యులిప్​ ప్లాన్‌లో మదుపు చేయాలా వద్దా?.. నిపుణుల మాటేంటి..

author img

By

Published : May 15, 2023, 9:12 AM IST

Updated : May 15, 2023, 9:19 AM IST

ulip investment risk

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌లో పెట్టుబడి పెట్టేముందు ప్రతి మదుపుదారుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి, అవేంటో తెలుసుకుందా..

Ulip Is Good Or Bad : బీమా కంపెనీలు అన్నీ దాదాపుగా యులిప్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. పెట్టుబడిదారులకు బీమాతో పాటు మార్కెట్‌ పెట్టుబడిని ఈ పథకాలు అందిస్తాయి. కానీ యులిప్‌లలో పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

మార్కెట్‌-లింక్డ్ రిటర్న్స్
యులిప్‌లు మీ పెట్టుబడిని ఈక్విటీ, డెట్‌, రెండింట్లో పెట్టటం ద్వారా మార్కెట్‌-లింక్డ్‌ రాబడిని అందిస్తాయి. అయితే, పెట్టుబడి పెట్టేది మార్కెట్‌లో కాబట్టి, కచ్చితంగా రాబడి వస్తుందని గ్యారంటీ లేదు. రాబడి అస్థిరంగా ఉండొచ్చు. ఒక్కోసారి నష్టాలూ చవిచూడొచ్చు. రిస్క్ తీసుకోవటం ఇష్టం లేని వారు ఇలాంటి మార్కెట్ ఆధారిత పథకాల నుంచి దూరంగా ఉండటమే మంచిది.

జీవిత బీమా కవరేజీ
యులిప్‌లు పెట్టుబడి ప్రయోజనాలతో పాటు జీవిత బీమా కవరేజీని కూడా అందిస్తాయి. మీ ప్రీమియంల్లో కొంత భాగాన్ని బీమా కవరేజీకి కేటాయించి.. మిగిలిన మొత్తం మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. అయితే, పూర్తిగా ఇది బీమా పాలసీ అయినప్పటికీ.. బీమా కవరేజీ తక్కువగానే ఉంటుంది.

లాక్‌-ఇన్‌ పీరియడ్‌
యులిప్‌లకు లాక్‌-ఇన్‌ పీరియడ్ వ్యవధి 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ లాక్‌-ఇన్‌ పీరియడ్ సమయంలో మీ మదుపును ఉపసంహరించుకోలేరు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రొత్సహించడంలో సహాయపడుతుంది. మీకు స్వల్పకాలంలో లిక్విడిటీ అవసరమైతే ఇది ప్రతికూలంగా ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద యులిప్‌లు.. పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. ప్రీమియం చెల్లింపులపై మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఐటీ చట్టంలోని సెక్షన్‌ 10(10డి) కింద అసలు, రాబడి కూడా పన్ను రహితం.

లాయల్టీ అడిషన్స్‌
కొన్ని యులిప్‌లు లాయల్టీ జోడింపులను అందిస్తాయి. ఇవి నిర్దిష్ట కాలానికి పెట్టుబడి పెట్టడానికి మీ పాలసీకి జోడించిన అదనపు బోనస్‌లు/యూనిట్లు. కానీ ఇవి నామమాత్రమే.

ఛార్జీలు
పాలసీదారునికి.. యులిప్‌లు అనేక ఛార్జీలను విధిస్తాయి. ప్రీమియం కేటాయింపు ఛార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఛార్జీలు, మోర్టాలిటీ చార్జీలు, సరెండర్‌ ఛార్జీలతో సహ వివిధ ఛార్జీలు, రుసుములతో వస్తాయని గుర్తుంచుకోవాలి.
ఈ ఛార్జీల్లో ఒక్కో పాలసీకి ఒకలా మార్పులు ఉండొచ్చు. పెట్టుబడి పెట్టేముందు వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నిపుణుల మాట
పెట్టుబడి, జీవిత బీమా అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఎప్పుడూ ఈ రెండింటిని కలపకూడదు. రెండింటినీ వేరు చేసి మంచి బీమా కవరేజీ, అధిక రాబడిని పొందటానికి ప్రయత్నించాలి. సాధారణంగా బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పాలసీలలో తక్కువ బీమా కవరేజీతో పాటు, రాబడి సైతం తక్కువగానే పొందుతారు. మీపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఉంటే తప్పకుండా టర్మ్‌ బీమా పాలసీని తీసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి దాదాపు 10-15 రెట్లు బీమా హామీ ఉంటే మేలు. మీ దగ్గర మిగులు నిధులు ఉన్నప్పుడు.. పీపీఎఫ్‌ లాంటి పథకాల్లో పొదుపు చేస్తే అస్సలు రిస్క్‌ ఉండదు. రిస్క్‌ తీసుకోవాలనుకుంటే.. మ్యూచువల్‌ ఫండ్‌, ఎన్‌పీఎస్‌ లాంటి పథకాలను ఎంచుకోవచ్చు.

చివరిగా
యులిప్‌లలో పెట్టుబడి పెట్టేముందు నిబంధనలు, షరతులు, ఛార్జీలు, పెట్టుబడి ఎంపికలను తెలుసుకోవాలి. పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. ఒకవేళ ఇప్పటికే పొరపాటున పాలసీ తీసుకున్నట్లయితే, ఫ్రీ లుక్‌ పీరియడ్‌ (15 నుంచి 30 రోజులు)లోపు రద్దు చేసుకోవచ్చు. చెల్లించిన ప్రీమియంను వాపసు చేస్తారు.

Last Updated :May 15, 2023, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.