ETV Bharat / city

కలచెదిరి.. రక్తమోడి..  అమెరికా టికెట్లు బుక్కయ్యాయి.. కానీ..!

author img

By

Published : Jul 9, 2021, 5:37 PM IST

ఉన్నత ఆశలు..అంతలోనే రాలిపోయాయి. విదేశీ యానం..ఆపదతో ముగిసిపోయింది. కలల ప్రపంచం..దరిచేరని అలగా మారింది. నవదంపతుల జీవన ప్రయాణం..విషాద తీరాలకు చేరింది. పెళ్లి ఆనందం.. ఇరవై రోజుల్లోనే ఆవిరైంది. ఆ ఇంటి గుమ్మం..కన్నీటి సంద్రమైంది.

couple
couple

నవ దంపతుల జీవన ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం పెళ్లి ఆనందాన్ని చెరిపేసింది.. ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. అనంతపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఎన్‌ఆర్‌ఐ ఉద్యోగులు బుధవారం రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అనంతపురానికి చెందిన విష్ణువర్దన్‌(28), కడపకు చెందిన కుల్వ కీర్తి(25) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. గత జూన్‌ 19న వీరికి పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. రెండు రోజుల కిందట బెంగళూరులోని బంధువుల వద్దకు వెళ్లారు. బుధవారం కారులో అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. బొమ్మేపర్తి గ్రామ సమీపంలో రోడ్డు దాటే సమయంలో ద్విచక్ర వాహనం కారుకు అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించబోయి కారు డివైడరును ఢీకొట్టి అటువైపు దారిలో వస్తున్న కంటైనర్‌కు ఢీకొని, రోడ్డు దిగువన ఉన్న గోతిలో పడింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు 108లో కుల్వ కీర్తిని అనంత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. విష్ణువర్దన్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందాడు. రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విష్ణువర్దన్‌ తండ్రి సుధాకర్‌ నాయుడు సహాయ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కీర్తి తండ్రి కడపలో పంచాయతీరాజ్‌శాఖలో డీఈగా పనిచేస్తున్నారు. దంపతులిద్దరూ ఈ నెల 25న అమెరికాకు తిరుగు ప్రయాణం కోసం విమాన టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇదీ చూడండి : కరోనా కాటుతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.