ETV Bharat / business

త్వరపడండి.. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు తరుణమిదే!

author img

By

Published : Jul 8, 2022, 3:56 PM IST

The last date for filing income tax returns is July 31
త్వరపడండి.. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు తరుణమిదే..

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను జులై 31వ తేదీలోగా సమర్పించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల ఎలాంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది? రిటర్నుల దాఖలులో పొరపాటు జరిగితే ఏమవుతోంది? విధిగా పన్ను కట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి?

గత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను ఆదాయపు పన్ను రిటర్నులు ఈ నెలాఖరులోగా దాఖలు చేయాలి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) ఈ గడువు వరిస్తుంది. ఫారం-16, టీడీఎస్‌ సర్టిఫికెట్లు, మూలధన రాబడి వివరాలు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, ఫారం 26ఏఎస్‌, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లన్నీ ఒకసారి పరిశీలించుకోవాలి. ఆదాయం, పన్ను చెల్లింపు, జమల్లో ఏదైనా తేడాలున్నాయా గమనించాలి.

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారుడు ఎలాంటి పత్రాలనూ జమ చేయాల్సిన అవసరం లేదు. కానీ, భవిష్యత్‌లో ఎప్పుడైనా పన్ను అధికారులు వీటిని కోరేందుకు అవకాశం ఉంది. కాబట్టి, మినహాయింపులు క్లెయిం చేసుకున్నప్పుడు సంబంధిత ధ్రువీకరణలను జాగ్రత్త చేసుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం కేవలం చట్టబద్ధమైన ప్రక్రియే కాదు. మీ ఆదాయానికి ఒక గుర్తింపునిస్తుందని గమనించాలి. రుణాలు తీసుకోవాలన్నా, విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇది ఎంతో కీలకమైన పత్రంగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులను ఎవరికి వారే సులభంగా దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైటులో సలహాలు, సూచనలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అవగాహన చేసుకొని, రిటర్నులు దాఖలు చేయొచ్చు. పొరపాట్లు చేస్తే తర్వాత పన్ను అధికారులు ప్రశ్నించేందుకు అవకాశాలున్నాయి.

ముందుగానే సిద్ధం..

ఆదాయపు పన్ను రిటర్నులు సులువుగా చేసేందుకు ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ www.incometax.gov.in లో ఏర్పాట్లు ఉన్నాయి. పాన్‌తో ఈ వెబ్‌సైటులోకి లాగిన్‌ అయి, మీకు వర్తించే రిటర్నుల ఫారాన్ని ఎంచుకోవాలి. వేతనం ద్వారా మీకు అందిన ఆదాయం, బ్యాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీ, డివిడెండ్‌ ఆదాయం తదితరాలన్నీ ముందే నింపి సిద్ధంగా ఉంటాయి. చెల్లించిన పన్ను, మీరు పేర్కొన్న మినహాయింపులూ నమోదై ఉంటాయి. ఇందులో ఏదైనా మార్పులుంటే మీరు చేసుకునే వీలుంది. ఏఐఎస్‌లో మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. ఇందులో మీరు చేసిన అధిక విలువ లావాదేవీలూ తెలుసుకోవచ్చు.

ఫారం 26 ఏఎస్‌తో పోలిస్తే.. ఏఐఎస్‌లో మరిన్ని వివరాలుంటాయి. 26ఏఎస్‌లో పన్ను చెల్లించినప్పుడు మాత్రమే ఆ లావాదేవీలు కనిపిస్తాయి. వార్షిక నివేదికలో వ్యవహారాలన్నీ నమోదు చేసి ఉంటాయి. మీ లభించిన ఆదాయాలకు భిన్నంగా నివేదికలో ఉంటే.. వాటిని పన్ను విభాగం దృష్టికి తీసుకెళ్లవచ్చు. చాలామంది తమకు వచ్చిన వడ్డీ ఆదాయం ఫారం 26ఏఎస్‌లో కనిపించకపోతే విస్మరిస్తుంటారు. కానీ, ఏఐఎస్‌లో వీటిని చూసి, ఆదాయపు పన్ను రిటర్నులలో వాటిని పేర్కొని, వర్తించే పన్ను చెల్లించడం మేలు.

ఎవరికి ఏ పత్రం?

  • ఐటీఆర్‌ 1 (సహజ్‌): రూ.50లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు. వేతనం, ఒకే ఇంటి నుంచి ఆదాయం, వడ్డీ ఆదాయం, రూ.5వేల లోపు వ్యవసాయ ఆదాయం ఉన్నవారికి.
  • ఐటీఆర్‌ 2: రూ.50లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి, విదేశీ ఆస్తులు, ఒక ఇంటికి మించి ఇళ్ల ద్వారా ఆదాయం ఉన్న సందర్భంలో
  • ఐటీఆర్‌ 3: పై ఆదాయాలతోపాటు, వృత్తి, వ్యాపారం ద్వారా లాభ నష్టాలు ఉన్నప్పుడు.
  • ఐటీఆర్‌ 4: వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు రూ.50లక్షలకు మించి ఆదాయం ఉండి, వృత్తి, వ్యాపారం ద్వారా ఆదాయం ఆర్జించేవారికి.

ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో.. బంగారం, వెండి ధరలు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.