Padayatra: కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తాం: బండి సంజయ్​

author img

By

Published : Aug 29, 2021, 4:06 AM IST

bandi sanjay
బండి సంజయ్​ ()

తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు కేసీఆర్‌ పాలనను చూసి రోదిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. కాషాయ శ్రేణుల హర్షాతిరేకాల నడుమ శనివారం బండి సంజయ్‌ 'ప్రజా సంగ్రామ' పాదయాత్ర ప్రారంభమైంది. 35రోజుల యాత్రలో తొలి అడుగు వేశారు. రెండో రోజు మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల నుంచి ప్రారంభమై..... లంగర్‌హౌజ్‌ మీదుగా బాపూఘాట్‌ వరకు సాగనుంది.

‘ఎన్నో పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన 1400 మంది కుటుంబాలు కేసీఆర్‌ పాలన చూసి రోదిస్తున్నాయి. నిరుద్యోగులు, రైతులు... ఇలా రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్న తెలంగాణ?’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలించేందుకే పాదయాత్ర చేపట్టానని ఉద్వేగంగా చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ఇదే నాంది కానుందన్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన కాషాయదళం హర్షాతిరేకాల మధ్య సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ’ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకుని ఆయన యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దిల్లీ నుంచి వచ్చిన పార్టీ ముఖ్యనేతలతో పాటు.. రాష్ట్రం నుంచి అన్నిస్థాయుల నాయకులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. హోరెత్తించే నినాదాలు, ఎగసిపడుతున్న శ్రేణుల ఉత్సాహం నడుమ 35 రోజుల మొదటి విడత పాదయాత్రలో సంజయ్‌ తొలి అడుగు వేశారు. వర్షంలోనూ ముందుకు సాగుతూ తొలిరోజు మెహిదీపట్నం వరకు 10 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేశారు.

నా యాత్రతో ప్రకంపనలు తథ్యం

యాత్ర ప్రారంభ సందర్భంగా చార్మినార్‌ వద్ద నిర్వహించిన సభలో బండి సంజయ్‌ ప్రసంగించారు. తెరాస, మజ్లిస్‌లే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘ఇంటికో ఉద్యోగం.. రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీలను కేసీఆర్‌ మరిచారు. సీఎం అలా ఒక్కొక్కరికి రూ.లక్ష బాకీ పడ్డారు. డిగ్రీ, పీజీలు చదివిన విద్యార్థులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. 25 లక్షల మంది డీఎస్సీ కోసం, 40 లక్షల మంది ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజిలో నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం చూస్తున్నారు. నిరుద్యోగులు, ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గొర్రెలు, బర్రెలు బీసీలకు.. పాలనా పగ్గాలు కేసీఆర్‌కా? భాగ్యలక్ష్మి అమ్మవారి కనుసన్నల్లో సాగుతోన్న ఈ యాత్ర తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయం’ అని ఆయన ఆవేశంగా ప్రసంగించారు. మతపరమైన రిజర్వేషన్లు అడ్డుపెట్టి ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబమే రాజ్యమేలుతూ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది మహిళలకు మంత్రి పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వేళ దొంగ హామీలిచ్చి.. తర్వాత ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలు సాగనంపాలన్నారు.

తాలిబన్‌ భావజాలాన్ని తరిమి కొట్టాలి

తాలిబన్‌ భావజాలమున్న మజ్లిస్‌ పార్టీని, దానికి సహకరిస్తున్న వారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే భాజపా లక్ష్యం కావాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. ‘రంజాన్‌ వస్తే ఇఫ్తార్‌ విందు, క్రిస్మస్‌కు భోజనాలు పెట్టడాన్ని భాజపా సమర్థిస్తుంది. కానీ హిందువుల పండుగలు తెరాసకు పట్టకపోవడం బాధాకర’మన్నారు. గణేశ్‌ శోభాయాత్రకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద స్వాగతం పలకాలని డిమాండ్‌ చేశారు. భాజపా ఏ వర్గానికీ, మతానికీ వ్యతిరేకం కాదని.. 80 శాతం ఉన్న హిందువుల పరిరక్షణకు పాటుపడుతుందని స్పష్టం చేశారు. పాతబస్తీ నుంచి వెళ్లిపోయిన హిందువులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ‘ఎంఐఎం నాయకులు, అవినీతి నియంత కేసీఆర్‌ గుండెలు బద్దలయ్యేలా నినదించాల’ంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘భారత్‌మాతాకీ జై.. జై శ్రీరామ్‌, వందేమాతరం, రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్‌కీ.. వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం’ అంటూ సంజయ్‌ చేసిన నినాదాలకు కార్యకర్తల గొంతులు తోడవడంతో సభా ప్రాంగణం హోరెత్తింది.

రావణరాజ్యాన్ని అంతమొందిద్దాం : తరుణ్‌చుగ్‌

ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో రావణరాజ్యం సాగుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్‌, అరుణ్‌సింగ్‌ తమ ప్రసంగాల్లో విమర్శించారు. మహాత్మాగాంధీ యాత్రతో ఆంగ్లేయుల పాలన.. మిషన్‌ పోలోతో నిజాం పాలన.. ఇప్పుడు బండి సంజయ్‌ పాదయాత్రతో సీఎం కేసీఆర్‌ పాలన అంతమవుతుందని తరుణ్‌చుగ్‌ అన్నారు. కేంద్రం తెలంగాణకు 3 లక్షల ఇళ్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం లక్ష కూడా నిర్మించలేదని అరుణ్‌సింగ్‌ ఆరోపించారు. భవిష్యత్తులో ‘తెరాస జానేవాలా.. భాజపా ఆనేవాలా’ తథ్యమన్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రభుత్వం భాజపాతోనే సాధ్యమన్నారు. ప్రజల ఆకాంక్షలు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బందీ అయ్యాయని దుయ్యబట్టారు.

నేటి యాత్ర సాగుతుందిలా..

ఆదివారం ఉదయం కార్యకర్తలతో సంజయ్‌ సమావేశమవుతారు. 9 గంటల తర్వాత రెండో రోజు యాత్ర ప్రారంభమవుతుంది. నానల్‌నగర్‌ చౌరస్తా, టోలిచౌకి చౌరస్తా, షేక్‌పేట నాలా, అక్కడి నుంచి షేక్‌పేటకు వెళ్లి మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం గోల్కొండ కోటకు చేరుకుని సాయంత్రం 4 గంటలకు అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత గోల్కొండ చోటాబజార్‌, లంగర్‌హౌజ్‌ చెరువు కట్ట, లంగర్‌హౌజ్‌ చౌరస్తా మీదుగా పాదయాత్ర బాఫూఘాట్‌కు చేరుకుంటుంది. రాత్రికి అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేస్తారు.

జోరువానలోనూ జోష్‌..

బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర తొలిరోజు ఉత్సాహంగా సాగింది. పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో పాతబస్తీ రోడ్లన్నీ కిటకిటలాడాయి. యాత్ర ప్రారంభం కాగానే జోరున వర్షం మొదలైంది. అయినా కార్యకర్తలంతా సంజయ్‌ వెంట ఉత్సాహంగా నడిచారు. వర్షంలోనే సంజయ్‌ యాత్ర కొనసాగించారు. దారిలో ప్రజలకు అభివాదం చేస్తూ నడిచారు. మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులను పలకరించారు. రైతుబజార్‌లోకి వెళ్లి అక్కడివారి యోగక్షేమాలను ఆరా తీశారు. బోనాలు, నృత్యాలు, డీజేలతో సుమారు రెండు వేల మంది కార్యకర్తలు వెంట రాగా, ఆయన యాత్ర ఆద్యంతం జోష్‌తో సాగింది. ముఖ్యనేతల వాడివేడి ప్రసంగాలతో పాటు పాతబస్తీలో సభ విజయవంతం కావడం కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యాత్రకు భాజపా జాతీయ నాయకత్వం ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులను పంపించింది. వీరిలో తరుణ్‌చుగ్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కాగా, ఎంపీ అరుణ్‌సింగ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, దిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జిగా కూడా ఉన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం తదుపరి లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి రావడమేనని, ఆ దిశగా అందరూ పనిచేయాలని పార్టీశ్రేణులకు వారు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలను పోలుస్తూ.. ఇక్కడ అవినీతి జరుగుతోందని ఆరోపణాస్త్రాలు సంధించారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం, ఆయుష్మాన్‌భారత్‌ ఆరోగ్య పథకం అమలు చేయకపోవడం వంటి అంశాల్ని ప్రస్తావించారు.

పుల్లారెడ్డి కళాశాలలో బస

రాత్రి 7.20కి తొలిరోజు యాత్ర పూర్తి చేసిన సంజయ్‌ మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్‌లో బస చేశారు. తన వెంట ఉన్న కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. కళాశాలలో ఆసిఫ్‌నగర్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, 70 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసీఆర్‌ పాలనకు చరమగీతం: కిషన్‌రెడ్డి

సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణలో నిర్బంధ, నియంతృత్వ పాలన సాగుతోంది. ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాల ఇష్టారాజ్యంగా ఉంది. ప్రజాధనం దుర్వినియోగంతో రూ.లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై పడింది. పాతబస్తీకి మెట్రో రాకుండా కేసీఆర్‌, ఒవైసీ అడ్డుకుంటున్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ అందుబాటులోకి రాకపోవడానికి కేసీఆర్‌ ముఖ్య కారణం. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో భాజపా విజయం ఖాయం. కేసీఆర్‌ పాలన అంతానికి బండి సంజయ్‌ పాదయాత్ర నాంది పలుకుతుంది’ అన్నారు.

ఇదీ చదవండి: Vaccination: ప్రత్యేక వ్యాక్సిన్​ డ్రైవ్​కు​ స్పందన కరవు.. వందశాతం అయ్యేదెప్పుడు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.