50 ఏళ్లకే రిటైర్‌.. 80ఏళ్ల వరకు ఫుల్ ఎంజాయ్.. ఇలా ప్లాన్ చేస్తే సాధ్యమే!

author img

By

Published : Nov 16, 2022, 6:37 PM IST

retirement-at-50

ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. ఓవైపు, సగటు ఆయుర్దాయం మాత్రం 80కి చేరింది. మరి ఈ మిగిలిన 30 ఏళ్లు ఎలా జీవించాలనే విషయంపై నిపుణుల సలహాలు ఏంటంటే..

ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. పదవీ విరమణ తర్వాత మిగతా 30 ఏళ్లు ఎలా జీవించాలి.. ఇదే విషయంపై ఆన్‌లైన్‌ బ్రోకరేజీ ప్లాట్‌ఫాం జెరోధా సహ-వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ ట్విటర్‌ వేదికగా జెన్‌-జెడ్‌ (25 ఏళ్ల లోపు వారికి) యువతకు కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు. అవేమిటంటే...
'50 - 80 ఏళ్లు.. ఈ దశలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలి. ఒకప్పుడు పదవీ విరమణ నిధి కోసం స్థిరాస్తులు, స్టాక్‌ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు తోడ్పడ్డాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేద'ని నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు.

నితిన్‌ ఇంకా ఏం చెబుతున్నారంటే..
మీకు అప్పు ఇవ్వడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. వారి వలలో చిక్కుకోవద్దు. అవసరం లేని వస్తువులు కొనడానికి రుణాలు తీసుకోవద్దు. విలువ తగ్గే వస్తువులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

  • పొదుపును వీలైనంత తొందరగా ప్రారంభించండి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జీ-సెక్యూరిటీలు, ఇండెక్స్‌ ఫండ్లు/ఈటీఎఫ్‌లలో క్రమానుగత పెట్టుబడి (సిప్‌) ఇలా వైవిధ్యంగా మదుపు చేయండి. దీర్ఘకాలిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు షేర్లు ఇప్పటికీ మంచి మార్గమే.
  • వ్యక్తిగతంగానూ, కుటుంబం అంతటికీ వర్తించేలా ఒక సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. చాలామంది ఆర్థికంగా కొన్నేళ్లు వెనక్కి వెళ్లడానికి కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం కారణం అయిన సందర్భాలున్నాయి. యాజమాన్యం నుంచి అందే బృంద బీమాతో పాటు, సొంతంగా ఒక పాలసీని తీసుకోవడం తప్పనిసరి.
  • మీపై ఆధారపడిన వారుంటే.. తప్పనిసరిగా తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు పాలసీ నుంచి వచ్చిన డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేసినా, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చేలా ఉండాలి.
  • తొందరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలంటే రుణాలు తీసుకోవడం ఆపేయాలి.
nitin kamat
నితిన్ కామత్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.