ETV Bharat / business

బైక్, కార్ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ మర్చిపోయారా? ఇలా చేయండి!

author img

By

Published : May 30, 2022, 2:55 PM IST

vehicle insurance renewal expires: వాహనం ఏదైనా సరే.. రోడ్డు మీద తిరగాలంటే బీమా ఉండాల్సిందే. కొత్త వాహనం కొన్నప్పుడు బీమా పాలసీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ, తరువాత దీన్ని పునరుద్ధరించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఎవరైనా అడిగినప్పుడు చూద్దాంలే అనే ధోరణితో ఉంటారు. ఇది ఏమాత్రం సరికాదు. పునరుద్ధరణ మర్చిపోతే.. ఏం చేయాలి? తెలుసుకుందాం.

vehicle insurance renewal expires
vehicle insurance renewal expires

vehicle insurance renewal expires: మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ బీమా ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోపే ప్రీమియం చెల్లించి, పునరుద్ధరణ చేసుకోవాల్సిందే. గడువు దాటిన ఒక్క నిమిషం తరువాత ప్రమాదం జరిగినా.. బీమా వర్తించదు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఆ నష్టమంతా వాహనదారుడు భరించాల్సిందే. అంతేకాదు.. బీమా లేకుండా వాహనాన్ని నడిపినప్పుడు రూ.2,000 వరకు జరిమానాతోపాటు జైలు శిక్షకూ అవకాశం ఉంది. కాబట్టి, బీమా లేని వాహనాన్ని నడపకుండా ఉండటమే శ్రేయస్కరం. మరోవైపు ఇలా గడువు దాటిన వాహనాలకు తిరిగి పాలసీ ఇచ్చేందుకు బీమా సంస్థలు కొన్ని నిబంధనలు పాటిస్తాయి. వాహనాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేస్తాయి. బీమా సంస్థల దగ్గరకు వెళ్లి వాహనాన్ని చూపించడం, లేదా సంబంధిత సంస్థ ప్రతినిధి వచ్చి తనిఖీ చేస్తారు. ఇప్పుడు బీమా సంస్థలు వీడియో ఇన్‌స్పెక్షన్‌నూ నిర్వహిస్తున్నాయి.

మీ వాహన బీమా పాలసీ గడువు ముగిసిందని గుర్తించిన వెంటనే బీమా సంస్థను సంప్రదించి, పునరుద్ధరణ చేసుకోవాలి. ఒకవేళ మీరు పాలసీని ఏజెంట్‌ ద్వారా తీసుకుంటే వారిని సంప్రదించి, ఆ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేస్తే.. బీమా సంస్థ వెబ్‌సైటుకు వెళ్లి, పాలసీని సులభంగా రెన్యువల్‌ చేయొచ్చు. గతంలో పాలసీ తీసుకున్న బీమా సంస్థ పనితీరు నచ్చకపోతే మరో కంపెనీకి మారిపోవచ్చు. అన్ని సంస్థల బీమా ప్రీమియాలు, సేవలను పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకోండి.

నో క్లెయిం బోనస్‌..: పూర్తి స్థాయి వాహన బీమా పాలసీకి నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) ఎంతో కీలకం. ప్రీమియం తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. క్లెయిం చేయని ఏడాదికి 20 శాతం వరకు ఎన్‌సీబీ వర్తిస్తుంది. ఇది క్రమంగా పెరుగుతూ.. 50 శాతం వరకు చేరుకుంటుంది.

పాలసీ గడువు తీరాక బీమా వర్తించదు. కానీ, 90 రోజుల్లోపు తిరిగి పాలసీని అమల్లోకి తీసుకొచ్చేందుకు బీమా సంస్థలు అనుమతినిస్తున్నాయి. ఈ వ్యవధిలో పాలసీని పునరుద్ధరించుకున్నా ఎన్‌సీబీ ప్రయోజనం దూరం కాదు. ప్రీమియం మొత్తంలో దాదాపు 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది కాబట్టి, ఎన్‌సీబీ లాభాన్ని దూరం చేసుకోకుండా పాలసీని కొనసాగించాలి.

తేదీకి ముందుగానే..: వాహన బీమా గురించి చాలామంది అంతగా ఆసక్తి చూపించరు. దీంతో పునరుద్ధరణ మర్చిపోతుంటారు. ఎన్నో పాలసీలు రద్దు కావడానికి ప్రధాన కారణాలు ఇవే. బీమా సంస్థలు ఎప్పటికప్పుడు రెన్యువల్‌కు సంబంధించిన సమాచారం పంపిస్తూనే ఉంటాయి. యాప్‌లలో పాలసీ వివరాలు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని గమనిస్తూ ఉండాలి. వీలైనంత వరకూ గడువు తేదీకి కనీసం ఒక రోజు ముందైనా పాలసీకి ప్రీమియం చెల్లించడం వల్ల అనవసర ఇబ్బందులను తప్పించుకోవచ్చు.

ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడులు భద్రమేనా? ఈటీఎఫ్​తో లాభమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.