ETV Bharat / business

అమెరికాలో అతిపెద్ద బ్యాంక్​ సిలికాన్ వ్యాలీ మూసివేత.. మార్కెట్లు కుదేల్​!

author img

By

Published : Mar 11, 2023, 5:17 PM IST

అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా ఖ్యాతినార్జించిన.. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(SVB) మూసివేత ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ఆకస్మిక పతనం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మూసివేసిన అతిపెద్ద బ్యాంక్‌గా SVB నిలిచింది. SVB మూసివేత.. ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు ఈ బ్యాంక్‌ నుంచి 42 బిలియన్‌ డాలర్లను ఉపసంహరణకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి భయం వద్దంటూ వినియోగదారులకు SVB యాజమాన్యం లేఖ రాసినా డిపాజిట్ల ఉపసంహరణ మాత్రం ఆగలేదు.

silicon valley bank
silicon valley bank

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే.. అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంకును షట్‌డౌన్‌ చేస్తూ ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎఫ్​డీఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటనతో అమెరికా మార్కెట్లో అంకుర పరిశ్రమ షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఈ బ్యాంక్‌ను నియంత్రణ సంస్థలు మూసివేయడమే కాకుండా ఆస్తులను జప్తు చేసి ఎస్​వీబీ మాతృ సంస్థ SVB ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేరు దాదాపు 60 శాతం పడిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ తర్వాత మూసివేసిన అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా SVB నమోదైంది.

శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే SVB.. టెక్‌ ఆధారిత వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లకు నిధులు అందిస్తుంది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ మాతృసంస్థ అయిన.. SVB ఫైనాన్షియల్‌ గ్రూప్‌ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకుని.. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను, 2.25 బిలియన్‌ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటనతో SVB పతనం ప్రారంభమై.. బ్యాంకు వైఫల్య పరిణామాలు వేగంగా జరిగాయి. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చని SVB చేసిన ప్రకటన ఈ పతనాన్ని మరింత పెంచింది. బ్యాంక్‌ను FDCI షట్‌డౌన్‌ చేసిందన్న వార్తల నేపథ్యంలో SVB ఆస్తుల విలువ మంచులా కరిగి.. 209 బిలియన్ల డాలర్ల నుంచి 175.4 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేయడం వల్ల ఈ 175.4 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ప్రస్తుతం ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ FDIC నియంత్రణలో ఉన్నాయి. అమెరికా, యూరప్‌లలో బ్యాంక్ షేర్లు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత సెప్టెంబరులో 406 డాలర్ల వద్ద ఉన్న SVB ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేరు, ప్రస్తుతం 106 డాలర్లకు పతనమైంది. గత 5 రోజుల్లోనే ఈ బ్యాంక్​ షేరు విలువ 178 డాలర్లకు పైగా క్షీణించింది.

SVB ప్రకటన రావడం వల్ల మదుపర్లు బ్యాంకులో చేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. డిపాజిటర్లు, పెట్టుబడిదారులు గురువారం ఒక్కరోజే 42 బిలియన్‌ డాలర్ల ఉపసంహరణకు ప్రయత్నించినట్లు FDCI వెల్లడించింది. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వెంచర్‌ క్యాపిటలిస్టులు బ్యాంకులో ఉన్న పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని.. డబ్బును విత్​డ్రా చేసుకోవాలని తమ పోర్ట్‌ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ ప్రకటనలతో SVB ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేర్లు.. గత 35 ఏళ్లలోనే అత్యంత దారుణంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60శాతం షేర్లు క్షీణించడం వల్ల బ్యాంక్​కు 80 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. తగినంత నగదు లేకపోవడం వల్ల చెక్‌లు, ఇతర లావాదేవీలు బ్యాంక్‌లో జరగలేదని ఫెడరల్ రిజర్వ్ వెల్లడించింది. గురువారం వరకు SVB మంచి ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటికీ.. భారీగా ఉప సంహరణకు యత్నించడం వల్ల బ్యాంక్‌ దివాలా తీసిందని ఓ నివేదిక వెల్లడించింది.

అమెరికా అంకురాలకు SVBకి విడదీయలేని సంబంధం ఉంది. సిలికాన్‌ వ్యాలీ, టెక్‌ అంకుర సంస్థలకు ఈ బ్యాంకే ఆర్థిక సహాయం చేస్తోంది. అమెరికాలోని సగం వెంచర్‌ క్యాపిటల్‌ మద్దతున్న అంకుర సంస్థలతో ఇది వ్యాపారం చేస్తోంది. అమెరికాలో 44 శాతం టెక్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీలకూ ఈ బ్యాంకే ఆధారం. అందుకే అంకుర, టెక్‌ పరిశ్రమల్లో భయాందోళనలు మొదలయ్యాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ అనేది ఎక్కువ టెక్‌ పరిశ్రమకే రుణాలు ఇవ్వడం వల్ల.. ఈ పరిణామం ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఇలాంటి పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు.

ఇవీ చదవండి : ట్విట్టర్​కు పోటీగా కొత్త యాప్.. రంగంలోకి దిగుతున్న మెటా!​

ఫేస్​బుక్ ఉద్యోగులకు మరో షాక్.. 11 వేల మందికి ఉద్వాసన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.