ETV Bharat / city

Organic Cultivation in Sri Lanka : ఒకేసారి నూరు శాతం సేంద్రియం.. పర్యవసానాలు ఏంటి?

author img

By

Published : Oct 19, 2021, 7:00 AM IST

ఏడాదిగా ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నూరుశాతం సేంద్రియ వ్యవసాయ విధానాన్ని(Organic Cultivation in Sri Lanka) అమలు చేయాలని గతంలో తీసుకొన్న నిర్ణయం ఎలాంటి పర్యవసానాలకు దారి తీస్తోంది? ఆహారభద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తోందా? ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఇంకా అతలాకుతలం చేస్తుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Organic Cultivation in Sri Lanka
Organic Cultivation in Sri Lanka

శ్రీలంకలో ఆ ప్రభుత్వం తీసుకున్న వంద శాతం సేంద్రియ వ్యవసాయ విధానం(Organic Cultivation in Sri Lanka) నిర్ణయం.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని వ్యవసాయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రానున్న రెండేళ్లలో ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. దశలవారీగా కాకుండా ఒకేసారి ‘నూరు శాతం(Organic Cultivation in Sri Lanka)’ లక్ష్యంతో వెళ్లే దేశంలో ఆహారభద్రత సమస్య వస్తుందని అంతర్జాతీయంగా సేంద్రియ వ్యవసాయంపై అధ్యయనం చేసిన పరిశోధకులు కూడా హెచ్చరిస్తున్నారు. దిగుమతి చేసుకొనే ఎరువులను రైతులకు సబ్సిడీపై అందిస్తామని 2019 ఎన్నికల్లో రాజపక్స హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లలోనే దీనికి భిన్నమైన నిర్ణయం తీసుకొన్నారు. అన్ని రకాల ఎరువులు, క్రిమిసంహారక మందుల దిగుమతిని నిషేధిస్తూ నూరుశాతం సేంద్రియ సేద్యం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 6న ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘‘ప్రభుత్వ నిర్ణయం(Organic Cultivation in Sri Lanka) ధాన్యం పండించే రైతులు, టీ, మిరియాలు, దాల్చినచెక్క ఉత్పత్తిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లక్షా ఏడువేల హెక్టార్లలో రబ్బరు సాగు చేస్తే, ఇందులో 20వేల హెక్టార్లకు ఆకు తెగులు వస్తుంది. క్రిమిసంహారక మందులు లేకపోతే 15 నుంచి 20 శాతం వరకు రబ్బరు ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. అన్ని వర్గాల నుంచి ఒత్తిడితో దిగుమతి చేసుకొనే సేంద్రియ ఎరువులో పదిశాతం న్యూట్రియంట్స్‌ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది’’ అని ఓ వ్యవసాయ ఆర్థికవేత్త తెలిపారు.

భూటాన్‌ అనుభవం ఇలా...

2020 నాటికి నూరుశాతం సేంద్రియ సాగు(Organic Cultivation in Sri Lanka) అమలు చేస్తామని 2008లో భూటాన్‌ ప్రకటించింది. 2018లో ఈ విధానాన్ని మార్చుకొంది. దీనికి కారణం వ్యవసాయ దిగుబడులు తగ్గడంతోపాటు ఆహార పదార్థాల దిగుమతి గణనీయంగా పెరగడమే. 2035 నాటికి నూరుశాతం అమలు చేయాలన్నది తాజా లక్ష్యం. మన దేశంలో 2003లో సిక్కిం ఈ నిర్ణయం తీసుకోగా 13 ఏళ్ల తర్వాత సేంద్రియ సాగు పూర్తిగా అమలు చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే సిక్కింలో మొదటి నుంచి రసాయనిక ఎరువుల వినియోగం తక్కువ. ఇలాంటి సానుకూల వాతావరణం ఉన్న చోటే 13 ఏళ్లు పట్టిందని, అలాంటిది శ్రీలంక అకస్మాత్తుగా నూరు శాతం సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేయాలన్న నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని ఓ వ్యవసాయ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.

.

ఉత్పాదకత, సుస్థిరతే ముఖ్యం

శ్రీలంక ప్రభుత్వ నిర్ణయ ప్రభావం(Organic Cultivation in Sri Lanka) వచ్చే రెండేళ్లలో ఎక్కువగా ఉంటుందని ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) ప్రొఫెసర్‌ రాంకుమార్‌ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంపై అధ్యయనం చేస్తున్న ఆయన రివ్యూ ఆఫ్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ పత్రిక ఎడిటోరియల్‌ బోర్డు సభ్యునిగా ఉన్నారు.

‘‘రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడుతుంటే నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ, ఏమేరకు అవసరమో అంతవరకే వాడాలి. ఇది కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్గదర్శకంలో నేల స్వభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా ఉత్పాదకత, సుస్థిరతను పరిగణనలోకి తీసుకోవాలి. సేంద్రియ ఎరువులను వాడుతూనే అవసరమైన చోట వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన మేరకు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు కూడా వాడాలి. ప్రస్తుతం క్రిమిసంహారక మందులు, ఎరువులు కొంత వరకు నిల్వ ఉంటాయి కాబట్టి సమస్య తీవ్రత కొంత తక్కువగా ఉంటుంది. దీని తీవ్రత ఎంతన్నది పంట కోతలు ప్రారంభమయ్యాక తెలుస్తుంది. 25 నుంచి 30 శాతం వరకు ఉత్పత్తి తగ్గడం వల్ల రానున్న రోజుల్లో ఆహారభద్రతపై ప్రభావం చూపుతుంది. శ్రీలంక టీ పొడి ఎగుమతిపై ఎక్కువగా ఆధారపడి ఉంది. టీ తోటలు సాగు చేసే నేలల్లో నైట్రోజన్‌ తక్కువగా ఉంటుంది. ఈ రంగంపై చూపే ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలు. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వ విధానాల వల్ల ఆహారభద్రత ప్రశ్నార్థకంగా మారడంతోపాటు ధరలు పెరిగాయి’’.

- ప్రొఫెసర్‌ రాంకుమార్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబయి

శ్రీలంక వ్యవసాయ ఆర్థిక వేత్తల సంఘం దేశాధ్యక్షుడు రాజపక్సకు రాసిన లేఖలో ఈ అంశాలను వివరించింది. ‘‘రసాయనిక ఎరువులను పూర్తిగా నిషేధించడం కాకుండా శాస్త్రీయంగా నిరూపితమైన మంచి వ్యవసాయ విధానాలను అనుసరించాలి. మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడకుండా చర్యలు తీసుకోవాలి. చక్కటి వ్యవసాయ పద్ధతులను అనుసరించిన వారికి రాయితీలు ఇవ్వాలి. మంచి ధర కల్పించాలి. ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడటం వల్ల జరిగే నష్టం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలి’’ అని కూడా సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.