ETV Bharat / business

రూ.259తో జియో కొత్త ప్లాన్​.. ప్రతి నెల ఒకే తేదీన రీఛార్జ్​

author img

By

Published : Mar 29, 2022, 7:35 AM IST

Jio calendar plan: ఒక నెల కాలపరిమితితో జియో సరికొత్త ప్లాన్​ తీసుకొచ్చింది. ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జి చేసుకునేందుకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

Jio calendar plan
జియో కొత్త ప్లాన్​.. నెల రోజుల వ్యాలిడిటీ

Jio New Plan: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్‌ చందాదార్లకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కాలపరిమితి ఒక కేలండర్‌ నెల. ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జి చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశ్రమలో ఇలా ఒక నెల కాలావధితో పథకాన్ని తీసుకొచ్చిన తొలి సంస్థ జియో. రూ.259తో రీఛార్జి చేస్తే 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ సహా ఇతర ప్రయోజనాలను ఈ కొత్త ప్లాన్‌లో జియో అందిస్తోంది. నెలలో ఉండే రోజులతో (30 లేదా 31) నిమిత్తం ఉండదు. ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జి చేయాల్సి ఉంటుంది. అంటే మార్చి 5న తొలి రీఛార్జి చేస్తే తిరిగి ఏప్రిల్‌ 5, మే 5, జూన్‌ 5.. అలా ప్రతినెలా ఐదో తేదీన రీఛార్జి చేసుకోవాలి. అన్ని ప్లాన్ల తరహాలోనే దీన్ని కూడా ఒకేసారి అనేక రీఛార్జులు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్‌ అందరు జియో వినియోగదారులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మాధ్యమంలో అందుబాటులో ఉంది.

ట్రాయ్‌ ఆదేశాలతో కదలిక: ప్రీపెయిడ్‌ చందాదార్లకు తప్పనిసరిగా నెల రోజుల కాలావధి పథకాలను టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు అందుబాటులోకి తేవాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గతనెల ఆదేశించింది. ఇందువల్ల ఏడాదికాలంలో చేసుకోవాల్సిన రీఛార్జుల సంఖ్య తగ్గుతుంది. ప్రస్తుతం 28 రోజుల కాలావధి పథకాలను అమలు చేస్తున్నందున, ఏడాది కాలానికి 13 సార్లు రీఛార్జి చేయాల్సి వస్తోంది. ఇకపై 12 సరిపోతాయి. ప్రతి టెలికాం నెట్‌వర్క్‌ సంస్థ కూడా కనీసం ఒక ప్లాన్‌ ఓచర్‌, ఒక స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్‌, కాంబో వోచర్‌లను 30 రోజుల కాలావధితో అందించాల్సిందే అని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ప్రతినెలా ఒకే తేదీన వీటిని రీఛార్జి చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. 60 రోజుల్లోపు టెలికాం సంస్థలు ఈ ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది.

ఇదీ చదవండి: ఆ రెండూ విలీనం.. మల్టీప్లెక్స్​ వ్యాపారంలో ఇక వాటిదే హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.