ETV Bharat / business

మూతపడ్డ బ్యాంక్​పై మస్క్​ కన్ను.. కొనేందుకు రెడీ.. అదిరిపోయే ప్లాన్​తో..

author img

By

Published : Mar 12, 2023, 11:18 AM IST

twitter ceo elon musk buy silicon valley bank
twitter ceo elon musk buy silicon valley bank

ఆర్థిక సంక్షోభం కారణంగా మూసివేసిన అమెరికాకు చెందిన సిలికాన్​ వ్యాలీ బ్యాంక్​ను కొనుగోలు చేయడానికి ఎలాన్​ మస్క్​ ముందుకు వచ్చారు. ఈ బ్యాంకును తాను కొనుగోలు చేశాక దాన్ని డిజిటల్​ బ్యాంకుగా మారుస్తానని ఓ ట్వీట్​ ద్వారా వెల్లడించారు.

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(SVB) సంక్షోభంపై ట్విట్టర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తనదైన శైలిలో స్పందించారు. సంక్షోభంలో ఉన్న SVBను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమని మస్క్‌ ప్రకటించారు. SVBని డిజిటల్‌ బ్యాంక్‌గా మారుస్తానంటూ ట్వీట్‌ చేశారు. SVBని ట్విట్టర్‌ కొనుగోలు చేసి డిజిటల్‌ బ్యాంక్‌గా మార్చాలని ఎలక్ర్టానిక్‌ కంపెనీ రెజర్‌ సీఈవో మిన్‌ లియోంగ్‌ టన్‌ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. దానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంకును మూసివేస్తున్నట్లు.. ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎఫ్​డీఐసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

సిలికాన్​ వ్యాలీ బ్యాంక్​.. అమెరికాలోని 16వ అతిపెద్ద బ్యాంక్. ప్రపంచ వ్యాప్తంగా టెక్​ స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆర్థిక సంక్షోభం కారణంగా దీన్ని శుక్రవారం మూసివేసారు. ఈ బ్యాంకు ఆకస్మిక మూసివేత అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2022 నాటికి 209 బిలియన్ డాలర్ల ఆస్తులు, 175.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు కలిగి ఉంది.. సిలికాల్​ వ్యాలీ బ్యాంక్​. ప్రస్తుతం ఈ బ్యాంకు మూసివేత.. ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు తమ వాటాలను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బ్యాంకులో తక్కువ మొత్తంలో నగదు అందుబాటులో ఉందని.. రెండు రోజుల వరకు ఎవరూ డబ్బును ఉపసంరించుకోవద్దని SVB సూచించింది. నగదు విషయంలో ఎలాంటి భయాలు వద్దని ఎస్​వీబీ బ్యాంక్​ తమ వినియోగదారులకు లేఖ రాసినా సరే డిపాజిట్ల ఉపసంహరణ మాత్రం ఆగడం లేదు. గురువారం ఒక్కరోజే పెట్టుబడుదారులు, డిపాజిటర్లు కలిసి దాదాపు 42 బిలియన్​ డాలర్ల ఉపసంహరణకు ప్రయత్నించినట్లు ఎఫ్​డీఐసీ వెల్లడించింది.

మస్క్ ఐడియా అదేనా?
ఇకపోతే.. మస్క్ సైతం బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఆ యాప్​లో నగదు బదిలీ ఆప్షన్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. గూగుల్​ పే, ఫోన్​ పే తరహాలో పేమెంట్స్ కోసం ట్విట్టర్​ను సైతం ఉపయోగించుకోవచ్చని గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే SVB బ్యాంకును కొనుగోలు చేస్తానని ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ ద్వారా తాను కొత్తగా ప్రవేశపెట్టనున్న డిజిటల్​ చెల్లింపుల వ్యవస్థకు ఈ బ్యాంకు కొనుగోలు వల్ల మరింత ఊతం అందుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ట్విట్టర్ డిజిటల్ చెల్లింపులు ఎలా?
కొన్ని రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చిన బ్లూటిక్​ సబ్​స్క్రిప్షన్​ విధానమే.. ట్విట్టర్​లో డిజిటల్​ చెల్లింపులకు బాటలు వేస్తుందని అడ్వర్టైజర్లకు వివరించారు మస్క్. బ్లూటిక్​ సబ్​స్క్రైబర్లు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్​ కార్డ్​తోనే సైన్​అప్​ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను ఉపయోగించి ట్విట్టర్​ ద్వారా తమ వినియోగదారులు ఇతరులకు డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చని గతంలో మస్క్​ వెల్లడించారు. బ్యాంకు ఖాతాకు బదులు.. ట్విట్టర్​లో అకౌంట్​ క్రియేట్​ చేసుకుని దీని ద్వారా నగదు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని.. దీనిలో జమ చేసిన వినియోగదారులకు అధిక వడ్డీ కూడా అందిస్తామని తెలిపారు. దీంతోపాటుగా డెబిట్ కార్డ్​లు, చెక్​లు జారీ చేసి.. ఈ వ్యవస్థను సాధ్యమైనంతగా విస్తరిస్తామని గతేడాది నవంబర్​లో ఎలాన్ మస్క్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.