ETV Bharat / city

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖ కీలక భేటీ

author img

By

Published : Mar 17, 2022, 8:08 AM IST

Polavaram project : గోదావరి వరద ఉద్ధృతికి నదీ గర్భంలో ఏర్పడ్డ కోత వల్ల పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎదురైన సమస్య పరిష్కారానికి కేంద్రం మరో కమిటీని నియమించింది. దిల్లీ ఐఐటీ విశ్రాంత డైరక్టర్‌ ప్రొఫెసర్‌ వి.ఎస్‌.రాజు నేతృత్వంలో ఈ కమిటీ అధ్యయనం చేసి, మెథడాలజీ విషయంలో ఒక అభిప్రాయానికి రావాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వద్ద నిర్వహించిన సమావేశం నిర్ణయించింది.

jal shakti on Polavaram project
jal shakti on Polavaram project

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖ కీలక భేటీ

Polavaram project : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖ కీలక భేటీ నిర్వహించింది. దిగువ కాఫర్ డ్యామ్ లో దెబ్బతిన్న చోట జియో మేంబ్రేన్ డిజైన్లకు జలశక్తి శాఖ ఆమోదాన్ని అక్కడికక్కడే తెలియజేసింది. ఈసీఆర్​ఎఫ్​-1, ఈసీఆర్​ఎఫ్​ డ్యామ్ డిజైన్‌లను పరిశీలన చేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న 300 మీటర్ల మేర ఏం చేయాలన్న దానిపై త్వరలోనే ఐఐటీ అధ్యయన బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కోరారు. వారి అధ్యయనం తర్వాత మార్చి 27, 29 తేదీల మధ్య మరోసారి సమావేశం నిర్వహిస్తానని, తానే స్వయంగా హాజరవుతానని కేంద్రమంత్రి వెల్లడించారు. వరద కోత వల్ల పోలవరం ప్రాజెక్టుకు అదనంగా చేయాల్సిన పనులకు అయ్యే అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందనీ మంత్రి భరోసా ఇచ్చారు. అదనపు పనులు చేయాలని.. ఆకృతులు మార్చాలని కేంద్ర కమిటీలే చెబుతున్నాయని, మళ్లీ ఆ నిధులు అడిగితే అభ్యంతరాలు చెబుతున్నారని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఈ హామీ ఇచ్చినట్లు తెలిసింది. గోదావరి గర్భంలో ఇసుక కోత సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ డిజైన్ల ప్రకారం ముందుకు సాగాలనే అంశాలను కమిటీతో పాటు ఆకృతులకు సంబంధించిన నిపుణులంతా కలిసి చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

Polavaram project News : పోలవరం ప్రాజెక్టులో డిజైన్లు, నిధుల కొరత సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి హామీతో దిల్లీలో బుధవారం రెండు సమావేశాలు నిర్వహించారు. తొలుత కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు మార్చి 10న దిల్లీలో పోలవరం ఆకృతులపై ఓ సమావేశం నిర్వహించారు. అందులో దిగువ కాఫర్‌ డ్యాం ఆకృతులపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసింది. ఇప్పటికే దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి ఆకృతుల కమిటీ ప్రతిపాదించిన అంశాల మేరకు డిజైన్లు ఖరారు చేయాలని కేంద్ర మంత్రి నిర్దేశించడంతో వాటికి ఆమోదం లభించింది. ప్రధాన డ్యాం నిర్మాణంలో గ్యాప్‌ 2, గ్యాప్‌ 1 ప్రాంతంలో ఇసుక కోత ఏర్పడటంతో అక్కడ పనులు ఎలా చేపట్టాలనే అంశంలో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ అంశాన్ని వి.ఎస్‌.రాజు కమిటీతో పాటు డీడీఆర్‌పీ సభ్యులు, ఇతరులు కలిసి కొలిక్కి తేవాలని నిర్దేశించారు. పోలవరం స్పిల్‌ వే వద్ద ఎడమ గట్టు పటిష్ఠం పనులకూ డిజైన్లు ఖరారు చేయాలని సూచించారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం సాయంత్రం మరోసారి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించారు. పోలవరం ఆకృతులపై తుది నిర్ణయానికి రావడానికి ఎలా ముందుకు వెళ్లాలో షెడ్యూలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.