ETV Bharat / city

Amaravati: అమరావతి అంతమే 'ఎజెండా'

author img

By

Published : Sep 19, 2022, 10:11 AM IST

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/19-September-2022/16409694_5.png
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/19-September-2022/16409694_5.png

Jagan Comments on Amaravati : ఏపీ రాజధానిగా అమరావతి తమకు సమ్మతమేనంటూ ప్రతిపక్ష నేత హోదాలో నాడు శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట మార్చేశారు. అమరావతి నాశనమే ఏకైక ఎజెండాగా దానిపై విష ప్రచారానికి తెరతీశారు. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిని పాతాళంలోకి తొక్కేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కట్టాలా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. 29 గ్రామాల రైతులు 30వేల ఎకరాల భూములిచ్చి చేసిన త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ 1000 రోజులకుపైగా గాంధేయ మార్గంలో వారు చేస్తున్న పోరాటాన్ని కృత్రిమ ఉద్యమమని పరిహసిస్తున్నారు. తమకున్న అర ఎకరం, ఎకరం భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన పేద రైతులను పెత్తందార్లని అభాండాలు వేస్తున్నారు.

Jagan Comments on Amaravati : ఏపీరాజధాని అమరావతిపై విషం చిమ్మడం.. కోలుకోకుండా దెబ్బతీయడం.. సర్వనాశనం చేయడం ముఖ్యమంత్రి జగన్‌ ఏకైక ఎజెండా! దాని కోసం ఆయన ఎన్ని అబద్ధాలైనా అలవోకగా చెప్పేస్తారు.. అవే నిజమని ప్రజల్ని నమ్మించాలనుకుంటారు. అదే అమరావతి నడిగడ్డపై.. దేవాలయం లాంటి శాసనసభలో నిలబడి, మరోసారి అమరావతిపై ఆయన విషం కక్కారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని జగన్‌, వైకాపా నాయకులు ఎన్నికల ముందు పదేపదే చెప్పిన విషయాన్ని చాలా ‘తెలివిగా’ మర్చిపోయారు.

Jagan Comments on Amaravati
.

Amaravati the capital city : రాజకీయ ప్రత్యర్థులపైనా, తనకు గిట్టని మీడియా సంస్థలపైనా అక్కసు వెళ్లగక్కడానికి తివిరి ఇసుమున.. అంటూ భర్తృహరి సుభాషితాన్ని వల్లెవేసిన ముఖ్యమంత్రి.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్టంగా చెప్పినా మూడు రాజధానులపై మొండిపట్టుతో ఉన్న తనకే ఆ సుభాషితం వర్తిస్తుందని విస్మరించారు. ఆవు చేలో మేస్తే అన్న సామెతలా.. ముఖ్యమంత్రి మెప్పు కోసం తహతహలాడే మంత్రులు, శాసనసభ్యులు అమరావతిపై విషం కక్కడంలో పోటీపడ్డారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో శాసనసభలో జరిగిన చర్చలో అమరావతిపై లేనిపోని అభాండాలు వేశారు.

‘అబద్ధాలాడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించాలి. నాకైనా అదే వర్తిస్తుంది’.. ఇది జగన్‌ గతంలో ఒక ఎన్నికల సభలో చెప్పిన సుభాషితం. మరి ‘అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఈ మూడూ ఎక్కడుంటే అదే రాజధాని’ అని ఒక సందర్భంలోనూ, 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి తాము వ్యతిరేకం కాదని అసెంబ్లీ సాక్షిగానూ, తెదేపా ప్రభుత్వం పోయి తాము అధికారంలోకి వచ్చాక రైతులంతా ఆనందపడేలా బ్రహ్మాండమైన రాజధాని కడతామని మరో సభలోనూ ఢంకా భజాయించి చెప్పిన జగన్‌ వాటన్నిటినీ మర్చిపోయి అబద్ధాలాడుతున్నందుకు ఆయనకు ఏం చూపించాలని రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు.

Jagan Comments on Amaravati
.

విషప్రచారాలు.. వాస్తవ దృశ్యాలు.. రాజధానిగా అమరావతి తమకు సమ్మతమేనంటూ ప్రతిపక్ష నేత హోదాలో నాడు శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట మార్చేశారు. అమరావతి నాశనమే ఏకైక ఎజెండాగా దానిపై విష ప్రచారానికి తెరతీశారు. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిని పాతాళంలోకి తొక్కేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కట్టాలా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. 29 గ్రామాల రైతులు 30వేల ఎకరాల భూములిచ్చి చేసిన త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నారు.

Jagan Comments on Amaravati
.

అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ 1000 రోజులకుపైగా గాంధేయ మార్గంలో వారు చేస్తున్న పోరాటాన్ని కృత్రిమ ఉద్యమమని పరిహసిస్తున్నారు. తమకున్న అర ఎకరం, ఎకరం భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన పేద రైతులను పెత్తందార్లని అభాండాలు వేస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పునూ పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణకూ ముఖ్యమంత్రి కాలు దువ్వుతున్నారు. అందుకు వంత పాడుతూ మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమంటున్న అమాత్యులు న్యాయ వ్యవస్థనే లెక్క చేయడం లేదు.

అసలు వాస్తవాలు ఇవీ..

Jagan Comments on Amaravati
.

సీఎం: అమరావతి నిర్మాణానికి రూ.1.10 లక్షల కోట్లు కావాలి. కనీసం వందేళ్లు పడుతుంది. మొత్తం డబ్బంతా తెచ్చి అమరావతిలోనే పెట్టాలా?

వాస్తవం: అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలన్నట్టుగా, డబ్బంతా అక్కడే పోస్తే మిగతా ప్రాంతాలకు అన్యాయం జరిగిపోతుందన్నట్టుగా ముఖ్యమంత్రి మిగతా ప్రాంతాల ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రాజధాని ఒక సమగ్ర నగరంగా రూపుదిద్దుకోవడానికి రూ.1.09 లక్షల కోట్లు అవసరమని సీఆర్‌డీఏ అంచనా వేసింది. కానీ సీఆర్‌డీఏ పెట్టాల్సింది రూ.55,343 కోట్లే. అదీ అయిదేళ్లలో దఫదఫాలుగా. మిగతా రూ.54 వేల కోట్లు రాబోయే కొన్నేళ్లలో చేపట్టే ప్రైవేటు ప్రాజెక్టుల్లోనూ, ఇతరత్రా పెట్టాల్సిన డబ్బు. దానిలో ప్రైవేటు పెట్టుబడులే ఎక్కువ. 2018-19 నుంచి 2025-26 మధ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఆర్‌డీఏ కోరిన ఆర్థిక సాయం రూ.12,600 కోట్లే. దాన్ని కూడా 2037 నాటికి ప్రభుత్వానికి తిరిగి చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు.

Jagan Comments on Amaravati
.

సీఎం: అక్కడివన్నీ తాత్కాలిక భవనాలే

వాస్తవం: రాజధానిలో మూడేళ్లకు పైగా మీరు, అంతకు ముందు తెదేపా ప్రభుత్వం నాలుగేళ్లు పాలన సాగించిన సచివాలయ భవనాలు, ఇప్పుడు మీరు ప్రసంగిస్తున్న శాసనసభ భవనం టెంపరరీ కాదు. దానికి గత ప్రభుత్వం పెట్టిన పేరు ‘ఇంటెరిమ్‌ గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌’. ఆ భవనాలు శాశ్వతం. వాటి నుంచి పాలనా వ్యవహారాల నిర్వహణే తాత్కాలికమన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లు, ఆకర్షణీయంగా నిర్మించాలనుకున్న హైకోర్టు భవనాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పరిపాలన అక్కడికి మార్చాలన్నది గత ప్రభుత్వ ఉద్దేశం. అమరావతిపై విషప్రచారంలో భాగంగానే వాటికి తాత్కాలిక భవనాలని ముద్ర వేశారు. ఇంగితం ఉన్న ఎవరైనా.. అంత పక్కాగా నిర్మించిన వాటిని టెంపరరీ భవనాలు అనరు.

Jagan Comments on Amaravati
.

సీఎం: ఒక వర్గం ప్రయోజనాల్ని కాపాడేందుకే అమరావతి నిర్మాణం
వాస్తవం: రాజధాని అమరావతి తాడికొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. రాజధానికి భూములిచ్చినవారిలో ఎస్సీ, ఎస్టీలు 32%, రెడ్లు 23%, కమ్మ 18%, బీసీలు 14%, కాపులు 9%, మైనార్టీలు 3%, ఇతరులు 1% ఉన్నారు. అయినా అమరావతి ఒకే సామాజికవర్గానిదని విషప్రచారం చేయడం మిగతా వర్గాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? అది ఓ ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?

Jagan Comments on Amaravati
.

సీఎం: అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్‌ ప్రాజెక్టు కాదు. రాజధానిలో వాణిజ్య వినియోగానికి ఉన్న భూమి 5,020 ఎకరాలే. దాన్ని ఇప్పటికిప్పుడు ఎకరా రూ.20 కోట్లకు అమ్మితే తప్ప మౌలిక వసతులు కల్పించలేం.

వాస్తవం: అమరావతి ముమ్మాటికీ సెల్ఫ్‌ఫైనాన్స్‌ ప్రాజెక్టే. మౌలిక వసతుల అభివృద్ధికి, రైతులకు స్థలాలు ఇవ్వడానికి, స్టార్టప్‌ ఏరియాకు కేటాయించిన 1691 ఎకరాలు తీసేయగా, సీఆర్‌డీఏ చేతిలో నికరంగా 8,274 ఎకరాలు ఉంటుందని అంచనా. దానిలో 3,254 ఎకరాల్ని భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి (వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయించేందుకు) రిజర్వు చేసింది. మిగతా 5,020 ఎకరాల్లో 3,709 ఎకరాల్ని 2023 నుంచి దశలవారీగా విక్రయించడం వల్ల 18 ఏళ్లలో రూ.78,583 కోట్లు, మరో 1,311 ఎకరాల్ని 2037 తర్వాత దఫదఫాలుగా విక్రయించడం వల్ల మరో 92,950 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ ప్రణాళిక అనుకున్నట్టు అమలు చేస్తే 2037 నాటికి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ఇతర ఖర్చులూ పోగా సీఆర్‌డీఏ చేతిలో నికరంగా రూ.33,304 కోట్ల మిగులు ఉంటుందని అంచనా. భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి, స్టార్టప్‌ ఏరియా కోసం కేటాయించిన భూముల్నీ సీఆర్‌డీఏ ఎవరికీ ఉచితంగా ఇచ్చేయదు కదా? అప్పుడు అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్‌ ప్రాజెక్టు కాక మరేంటి?

Jagan Comments on Amaravati
.

సీఎం: అమరావతి ఇటు విజయవాడకు కానీ అటు గుంటూరు కానీ దగ్గరగా లేదు. వీటిలో ఎక్కడి నుంచయినా కనీసం 40 కి.మీ.ల దూరం ఉంటుంది. దేనికీ దగ్గరగా లేని ప్రాంతంలో మౌలిక వసతుల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చవుతుంది.

వాస్తవం: ఇది మరో అవాస్తవ, అసంబద్ధ వాదన. ఏదైనా కొత్త నగరాన్ని నిర్మించేటప్పుడు స్థల లభ్యత, ఇతర అనుకూలతలు చూస్తారే తప్ప ఇప్పుడున్న నగరాలకు దగ్గరగా, ఆనుకుని ఉందా లేదా చూడరు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయారాయ్‌పూర్‌ను రాయ్‌పూర్‌కు ఆనుకుని కట్టలేదు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ను అహ్మదాబాద్‌కు పక్కనే కట్టలేదు. ప్రకాశం బ్యారేజీకి ఇటుపక్క విజయవాడ నగరం ఉంటే బ్యారేజీ దాటిన వెంటనే ఉండవల్లి ఉంటుంది. అక్కడి నుంచే రాజధాని సరిహద్దు మొదలవుతుంది. కృష్ణా నదిపై ఏడాదిలో అందుబాటులోకి రానున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి అటు కోర్‌ రాజధానికి కేవలం 5 నిమిషాలే ప్రయాణం. అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి వంటి ప్రాంతాలన్నీ కలసి భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదిగేలా ప్రణాళికలు రూపొందించారు. వైకాపా ప్రభుత్వం అటకెక్కించిన అవుటర్‌ రింగ్‌రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌రోడ్లు వాటిలో భాగమే.

సీఎం: రాజధాని నిర్మాణానికి అయిదేళ్లలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.5,674 కోట్లే. భ్రమలు కల్పించి.. డిజైన్లు, గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేశారు.

వాస్తవం: ఇది మరో పచ్చి అబద్ధం. ఓ ఇల్లు కట్టాలనుకుంటే స్థలం ఎంపికకు, ప్లాన్లు, అనుమతులకు, పునాదులు వేయడానికీ కొన్ని నెలలు పడుతుంది. మరి రాజధానికి ఇంకెన్నేళ్లు కావాలి? రైతుల నుంచి భూసమీకరణ, ప్రణాళికల రూపకల్పనకే కొన్నేళ్లు పట్టింది. వైకాపా సృష్టించిన అడ్డంకులు, వేసిన కేసులతో చాలా సమయం వృథా అయింది. అయినా గత ప్రభుత్వం.. చెల్లించాల్సిన బకాయిలతో కలిపి మొత్తం రూ.10 వేల కోట్లకుపైగా రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టింది.

సీఎం: అమరావతిపై పెట్టే డబ్బులో 10% అంటే.. 10 వేల కోట్లు పెడితే విశాఖ ఇంకా పెద్ద నగరం అవుతుంది

వాస్తవం: విశాఖపట్నం రాష్ట్రంలోనే పెద్ద నగరమని, దశాబ్దాలుగా అక్కడ అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రే చెబుతున్నారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఎదిగే అన్ని అర్హతలూ దానికి ఉన్నాయి. గతంలో వనరులన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకరించి దెబ్బతిన్నామని చెబుతూనే మళ్లీ ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్నది ఏంటి? విశాఖను అభివృద్ధి చేస్తూనే, సమాంతరంగా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే... రాష్ట్రంలో త్వరలోనే మరో నగరం ఆవిర్భవిస్తుంది కదా!

ఎకరం భూమిలేని పేద రైతులు పెత్తందార్లా?

సీఎం: పెత్తందార్ల సొంత అభివృద్ధి కోసమే అమరావతి. వారి కోసమే ఈ ఉద్యమాలు

వాస్తవం: రాజధాని నిర్మాణానికి 29,881 మంది రైతులు 34,323 ఎకరాల భూములిస్తే... వారిలో ఎకరంలోపు భూమి ఉన్నవారు 20,490 మంది. వాళ్లిచ్చిన మొత్తం భూమి విస్తీర్ణం 10,035 ఎకరాలు. ఎకరం కమతం కూడా లేని ఈ బడుగు రైతులా పెత్తందార్లు? 1 నుంచి 2 ఎకరాల్లోపు భూమి ఇచ్చిన రైతులు 5,227 మంది, రెండు నుంచి అయిదెకరాల భూమి ఇచ్చిన రైతులు 3,337 మంది ఉన్నారు.

పేరు పెడితే.. రాజధాని అయిపోతుందా?

సీఎం: అమరావతిపై నాకెలాంటి వ్యతిరేకతా లేదు. విశాఖలోనూ, కర్నూలులోనూ రాజధానిని అదనంగా చేయాలన్నానే తప్ప ఇక్కడ నుంచి తీసేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి.

వాస్తవం: కేవలం పాతిక మంది ఉద్యోగులు ఉండే, ఏడాదికి పాతిక రోజులపాటు సమావేశాలు జరిగే శాసనసభ భవనాన్ని మాత్రం ఇక్కడ ఉంచి, శాసన రాజధాని అని పేరు పెడితే అది రాజధాని అయిపోతుందా? న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఒక కోర్టు భవనం, కొన్ని వ్యాపార సంస్థలు వస్తే కర్నూలు న్యాయ రాజధాని అయిపోతుందా? కర్నూలులో హైకోర్టుతో పాటు రెండు మూడు ట్రైబ్యునళ్లు, మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం వంటివి ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందా?

ఎకరా రూ.17 కోట్లవుతుందని మీరే చెప్పారుగా..

సీఎం: రాజధానిలో స్థలాలు అమ్మకానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాళ్లే అంటున్నారు. ఆ భూమి రూ.కోట్లలో పలుకుతుందని, దానితో రాజధానిని అభివృద్ధి చేయవచ్చనీ వాళ్లే చెబుతున్నారు.

వాస్తవం: రాజధానిని నాశనం చేయాలన్న వైకాపా ప్రభుత్వ విధానాల వల్లే రాజధానిలో భూముల విలువ పడిపోయింది నిజం కాదా? గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు ఎకరం రూ.10 కోట్ల చొప్పున విలువ కట్టినా ఫ్లాట్లు హాట్‌కేకుల్లా బుక్కయిన విషయం తెలీదా? కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గత ప్రభుత్వ హయాంలో రాయితీపైనే ఎకరం రూ.4 కోట్లకు కేటాయించిన సంగతి మీరు ఎరగరా? అంతెందుకు మీ ప్రభుత్వమే రాజధాని భూముల్ని హడ్కోకు తాకట్టు పెట్టినప్పుడు భవిష్యత్తులో అక్కడ భూముల విలువ ఎకరం రూ.17 కోట్లకు చేరుతుందని అంచనా వేయడం వాస్తవం కాదా?

రాజధాని.. రాష్ట్రమంతా విస్తరించి ఉండాలా?

సీఎం: మన రాష్ట్రం అంటే అమరావతి ఉన్న 6 కి.మీ.ల వ్యాసార్థం మాత్రమే కాదు.. 1,62,967 చ.కి.మీ.ల భూభాగం. మిగతా ప్రాంతాన్ని విస్మరించి కేవలం 33 వేల ఎకరాల్లో అన్ని లక్షల కోట్లు పెట్టాలా?

వాస్తవం: ఇది మరో వితండవాదం. హైదరాబాద్‌ అయినా, దిల్లీ అయినా, కోల్‌కతా అయినా.. ఎక్కడైనా రాజధాని నగరమంటే రాష్ట్రమంతా విస్తరించి ఉండదు కదా? రాజధాని నగరం అభివృద్ధి చెందే కొద్దీ భారీగా పెట్టుబడులు వస్తాయి. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఆ రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో అయినా ప్రైవేటు పాత్రే కీలకం. అమరావతిలో కూడా గత ప్రభుత్వం వివిధ ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాల విలువే సుమారు రూ.45 వేల కోట్లు. అంత భారీ పెట్టుబడులు వస్తే నగరం దానంతట అదే అభివృద్ధి చెందదా? 500 ఎకరాల్లోనో, వెయ్యి ఎకరాల్లోనో రాజధాని పెట్టుకుని, అదే సరిపోతుందనుకోవడం విజ్ఞతా? భవిష్యత్‌ అవసరాలకు భూమి సిద్ధంగా పెట్టుకోకపోతే, నగరం విస్తరించే కొద్దీ... కావాలనుకుంటే భూమి దొరుకుతుందా?

సీఎం: గత ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.

వాస్తవం: మీరు చెప్పినట్టు అమరావతిలో ఒక్క ఇటుక కాదు.. కొన్ని లక్షల ఇటుకలు పెట్టారు. అమరావతిలో అంతా గ్రాఫిక్స్‌ అయితే మీరు సచివాలయానికి, శాసనసభకు వెళుతున్న రోడ్లు, పాలన నడుస్తున్న సచివాలయం, శాసనసభ సమావేశాలు జరుగుతున్న భవనాలు, తీర్పులిస్తున్న హైకోర్టు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాలూ కూడా గ్రాఫిక్సేనా?

58 లక్షలకుపైగా చదరపు అడుగుల నిర్మాణాలు పూర్తి

రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ఆరోపిస్తున్నవారికి గత ప్రభుత్వ హయాంలో కోటి చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ)లకు పైగా నిర్మాణాలు తలపెట్టి 58 లక్షలకు పైగా ఎస్‌ఎఫ్‌టీల్లో పూర్తి చేసిన భవనాలు కనిపించలేదా?

* ప్రస్తుత శాసనసభ, సచివాలయం నడుస్తున్న భవనాలు 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు.

* కోర్టుల సముదాయం మరో 2.52 లక్షల ఎస్‌ఎఫ్‌టీల్లో నిర్మించారు. దీనిలోనూ కొన్నేళ్లుగా కార్యకలాపాలు సాగుతున్నాయి.

* ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస గృహాలు, ఎన్జీవోల గృహ సముదాయాలు, టైప్‌-1, టైప్‌-2 గెజిటెడ్‌ అధికారులు, గ్రూప్‌ డి ఉద్యోగుల నివాస సముదాయాలు కలిసి మొత్తం 84.57 లక్షల చదరపు అడుగులతో గత ప్రభుత్వం నిర్మాణాలను ప్రారంభించింది. 2019లో ఈ ప్రభుత్వం వచ్చే నాటికి అందులో 47 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు (55.7%) పూర్తయ్యాయి.

* హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల భవనాలు మొత్తం 10.04 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో గత ప్రభుత్వం 27% పనులు అంటే 2.71 లక్షల ఎస్‌ఎఫ్‌టీలు పూర్తి చేసింది.

* సీఆర్‌డీఏ భవనం వంటి ఇతర నిర్మాణాలనూ గత ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసింది. ఇవన్నీ కలిపితే దాదాపు 60 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పూర్తయ్యాయి.

సీఎం: అది కృత్రిమ ఉద్యమం

వాస్తవం: అమరావతిలో రైతులు చేస్తోంది కృత్రిమ ఉద్యమమే అయితే ప్రభుత్వానికెందుకంత ఉలికిపాటు? రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలకు గోడు వెళ్లబోసుకోవడానికి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే వైకాపా నాయకులంతా మూకుమ్మడిగా ఎందుకు దాడి చేస్తున్నట్టు? దాన్ని దండయాత్ర అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? వెయ్యి రోజులకుపైగా చేస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఎందరో బడుగు రైతులు, రైతు కూలీలు, వివిధ వర్గాలు, మతాలు, పార్టీల వారున్నారు.

రాచమార్గం వదిలి.. కరకట్ట కావాలంటారా?

సీఎం: గత ప్రభుత్వం కరకట్ట రోడ్డును కూడా విస్తరించలేకపోయింది

వాస్తవం: పక్కనే ఆరు వరుసలతో దాదాపు పూర్తయిన రాజమార్గం లాంటి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఉండగా.. కరకట్ట రోడ్డును విస్తరించాలనుకోవడమే తెలివితక్కువ ఆలోచన. గత ప్రభుత్వం రూ.215 కోట్లతో సీడ్‌ యాక్సెస్‌ నిర్మాణం ప్రారంభించి, రూ.175 కోట్ల ఖర్చుతో 18 కి.మీ. మేర పూర్తి చేసింది. మిగిలిన 4 కి.మీ.లు పూర్తి చేస్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి రాజధానికి ఆ చివరన బోరుపాలెం వరకు అద్భుతమైన రహదారి సిద్ధమవుతుంది. వైకాపా ప్రభుత్వం కావాలనే దాన్ని వదిలేసింది. కరకట్ట రోడ్డును విస్తరిస్తామని ఏడాది క్రితం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.150 కోట్ల ఈ ప్రాజెక్టులో ఇప్పటికి ఖర్చు పెట్టింది రూ.4 కోట్లు మాత్రమే.

రేపు మరో ప్రభుత్వం వచ్చి మళ్లీ రాజధాని మారుస్తామంటే?

* అమరావతిలో ఇప్పటికే వెచ్చించిన రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని నేలపాలు చేస్తూ... మీరు అనుకున్నట్టే రాజధానిని విశాఖకు మార్చేసి, అక్కడ మళ్లీ భారీగా డబ్బు వెచ్చించారనుకుందాం.

* ఏడాదిన్నరలో ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చి రాజధానిని మరో ప్రాంతానికి మారుస్తామంటే కుదిరే పనేనా?

* ప్రభుత్వం రాజకీయ స్వార్థంతో ఇష్టారాజ్యంగా విధానాలు మార్చుకుంటూ పోతే అది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం కాదా?

* విధానాల్లో స్థిరత్వం లేకపోతే పెట్టుబడిదారులు వస్తారా?

* రాష్ట్ర అభివృద్ధికి అది గొడ్డలిపెట్టు కాదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.