ఆ మాటలు నమ్మొద్దు.. బీమా మోసగాళ్ల బారిన పడొద్దు!

author img

By

Published : Nov 18, 2022, 4:04 PM IST

precaution for insurance frauds

దేశంలో సైబర్‌ నేరాల రేటు ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఎంతోమంది ఈ మోసాల బారినపడి తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే ఈ మోసగాళ్లకు వరంగా మారుతోంది. అందుకే సున్నితమైన బ్యాంకింగ్‌ లేదా పెట్టుబడుల సమాచారం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బీమా పాలసీలకు సంబంధించి ఇటీవల కాలంలో మోసాలు పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలసీదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.

అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేది బీమా పాలసీలు. జీవిత, ఆరోగ్య, వాహన బీమా.. ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పాలసీ ఉండటం సహజమే. దీంతో పాలసీదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. పాలసీలు రద్దయ్యే ప్రమాదం ఉందని, క్లెయిం చేసుకునేందుకు రుసుము చెల్లించాలని ఇలా రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు.

నకిలీ సందేశాలను గుర్తించండి
బీమా సంస్థ నుంచి సమాచారం వచ్చినట్లుగా భ్రమించేలా పలు సందేశాలు ఇ-మెయిల్‌, మొబైల్‌కు వస్తుంటాయి. ఉదాహరణకు ‘మీ పాలసీ అమల్లో ఉండాలంటే.. మీరు ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని తక్షణమే ఈ లింకును ఉపయోగించి చెల్లించండి’ అంటూ సందేశం వస్తుంది. ముఖ్యంగా ఒకటి రెండు నెలల్లో పాలసీల పునరుద్ధరణ ఉన్నప్పుడు ఇలాంటి సందేశాలు అధికంగా వస్తుంటాయి. మీ పాలసీ ఉన్న బీమా సంస్థ నుంచే ఆ సందేశం వచ్చిందనట్లుగా మిమ్మల్ని నమ్మిస్తారు. ఫోన్‌లో సంప్రదించి, లింకును పంపిస్తున్నట్లు చెబుతుంటారు. మీరు దాన్ని జాగ్రత్తగా గమనిస్తేనే అది నకిలీది అని కనిపెట్టడం సాధ్యం అవుతుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బీమా సంస్థ ఎప్పుడూ ఒక ఖాతాకు డబ్బును పంపించాల్సిందిగా కోరదు. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు ముందుగా బీమా సంస్థ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.

పాస్‌వర్డ్‌లే కీలకం..
చాలామంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో పాలసీలు తీసుకుంటున్నారు. బీమా సలహాదారు, సంస్థ నుంచి నేరుగా పాలసీ తీసుకున్నా సరే అవన్నీ డిజిటల్‌ రూపంలోనే ఉంటాయి. కాబట్టి, ఇన్సూరెన్స్‌ డీమ్యాట్‌ ఖాతాకు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అనుమానాస్పద లింకులు, మాల్వేర్‌, కీలాగింగ్‌ సాఫ్ట్‌వేర్‌ (స్పైవేర్‌ సాధనంగా పనిచేసే ఒక హానికరమైన సాఫ్ట్‌వేర్‌, మీ కంప్యూటర్‌లో కీస్ట్రోక్‌లను ఇది నమోదు చేస్తుంది)లాంటివి మోసగాళ్లు మీ లాగిన్‌ ఆధారాలను గుర్తించేందుకు తోడ్పడతాయి. ఫలితంగా మీ జీవిత బీమా వివరాలు సులువుగా వారికి చేరిపోతాయి. ముఖ్యంగా ఉచిత వై-ఫైలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడంతోపాటు, వాటిని ఎవరికీ చెప్పకూడదు. అదనపు భద్రతా చర్యలనూ తీసుకోండి. తరచూ పాస్‌ వర్డ్‌ను మార్చుకునే ప్రయత్నం చేయండి. ఉచిత వై-ఫైని ఉపయోగించేటప్పుడు బ్యాంకు, పెట్టుబడి, బీమా తదితర ఆన్‌లైన్‌ ఖాతాలను వినియోగించకపోవడమే మంచిది.

క్లెయిం చెల్లిస్తామంటూ..
పాలసీ ఉన్నవారితోపాటు, ఎలాంటి పాలసీలు లేని వారినీ లక్ష్యంగా చేసుకొని, క్లెయిం ఆశ చూపిస్తుంటారు. మీరు దూరపు బంధువుకు చెందిన జీవిత బీమా పాలసీ నామినీ అని లేదా.. మీకు ఏదో ఒక సంస్థ ఉచితంగా బీమా పాలసీని అందించిందని చెబుతూ సందేశాలు లేదా ఫోన్లు వస్తుంటాయి.

పాలసీ మొత్తాన్ని క్లెయిం చేసుకునేందుకు మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా చెబుతుంటారు. క్లెయిం మొత్తం పొందాలంటే కొంత రుసుము చెల్లించాలని చెబుతుంటారు. చాలా సందర్భాల్లో మోసగాళ్లు చెప్పే మాటలు నిజం అనే అనుకుంటాం. చిన్న మొత్తమే కదా అని చెల్లిస్తుంటాం. వాస్తవంగా బీమా క్లెయింలను చెల్లించేందుకు ఏ బీమా సంస్థా నామినీని డబ్బు అడగదు. మీరు ఏదైనా పాలసీకి నామినీగా ఉంటే.. క్లెయిం చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేరుగా బీమా సంస్థనే సంప్రదించండి.

రెట్టింపు అవుతుందంటూ..
‘మూడేళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు.. మీ డబ్బు రెట్టింపు అవుతుంది’ లేదా ఆకర్షణీయ ఆఫర్ల గురించి చెబుతూ ఫోన్లు వస్తుంటాయి. ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. ఇలాంటి హామీలు ఎప్పుడూ నిజం కాదని గుర్తుంచుకోండి. మీరు ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటే బీమా సంస్థ అధీకృత ఏజెంటు, శాఖ, వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించండి. బీమా సంస్థ వెబ్‌సైటులో ఆ పాలసీ గురించి వివరాలున్నాయా తెలుసుకోండి.

పాలసీలపై అవగాహన..
మీరు ఏ పాలసీ తీసుకున్నా.. దానిపై పూర్తి అవగాహన ఉండాలి. ఏ రకం పాలసీ, ప్రీమియం చెల్లింపు వ్యవధి, ఎన్నాళ్లు చెల్లించాలి అనేది తెలుసుకోవాలి. పాలసీ పత్రాన్ని నిశితంగా పరిశీలించాలి. సందేహాలుంటే మీ ఏజెంటు లేదా బీమా కంపెనీని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. అప్పుడే మధ్యలో ఎవరైనా ప్రీమియం చెల్లించాలి లేదా రుసుములు చెల్లించాలని అడిగినప్పుడు మోసాన్ని ఊహించగలరు. సైబర్‌ నేరగాళ్ల నుంచి కాపాడుకునేందుకు ఎవరికి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. కుటుంబ సభ్యులకూ వీటిపై ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి. అప్పుడే వీటిని తప్పించుకోగలం. మోసం జరిగిందని గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది. సంబంధిత సంస్థలకూ లిఖిత పూర్వకంగా తెలియజేయాలి.

- అనిల్‌ పీఎం, ప్రెసిడెంట్‌- లీగల్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఇవీ చదవండి: దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఈ పాలసీలే ఉత్తమం!

50 ఏళ్లకే రిటైర్‌.. 80ఏళ్ల వరకు ఫుల్ ఎంజాయ్.. ఇలా ప్లాన్ చేస్తే సాధ్యమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.