ETV Bharat / business

ఈ 10 సందర్భాల్లో కచ్చితంగా ఐటీఆర్‌ సమర్పించాల్సిందే..

author img

By

Published : May 24, 2022, 5:07 PM IST

itr
ఐటీఆర్​

ITR filing: ఐటీఆర్​ దాఖలుకు సంబంధించిన నిబంధనల్లో ఇటీవల కేంద్రం మార్పులు చేసింది. 10 సందర్భాల్లో రిటర్నులు సమర్పించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. మరి అవేంటో.. వాటి నిబంధనలు ఎంటో తెలుసుకుందాం.

Income tax return filing: సాధారణంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి దాటినప్పుడు లేదా మన ఆదాయంలో మూలం వద్దే పన్ను కోత ఉంటేనే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 139 ఏయే సందర్భాల్లో ఐటీఆర్‌ దాఖలు చేయాలో స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనల్లో ఇటీవల కేంద్రం కొన్ని మార్పులు కూడా చేసింది. మరి రిటర్నులు సమర్పించాల్సిన 10 సందర్భాలేంటో చూద్దాం..

సాధారణ పన్ను మినహాయింపు పరిమితి దాటితే..

  • వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటిన సాధారణ పౌరులు
  • 60 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్ల ఆదాయం రూ.3 లక్షలు
  • 80 ఏళ్లు దాటిన వారి ఆదాయం రూ.5 లక్షలు దాటితే.. కచ్చితంగా ఐటీఆర్‌ దాఖలు చేయాలి.

అయితే, ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సెక్షన్‌ 80సీ (Section 80C) వంటి మినహాయింపులను పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు ఉందని గమనించాలి.

భారత్‌కు వెలుపల ఆస్తులు ఉంటే..: ఇతర దేశాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నా ఐటీఆర్‌ (ITR) తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఏదైనా విదేశీ కంపెనీలో భాగస్వాములైనా.. లేదా దాంట్లో సైనింగ్‌ అథారిటీ ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. లేదా ఏదైనా ఆస్తుల నుంచి ఆదాయం పొందుతున్నా రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.

  1. ఒకటి లేదా ఎక్కువ బ్యాంకుల్లోని కరెంటు ఖాతాల్లో ఒక ఏడాదిలో రూ.కోటికి మించి నగదు డిపాజిట్‌ చేస్తే రిటర్నులు దాఖలు చేయాలి. అయితే, పోస్టాఫీసులోని కరెంటు ఖాతాలో చేసే డిపాజిట్‌ను మాత్రం సెక్షన్‌ 139లో ప్రత్యేకంగా పేర్కొనలేదు.
  2. క్రితం సంవత్సరంలో ఎవరైనా విదేశీయానం కోసం రూ.2 లక్షలు వెచ్చిస్తే వారు రిటర్నులు దాఖలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, ఎవరు ప్రయాణిస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా విదేశీయ ప్రయాణాల పేరిట ఖర్చు చేస్తే రిటర్నులు ఫైల్‌ చేయాల్సిందే.
  3. కిందటేడాదిలో కరెంటు బిల్లు రూ.1లక్ష దాటితే వారు రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
  4. వ్యాపారంలో మొత్తం విక్రయాలు, టర్నోవర్‌ రూ.60 లక్షలు దాటితే ఐటీ రిటర్నులు సమర్పించాలి.
  5. ఏదైనా వృత్తి లేదా పని ద్వారా రూ.10 లక్షలకు మించిన ఆదాయం ఆర్జిస్తే ఐటీఆర్‌ దాఖలు చేయాలి.
  6. మూలం వద్ద పన్ను కోత (TDS), మూలం వద్ద పన్ను వసూలు (TCS) కలిపి మొత్తం ఒక ఏడాదిలో రూ.25,000 దాటితే కచ్చితంగా రిటర్నులు సమర్పించాలని ఐటీ నిబంధనలు తెలియజేస్తున్నాయి.
  7. సీనియర్‌ సిటిజన్ల (60 ఏళ్లు పైబడినవారు) టీడీఎస్‌, టీసీఎస్‌ల మొత్తం రూ.50,000 దాటితేనే ఐటీఆర్‌ దాఖలు చేయాలి.
  8. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్స్‌ ఖాతాల్లో చేసే డిపాజిట్‌ మొత్తం ఏడాదిలో రూ.50 లక్షలు దాటితే కచ్చితంగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి : 'ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపు అనివార్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.