ETV Bharat / business

Budget 2023: ఇక 'పాన్ కార్డ్'​ ఒక్కటే చాలు.. కేంద్రం కీలక నిర్ణయం

author img

By

Published : Feb 1, 2023, 7:27 PM IST

union-budget-of-india-2023-pan-card
2023 బడ్జెట్​ పాన్​ కార్డ్​

సులభతర వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రప్రభుత్వం.. బడ్జెట్‌లో మరిన్ని సంస్కరణలతో ముందుకువచ్చింది. సంక్లిష్టంగా మారిన నిబంధనల్లో కొంత వెసులుబాటును తీసుకొచ్చింది. పదికి పైగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాల్సిన ఇబ్బంది నుంచి వ్యాపార సంస్థలకు విముక్తి లభించింది. ప్రభుత్వ పరిధిలో పలు డిజిటల్‌ ఏజెన్సీ వ్యవస్థలు ఇకపై పాన్‌ కార్డును గుర్తింపుగా స్వీకరించనున్నాయి.

Union Budget 2023 Pan Card: భారత్‌లో వ్యాపారం చేయాలంటే వివిధ రకాల చట్టాల కింద ఉండే వేల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల చిన్న నిబంధనలు ఉల్లంఘించినా క్రిమినల్‌ కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను భయపెడుతోంది. ఇవి పెట్టుబడులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. దేశంలో సంస్కరణలు జరిగే కొద్దీ ఇటువంటి నిబంధనలను తొలగించి వ్యాపారాలను ప్రభుత్వాలు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. తాజాగా బడ్జెట్‌ 2023లో దాదాపు 39వేల నిబంధనలను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అంతేకాదు.. 3వేల 400 రకాల చిన్నచిన్న ఉల్లంఘనలను నేరరహితం చేశారు. అంటే ఆ నేరాలకు జైలు శిక్షలు కాకుండా అపరాధ రుసుమువంటి చర్యలతో సరిపెడతారు.

వ్యాపారాలకు ఇక నుంచి ప్యాన్‌ కార్డ్‌ అత్యంత ముఖ్యమైనదిగా మారిపోనుంది. ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని పలు రకాల డిజిటల్‌ వ్యవస్థలు ఇక పాన్​ కార్డును గుర్తింపు కార్డుగా స్వీకరించనున్నాయి. ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 13కు పైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు ఈపీఎఫ్​ఓ, ఈఎస్​ఐసీ, జీఎస్​టీఎన్​,టీఐఎన్​, టీఏఎన్​, పాన్​ వంటి వాటిని చూపి అనుమతుల తెచ్చుకొంటున్నాయి. కానీ, ఇక నుంచి పాన్ ఒక్కదానినే అంగీకరిస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్‌ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇది ఒక అడుగని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన జన్‌ విశ్వాస్‌ బిల్లుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ బిల్లు జాయింటు పార్లమెంటరీ కమిటీ ఎదుట ఉంది.

అసలు జన విశ్వాస్‌ బిల్లు ఏంటంటే కేంద్రం మొత్తం 42 చట్టాల్లోని నిబంధనలను తొలగించి వ్యాపారాలను మరింత సరళంగా మార్చాలని ఈ బిల్లులో నిర్ణయించారు. దీని ప్రకారం పోస్టాఫీస్‌ చట్టం-1898, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, పబ్లిక్‌ లయబిలిటీ ఇన్స్యూరెన్స్‌ చట్టం-1991, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌-2000 వంటివి వీటిల్లో ఉన్నాయి. ఈ చట్టాల్లో ఉన్న కొన్నిరకాల నేరాలకు జైలుశిక్ష వరకు విధిస్తారు. అటువంటి వాటిని నేరాల జాబితా నుంచి తప్పించి అపరాధ రుసుంతో సరిపెట్టనున్నారు. అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ యాక్ట్‌-1937 కింద నకిలీ గ్రేడింగ్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు 5వేల అపరాధ రుసుం విధిస్తారు. కానీ, కొత్త బిల్లు ప్రకారం అదే నేరానికి 8 లక్షల ఫైన్‌ విధిస్తారు. కంపెనీల చట్టం-2013 కింద ఉన్న చిన్నచిన్న ఆర్థిక నేరాలను డీక్రిమినలైజ్‌ చేస్తే.. 4,లక్షల కంపెనీలు తాము పాల్పడిన నిబంధనల ఉల్లంఘనలను సరిచేసుకోవడానికి సానుకూలంగా ఉన్నాయని 2022-23 ఆర్థిక సర్వే తెలిపింది. ఈ క్రమంలోనే 3,400 నేరాలను డీక్రిమినలైజ్‌ చేసింది.
ఈ సారి బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల కాంట్రాక్ట్‌ వివాదాల పరిష్కారం కోసం వివాద్‌ సే విశ్వాస్‌ పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను, వడ్డీ, జరిమానా, ఫీజుల అంశంలో వివాదాలను పరిష్కరించేందుకు దీనిని తీసుకొచ్చారు. నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఆశాదీపం వలే ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.