ETV Bharat / city

Drone : డ్రోన్లను ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ

author img

By

Published : Jun 30, 2021, 8:56 AM IST

డ్రోన్ల(Drone) దాడులను ఎదుర్కొనేందుకు సరికొత్త టెక్నాలజీని డీఆర్​డీవో(DRDO) అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌), మరో ల్యాబ్‌తో కలిసి యాంటీ డ్రోన్‌ టెక్నాలజీలను తక్కువ వ్యవధిలో అభివృద్ధి చేసింది.

anti drone technology, drdo
యాంటీ డ్రోన్ టెక్నాలజీ, డీఆర్​డీఓ, డీఆర్​డీవో

డ్రోన్ల(Drone) దాడులను ఎదుర్కొనే రెండు వినూత్న సాంకేతికతలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. నిషేధిత ప్రాంతాల్లోకి యూఏవీలు చొచ్చుకొస్తుండడం, బాంబు దాడుల దృష్ట్యా వీటిని కూల్చే సాంకేతికతపై డీఆర్‌డీవో(DRDO) కొంతకాలంగా పనిచేస్తోంది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌), మరో ల్యాబ్‌తో కలిసి యాంటీ డ్రోన్‌ టెక్నాలజీలను తక్కువ వ్యవధిలో అభివృద్ధి చేసింది. ఇప్పటికే వీటిని ప్రాథమికంగా పరీక్షించి చూశారు. డ్రోన్లను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాలు విజయవంతం కావడంతో భారత సైన్యం ముందు ఈ సాంకేతికతను ప్రదర్శించారు. మరిన్ని పరీక్షల అనంతరం త్రివిధ దళాలకు యాంటీ డ్రోన్‌ సాంకేతికతను అందజేయనున్నారు.

చిన్నవే కానీ.. ఎన్నో సవాళ్లు

భారీ క్షిపణులను, విమానాలను, చివరికి శాటిలైట్లను కూల్చే సాంకేతికత ఉన్న భారత్‌కు.. చిన్నపాటి డ్రోన్లను అడ్డుకోవడం నిజంగా సవాలే. మన భూభాగం, గగనతలంలోకి చొచ్చుకొచ్చే శత్రుదేశాల క్షిపణులను, విమానాలను.. రాడార్ల సాయంతోనే గుర్తించి ధ్వంసం చేస్తుంటారు. డ్రోన్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటూ తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి కాబట్టి రాడార్లు గుర్తించడం కష్టం. వీటికోసం లేజర్‌ ఆయుధాలు, డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్స్‌ (డీఈడబ్ల్యూ)పై డీఆర్‌డీవో ముందుగానే పరిశోధనలు మొదలుపెట్టింది. హైదరాబాద్‌ కేంద్రంగానే ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి కొత్త సాంకేతికతలపై పరిశోధనలు మొదలెట్టారు. చాలారకాల ప్రయోగాలు చేపట్టారు.

ఎలా అడ్డుకుంటాయి?

డ్రోన్లు(Drone) గాల్లో ఎగిరేటప్పుడు ప్రత్యేకమైన శబ్దం వస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో ఆపరేటర్‌ వీటిని ఎక్కడో దూరంగా ఉండి నడిపిస్తుంటారు. ఇందుకోసం ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌లతో జత చేస్తారు. వీటిలో ఒకటి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ లింక్‌లను జామ్‌ చేయడం ద్వారా డ్రోన్లను పనిచేయకుండా చేస్తుంది... రెండోది లేజర్‌ ఆధారిత డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌ ద్వారా డ్రోన్ల ఎలక్ట్రానిక్స్‌ను దెబ్బతీస్తుంది. మొదటిది 3 కి.మీ. పరిధి లోపల ఉన్న డ్రోన్లను గుర్తించి జామ్‌ చేయగలిగితే.. కిలోమీటరు నుంచి రెండున్నర కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను లేజర్‌ ఆయుధం దెబ్బతీయగలదని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి. డైరెక్టడ్‌ ఎనర్జీ వెపన్స్‌తో అధిక శక్తితో డ్రోన్లను ఆకాశంలోనే మసి చేసేయగలవు. ఒక్కొక్కటిగా వచ్చినా.. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వచ్చినా ఎదుర్కొనేందుకు, కూల్చివేసేందుకు కావాల్సిన సాంకేతికతను డీఆర్‌డీవో సిద్ధం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.