ETV Bharat / city

నేడు భాజపా నేతల కీలక భేటీ.. హాజరుకానున్న తరుణ్​ చుగ్

author img

By

Published : Jul 10, 2022, 8:15 AM IST

BJP Meeting
BJP Meeting

BJP Meeting: రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ ఆకర్ష్‌పై భాజపా అధినాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల నూతనంగా నియమించిన 3 కమిటీలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... నేడు వేర్వేరుగా భేటీ కానున్నారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ హాజరు కానున్నారు.

BJP Meeting: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్​పై భాజపా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల నూతనంగా నియమించిన మూడు కమిటీలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు వేర్వేరుగా భేటీ కానున్నారు. ప్రధానంగా చేరికల కమిటీ సమావేశం కీలకంగా మారే అవకాశముంది. తెరాస, కాంగ్రెస్​కు చెక్ పెట్టాలని భాజపా భావిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లను తెరాసలో చేర్చుకోవడంపై కమలనాథులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. తెరాసకు షాక్ ఇవ్వాలని వ్యూహరచన చేస్తోంది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ హాజరుకానున్నారు.

పార్టీలో పాత, కొత్త నేతలకు పలు కమిటీల కన్వీనర్లుగా రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు అప్పజెప్పింది. కాగా చేరికల సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు - తెరాస వైఫల్యాలపై అధ్యయన కమిటీలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. తొలుత రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, చేరికలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణపై నేతలు చర్చించనున్నారు. హైదరాబాద్‌ పరిధిలోని నలుగురు భాజపా కార్పొరేటర్లు ఇటీవల తెరాసలో చేరడంపై సమన్వయ కమిటీతో రాష్ట్ర అధినాయకత్వం చర్చించనుంది. అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనాన్స్ కమిటీతో, 2 గంటలకు ప్రజా సమస్యలు-తెరాస వైఫల్యాలపై వేసిన అధ్యయన కమిటీతో భేటీ జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాల కమిటీతో ఎంపీ అర్వింద్ ఒకసారి సమావేశం నిర్వహించారు. మరిన్ని సమస్యలపై ఫోకస్ చేసి ప్రజల్లో తెరాసను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కమలం నేతలు భావిస్తున్నారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే చేరికలపై సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందని స్పష్టత ఇచ్చారు. భాజపాకి చెందిన నలుగురు కార్పొరేటర్లను తెరాస చేర్చుకుంటే చూస్తూ ఊరుకోబోమని, కచ్చితంగా దెబ్బకు దెబ్బ కొడతామని హెచ్చరికలు చేశారు. పార్టీలో భారీ చేరికలుంటాయని, చేరికల కోసం సీక్రెట్ ఆపరేషన్ నడుస్తోందని స్పష్టం చేశారు. తెరాస ఖాళీ అవడం ఖాయమని జోస్యం చెప్పారు. దీనికితోడు జిల్లాల వారీగా చేరికలపైనా భాజపా నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తోంది. ఎప్పటికప్పుడు చేరికలు చేస్తూ తెరాస, కాంగ్రెస్​కు చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.