ETV Bharat / business

స్విగ్గీ బంపర్ ఆఫర్.. ఇకపై వారంతా మేనేజర్స్.. ఫుల్​టైమ్ జాబ్, సూపర్ సాలరీ!

author img

By

Published : Apr 25, 2022, 4:07 PM IST

Swiggy manager jobs: ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ.. డెలివరీ బాయ్స్​కు శుభవార్త చెప్పింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్​లుగా ప్రస్తుతం పార్ట్​ టైమ్ పని చేస్తున్నవారిలో అర్హులైనవారిని మేనేజర్ హోదాలో ఫుల్​ టైమ్​ ఉద్యోగులుగా నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వారికి నిర్ణీత జీతంతోపాటు అదనపు సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపింది.

swiggy jobs delivery boy
స్విగ్గీ బంపర్ ఆఫర్.. ఇకపై వారంతా మేనేజర్స్.. ఫుల్​టైమ్ జాబ్, సూపర్ సాలరీ!

Swiggy manager jobs: ఆహారం, కిరాణా సామగ్రి డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్ట్ టైమ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్​లుగా పనిచేస్తున్న వారికి లబ్ధి చేకూర్చేలా 'స్టెప్ ఎహెడ్'​ పేరిట ఓ కార్యక్రమం ప్రారంభించింది. డెలివరీ బాయ్స్​లో అర్హులైన వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకుని, మేనేజర్​ హోదాతో బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. ఇకపై చేపట్టబోయే ఫ్లీట్​ మేనేజర్​ ఉద్యోగాల్లో 20శాతం డెలివరీ ఎగ్జిక్యూటివ్​ల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది స్విగ్గీ.

Swiggy jobs delivery boy: ప్రస్తుతం స్విగ్గీకి దేశవ్యాప్తంగా 2లక్షల 70వేల మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్​లు ఉన్నారు. వీరంతా పార్ట్ టైమ్ ఉద్యోగులే. చేసిన పని బట్టి పేమెంట్ ఉంటుంది. అదనంగా ప్రమాద బీమా, వైద్య బీమా, పర్సనల్ లోన్స్, న్యాయ సేవ, కొవిడ్ ఇన్​కమ్ సపోర్ట్, ఎమర్జెన్సీ సపోర్ట్, ప్రమాదాలు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థిక సహకారం, మెటర్నిటీ సెలవులు వంటి సదుపాయాలు కల్పిస్తోంది.

డెలివరీ ఎగ్జిక్యూటివ్స్​కు మరింత మేలు చేసేలా 'స్టెప్ ఎహెడ్' కార్యక్రమం ఉంటుందని చెప్పారు స్విగ్గీ ఆపరేషన్స్ వైస్​ ప్రెసిడెంట్ మిహిర్ రాజేశ్ షా. "చదువు, ఉద్యోగాల మధ్యలో గ్యాప్ వస్తే పూరించేందుకు లేదా అదనపు ఆదాయం కోసం చాలా మంది స్విగ్గీ బాయ్స్​గా పనిచేస్తున్నారు. అయితే కొందరు అంతకుమించిన స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నారని మేము గుర్తించాం. అందుకే.. స్టెప్ ఎహెడ్ కార్యక్రమం ద్వారా మేనేజర్ స్థాయి బాధ్యతలు అప్పగించి.. బ్లూకాలర్ ఉద్యోగులు వైట్ కాలర్ ఉద్యోగులుగా మారే అవకాశం కల్పిస్తోంది" అని వివరించారు మిహిర్ రాజేశ్.

వీరికి మాత్రమే ఛాన్స్​: ఫ్లీట్​ మేనేజర్​గా చేరేందుకు డెలివరీ ఎగ్జిక్యూటివ్​లకు ఉండాల్సిన అర్హతలపై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చింది స్విగ్గీ. ఆ సంస్థ వెలువరించిన ప్రకటన ప్రకారం.. ఆ వ్యక్తి కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్​ వాడకంపై కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్విగ్గీ ఎగ్జిక్యూటివ్​గా కొన్నేళ్లుగా పనిచేస్తున్న వ్యక్తి అయి ఉండాలి. కనీసం రెండేళ్లుగా స్విగ్గీ ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తున్న వారిని ఫ్లీట్ మేనేజర్ ఉద్యోగాల కోసం పరిగణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే అనేక మంది డెలివరీ బాయ్స్​.. ఫ్లీట్ మేనేజర్స్​గా చేరారని వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.