ETV Bharat / city

Minister Buggana: 'ఆర్ధిక పరిస్థితి బాగోలేకనే పీఆర్సీ అంశంలో బేరాలు'

author img

By

Published : Apr 6, 2022, 10:40 PM IST

Minister Buggana: జీఎస్టీ విధానంలో ఇంకా సంస్కరణలు రావాల్సి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పరోక్ష పన్నుల ద్వారానే రాష్ట్రాలు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాల్సి ఉండగా.. జీఎస్టీ, వ్యాట్​ల ద్వారానే రాష్ట్రాలకు గరిష్ఠ ఆదాయం వస్తోందని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకనే పీఆర్సీ అంశంలో ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని మరో మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Buggana
Buggana

Minister Buggana: పరోక్ష పన్నుల ద్వారానే రాష్ట్రాలు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాల్సి ఉండగా.. జీఎస్టీ, వ్యాట్​ల ద్వారానే రాష్ట్రాలకు గరిష్ఠ ఆదాయం వస్తోందని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ వాణిజ్యపన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవ సభలో మంత్రులు, పేర్నినాని, బొత్స, వెల్లంపల్లితో కలిసి ఆయన పాల్గొన్నారు. క్లిష్టమైన వ్యవస్థలో వాణిజ్య పన్నుల శాఖ సవాళ్ల మధ్యే ఆదాయాన్ని ఆర్జిస్తోందని బుగ్గన చెప్పారు. వస్తు సేవలపై పన్నుల వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్​ను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అలాగే జీఎస్టీ విధానంలోనూ ఇంకా సంస్కరణలు రావాల్సి ఉందని బుగ్గన అన్నారు. ప్రభుత్వానికి ఆదాయార్జన ఎంత కష్టమో అందరికీ తెలుసునని.. సవాళ్ల మధ్యే వసూళ్ల లక్ష్యాలు సాధించాల్సి ఉందని తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను ఏపీలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తోందని తెలిపారు. కొవిడ్ లాంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఏపీ ఎగుమతుల్లో దేశంలోనే 4 స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రచారానికే ఎక్కువ సమయం వెచ్చించిందని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు.

అందుకే బేరాలాడాల్సి వచ్చింది: ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగోలేకనే పీఆర్సీ అంశంలో ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి రావడంలో ఉద్యోగులు చాలా కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులపై ప్రేమ లేకపోతే సీఎం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఎందుకు ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో న్యాయం జరగలేదని కొందరు అంటున్నారని.., అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితే బాగాలేదనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలన్నారు.

ఉద్యోగుల జీతాలకే సరిపోవు..: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు అన్నీ కలిపినా ఉద్యోగుల జీతాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇబ్బందులు ఉన్నా.. రెవెన్యూ తీసుకురావటంలో వాణిజ్య పన్నులశాఖ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. లొసుగులు వెతికి అదనపు ఆదాయాలు తీసుకురావాల్సిన బాధ్యత వాణిజ్య పన్నుల శాఖదేనని చెప్పారు. వ్యాపారులను వేధించాల్సిన అవసరం లేదని.., ఐదేళ్ల కాలంలోని వివాదాలు, కోర్టు కేసులు బేరీజు వేసుకుని నిబంధనల మార్పుపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.