ETV Bharat / business

ఏడాదిలో ఆర్థిక మాంద్యం.. మెజారిటీ సీఈఓల అంచనా!

author img

By

Published : Oct 6, 2022, 7:50 AM IST

majority-ceos-believe-recession-in-next-12-months
recession

రానున్న ఏడాది కాలంలో ఆర్థికమాంద్యం రానున్నట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 శాతం మంది సీఈఓలు విశ్వసిస్తున్నట్లు ఓ ప్రముఖ సర్వే తెలిపింది. అందుకోసం వారు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించింది.

వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం రానుందని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 శాతం మంది సీఈఓలు విశ్వసిస్తున్నట్లు ఓ ప్రముఖ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేశాయి. మరికొన్ని సంస్థలు రాబోయే ఆరు నెలల్లో తమ సిబ్బందిని సగానికి తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. ఈ విషయాలు కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 1,325 సీఈఓల అభిప్రాయాలను ఈ కంపెనీ సేకరించింది. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇటలీ, జపాన్‌, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా వంటి కీలక మార్కెట్లలోని సీఈఓలు ఈ సర్వేలో పాల్గొన్నారు. వాహన, బ్యాంకింగ్‌, రిటైల్‌, ఇంధనం, మౌలిక వసతులు, బీమా, ఆరోగ్య సంరక్షణ, తయారీ, సాంకేతికత, టెలికాం.. వంటి ప్రధాన రంగాలకు చెందిన కంపెనీల సీఈఓలు ఇందులో ఉన్నారు.

సర్వేలోని కీలకాంశాలు..

  • మాంద్యం రానున్న నేపథ్యంలో ఇప్పటికే నియామకాల ప్రక్రియను నిలిపివేసినట్లు 39 శాతం మంది సీఈఓలు తెలియజేశారు. 46 శాతం మంది రానున్న ఆరు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించుకుంటామని తెలిపారు.
  • రానున్న 12 నెలల్లో ఆర్థికమాంద్యం రానుందని ప్రతి పదిలో ఎనిమిది మంది సీఈఓలు తెలిపారు. వీరిలో సగానికిపైగా మాంద్యం ప్రభావం అంత తీవ్రంగా ఉండకపోవచ్చునన్నారు. అలాగే అది స్వల్పకాలం ఉంటుందని అంచనా వేశారు.
  • 14 శాతం మంది సీఈఓలు తాము ఆందోళన చెందుతున్న అంశాల్లో మాంద్యమే ప్రధానమైందని తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయ ఏంటంటే ఇప్పటికీ 15 శాతం మంది కరోనా మహమ్మారి తమని ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
  • ఇన్ని భయాలున్నప్పటికీ.. 73 శాతం మంది సీఈఓలు వచ్చే ఆరు నెలల పాటు ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
  • ఆర్థికమాంద్యం ప్రభావాన్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా తమ పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన (ESG) లక్ష్యాలను ప్రస్తుతానికి పక్కనపెడుతున్నట్లు మెజారిటీ సీఈఓలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మరో ఆరు నెలల పాటు వీటిని వాయిదా వేయనున్నట్లు వెల్లడించారు.
  • వచ్చే మూడేళ్ల పని వాతావరణం విషయానికి వస్తే.. తమ ఉద్యోగులు పూర్తిగా కార్యాలయాలకు వచ్చి పనిచేయడమే మేలని 65 శాతం మంది సీఈఓలు తెలిపారు. 28 శాతం హైబ్రిడ్‌, 7 శాతం వర్క్‌ ఫ్రమ్‌ హోం వైపు మొగ్గుచూపారు.

ఇదీ చదవండి: మీ పెట్టుబడికి ఇన్సూరెన్స్​ కావాలా? 'యులిప్​'ను ఎంచుకోండి!

ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ఓకే.. డీల్ పునరుద్ధరణ కోసం సంస్థకు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.