ETV Bharat / business

ఆ వస్తువులపై జీఎస్​టీ తగ్గింపు... నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

author img

By

Published : Feb 18, 2023, 5:25 PM IST

Updated : Feb 18, 2023, 5:46 PM IST

పలు వస్తువులపై జీఎస్​టీ తగ్గనుంది. ఈ మేరకు జీఎస్​టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

reduce GST liquid jaggery sharpeners
reduce GST liquid jaggery sharpeners

జీఎస్​టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బెల్లం పాకం, పెన్సిల్ షార్ప్​నర్లపై జీఎస్​టీని తగ్గించాలని నిర్ణయించింది. పలు ట్రాకింగ్ డివైజ్​లపైనా జీఎస్​టీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు. ఆలస్యంగా జీఎస్​టీ రిటర్నులు దాఖలు చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని మండలి ప్రతిపాదించినట్లు చెప్పారు. జీఎస్​టీ పరిహారానికి సంబంధించి సెస్సు బకాయిలను వెంటనే విడుదల చేస్తామని నిర్మల స్పష్టం చేశారు.

శనివారం జరిగిన 49వ జీఎస్​టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. పాన్ మసాలా, గుట్కా పరిశ్రమలు పన్ను ఎగవేస్తున్నట్లు మంత్రుల బృందం మండలిలో ప్రస్తావించిందని నిర్మల వెల్లడించారు. ఆ అంశాలపై చర్చించినట్లు విత్త మంత్రి తెలిపారు. జీఎస్​టీ అప్పిలేట్ ట్రైబ్యునల్​పైనా చర్చలు జరిపినట్లు చెప్పారు. జూన్ నెలకు సంబంధించి రూ.16,982 కోట్ల జీఎస్​టీ బకాయిలు వివిధ రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉందని నిర్మల వెల్లడించారు. వీటిని వెంటనే క్లియర్ చేస్తామని చెప్పారు.

చివరిసారిగా 2022 డిసెంబర్ 17న జీఎస్​టీ మండలి భేటీ అయింది. పలు నేరాలకు సంబంధించి అందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కావాలని ధ్వంసం చేయడాన్ని, అధికారుల విధులకు అడ్డు తగలడాన్నీ నేరాల జాబితా నుంచి తొలగించారు. ఆ రోజు చర్చకు రాని అంశాలపై తాజా సమావేశంలో చర్చించారు. జీఎస్​టీ అప్పీలేట్ ట్రైబ్యునల్​ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. ఈ ట్రైబ్యునల్​లో కనీసం ఇద్దరు న్యాయమూర్తులు ఉండాలని మంత్రులు ప్రతిపాదన చేశారు. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీనికి అధ్యక్షుడిగా ఉండాలని ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి టెక్నికల్ సభ్యులకు చోటు ఇవ్వాలని సూచించారు.

Last Updated :Feb 18, 2023, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.