ETV Bharat / city

ఎస్​ఈసీకీ ప్రభుత్వం సరిగా సహకరించలేదు: ఏపీ హైకోర్టు

author img

By

Published : Feb 23, 2021, 8:52 AM IST

ఏపీ ఎన్నికల సంఘానికి సహాయ, సహకారాలు అందించాలని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఎస్​ఈసీకీ మంజూరైన పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోలేదని, నిధులను మంజూరు చేయలేదని ఆక్షేపించింది.

ఎస్​ఈసీకీ ప్రభుత్వం సరిగా సహకరించలేదు: ఏపీ హైకోర్టు
ఎస్​ఈసీకీ ప్రభుత్వం సరిగా సహకరించలేదు: ఏపీ హైకోర్టు

ఏపీ ఎన్నికల సంఘానికి సహాయ, సహకారాలు అందించాలని ఆదేశిస్తూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఎస్‌ఈసీకి మంజూరైన పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోలేదని, నిధులు మంజూరు చేయలేదని ఆక్షేపించింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు సరైన స్ఫూర్తితో అమలు చేయలేదని తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని తొలుత ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్‌ స్పందిస్తూ.. రాతపూర్వకంగా వివరణ ఇచ్చేందుకు మొదట అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ అఫిడవిట్లు వేసేందుకు నాలుగు వారాలు గడువిచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

నిధుల కేటాయింపు, ఖాళీ పోస్టుల భర్తీ, తదితర విషయాల్లో ఎస్‌ఈసీకి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతేడాది నవంబర్‌ 3న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం సహకరించలేదంటూ ఎస్‌ఈసీ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన విచారణలో ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. అధికారులు సహకారం అందించలేదన్నారు. ప్రభుత్వ అధికారుల తరఫున జీపీ సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు నిధులు కేటాయించామని, పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని, మంజూరైన పోస్టులను భర్తీ చేయలేదని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.