

author img

By

Published : Mar 24, 2022, 9:53 PM IST

రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు
రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు

Chandrababu comments: ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్​కు లేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. న్యాయస్థానం స్పష్టమైన తీర్పు వెలువరించినా.. శాసనసభలో మళ్లీ మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టటం దుర్మార్గమన్నారు. చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరాలని సీఎం జగన్​కు సవాల్ విసిరారు.

రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: చంద్రబాబు

Chandrababu comments: శాసనసభలో చట్టాలు చేయాలి కానీ జనాల ప్రాణాలు తీసే చట్టం చేస్తామంటే కోర్టులు ఊరుకోవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలీని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారన్న ఆయన.. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నారు. శాసనసభలో వైకాపా ప్రభుత్వం మళ్లీ మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

భావితరాల భవిష్యత్తుపై ఇంత కక్షగా వ్యవహరించటం దురదృష్టకరమని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలకు వెళ్లకుండా మొండిగా వితండవాదం చేయటమేంటని ప్రశ్నించారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది విధ్వంసం చేయటానికి కాదన్న చంద్రబాబు.. అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్​కు లేదన్నారు. చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

ఆనాడు జగన్ సూచించలేదా ?

"మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు ఉందా ?. అమరావతి రాజధానిగా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పలేదా ?. అమరావతిపై అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు చెప్పలేదు. రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలని ఆనాడు జగన్ సూచించలేదా ?. 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రం మధ్య అధికారాలు స్పష్టంగా విభజించారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే. ఎవరూ బాధ్యతలు విస్మరించినా సరి చేసే బాధ్యత న్యాయవ్యవస్థకు ఉంది. ఇష్టప్రకారం చట్టాలు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదు. జనాల ప్రాణాలు తీసే చట్టం చేస్తామంటే కోర్టులు ఊరుకోవు. కోర్టు తీర్పులపై ఇంతగా మాట్లాడిన సీఎం, మంత్రులను గతంలో ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయమని ప్రజలు అధికారం ఇచ్చారా ?. రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి. ఎక్కడైనా అభివృద్ధి చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం చేసిన ఖర్చులో 30 శాతం మళ్లీ ప్రభుత్వానికే వస్తుంది." - చంద్రబాబు, తెదేపా అధినేత

జగన్ పేరు మార్చుకుంటే బాగుంటుంది..

ఐదేళ్లకు మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి జగన్​ను చంద్రబాబు హెచ్చరించారు. మండలి రద్దు చేస్తామంటూ వ్యవస్థపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ కేసు వచ్చినా అంతిమంగా దర్యాప్తు చేసే సీబీఐపైనే కేసులు పెడతామనటం దారుణమన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎంపీపైనా హత్యా ప్రయత్నం చేశారని ఆరోపించారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం ఒక ట్రస్టీ మాత్రేమేనన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులదని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి పేరును జగన్ మోసం రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

"సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్న రైతులు వెనక్కి తగ్గితే ప్రభుత్వం ఊరుకునేదా?. ఒప్పందాన్ని రద్దు చేస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తారు కదా. సీఎం జగన్‌ మూర్ఖత్వంతో ముందుకు పోతున్నారు. అమరావతి, పోలవరం 5 కోట్ల మంది ప్రజల సమస్య. హైకోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. రాజధాని అమరావతే అని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకోలేదా ?. అమరావతిలో ఇల్లు కట్టుకుని ప్రజలను నమ్మించలేదా ?. రాజ్యాంగం ప్రకారమే అసెంబ్లీలో సీఆర్డీఏ చట్టం చేశాం. సీబీఐ, కోర్టులు స్వతంత్ర వ్యవస్థలు. వైకాపా నేతలే హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరిచ్చారు." - చంద్రబాబు, తెదేపా అధినేత

జగన్ పాదయాత్ర చేసేవారా ?

కోర్టులు ఏ తీర్పులూ ఇవ్వవద్దని వైకాపా నేతలు భావిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. కోర్టులో తీర్పు వ్యతిరేకంగా రాబోతున్నది తెలిసే సీఆర్‌డీఏ చట్టం రద్దు చేశారన్నారు. కోర్టులను తప్పుపట్టడం, దూషించడం సరికాదని హితవు పలికారు. ఈ మూడేళ్లలో అమరావతి వాసులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై దారుణంగా కక్ష సాధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేధిస్తే.. జగన్ పాదయాత్రలు చేసేవారా ? అని ప్రశ్నించారు. విశాఖలో ఇప్పటివరకు ఒక్క ఇటుకైనా పేర్చారా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖకు వచ్చిన సంస్థలు కూడా వెనక్కి పోయాయని విమర్శించారు. రాజధానిగా రెండు ప్రాంతాలకు సమదూరంలో ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకున్నామన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.