ETV Bharat / business

స్టాక్​ మార్కెట్​లో అదానీ జోరు​.. వరుసగా మూడో రోజు లాభాలు.. వారి సంపద రూ.3.4లక్షల కోట్లు జంప్

author img

By

Published : Mar 3, 2023, 7:00 PM IST

stock markets today
స్టాక్ మార్కెట్లు

వారాంతపు సెషన్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు రాణించాయి. సెన్సెక్ 900 పాయింట్లు లాభపడి 59,809 వద్ద నిలిచింది. నిఫ్టీ 272 పాయింట్లు ఎగబాకి 17,594 వద్ద స్థిరపడింది. మరోవైపు అదానీ షేర్లు వరుసగా మూడో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి.

Stock markets close : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఎఫ్​ఐఐల కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలు సాధించాయి. గత సెషన్‌లో 502 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్‌.. శుక్రవారం 900 పాయింట్లు పెరిగింది. శుక్రవారం ఉదయం క్రితం ముగింపు కంటే 342 పాయింట్లు ఎగువన 59,241 వద్ద బీఎస్​ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 59,231 కనిష్ఠస్థాయి నమోదు చేసింది. కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా దూసుకెళ్లిన సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పెరిగి 59,967 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 59,809 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్‌ఎక్స్చేంజ్‌ సూచీ-నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌ సంస్థల వాటాలు భారీగా లాభపడ్డాయి. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ శుక్రవారం సుమారు 17 శాతం పెరిగింది. గత మూడు సెషన్లలో 45 శాతానికిపైగా వృద్ధి నమోదు చేసింది. మరోవైపు.. మార్కెట్ల సానుకూల సంకేతాలతో మదుపర్లు సంపద రూ.3.43 లక్షల కోట్లకు పెరిగింది.

లాభాల్లోని షేర్లు..
స్టేట్​ బ్యాంక్ ఇండియా, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఐటీసీ, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి.
నష్టాలోని షేర్లు..
టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.

అదానీ షేర్లు లాభాల పంట..
అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌కు తన నాలుగు నమోదిత సంస్థల్లో మైనారిటీ వాటాలను రూ.15,446 కోట్లకు విక్రయించింది అదానీ గ్రూప్​. అయితే ఈ ప్రకటన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు వరుసగా మూడో రోజూ ర్యాలీ అయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏకంగా 17 శాతం లాభపడి రూ.1,874 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ గత 23 నెలల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని నమోదు చేసింది. అదానీ విల్మర్‌, అదానీ పవర్, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ గత మూడు రోజుల తరహాలోనే అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

అదానీ-హిండెన్​బర్గ్ వివాదం..
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ.. అమెరికా కంపెనీ హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదికను విడుదల చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్​ తీవ్రంగా ఖండించింది. అయితే ఈ ఆరోపణల కారణంగా అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.