ETV Bharat / business

ఐటీఆర్​ ఫైల్​ చేస్తున్నారా? ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి!

author img

By

Published : Jun 6, 2023, 5:57 PM IST

Documents Required for ITR Filing
ITR Filing

ITR Filing Documents : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్​ ఫైల్​ చేయాలనుకుంటున్నవారు.. ఆధార్​ కార్డ్​, పాన్​ కార్డుతోపాటు కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఐటీఆర్​ ప్రక్రియ పూర్తి చేసి, పన్ను రాయితీ పొందగలుగుతారు. పూర్తి వివరాలు మీ కోసం.

ITR Filing Documents : మీరు ఈ సంవత్సరం ఆదాయ పన్ను రిటర్నులు (ITR) ఫైల్​ చేశారా? 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్​ ఫైల్​ చేయడానికి ఈ జులై 31 ఆఖరు తేదీ. ఐటీఆర్ ఫైల్​​ని ఆన్​లైన్​, ఆఫ్​లైన్ రెండు మార్గా​ల్లోనూ చేసుకునే అవకాశం ఉంది.
ఆదాయ పన్ను రిటర్నులు చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. 7 రకాలు ఐటీఆర్​ దరఖాస్తులు ఉంటాయి. వాటిలో మనం ఏది నింపాలో తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే మనలో వివిధ ఆదాయ కేటగిరీల వారు ఉంటారు. వారు వారి ఆదాయ స్థాయిలను అనుసరించి, తమకు సంబంధించిన ITR form నింపాల్సి ఉంటుంది.

10 key documents for ITR filing
ఐటీఆర్​ ఫైల్​ చేయడానికి 10 ముఖ్యమైన పత్రాలు మన దగ్గర సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

పాన్​ కార్డ్​ :
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పాన్​కార్డ్​ తప్పనిసరి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు, అలాగే ఇళ్లు, బంగారం లాంటివి కొనుగోలు చేసినప్పుడు, మనం పాన్​ కార్డును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. దీని వల్ల మనకు TDS (Tax Deducted at Source) డిడక్షన్​ వాపస్ వస్తుంది.

ఆధార్​ కార్డ్​ :
పాన్​ కార్డు లేని సందర్భంలో ఆధార్​ కార్డును ఐటీఆర్​ ఫైల్​ చేయడానికి వినియోగించవచ్చు. వక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్​ చేసేవారు సెక్షన్​ 139AA of Income Tax Act ను అనుసరించి కచ్చితంగా ఆధార్​ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఒక వేళ మీ వద్ద ఆధార్​ కార్డ్​ లేనట్లయితే కచ్చితంగా దాని కోసం దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే ఐటీఆర్​ ఎన్​రోల్​మెంట్​ ఐడీ కావాలంటే కచ్చితంగా ఆధార్​ కార్డ్ ఉండాలి. మరో విషయం ఏమిటంటే, ఇప్పటికే మీకు ఆధార్​ కార్డ్​ ఉన్నట్లయితే దానిని ఈ జూన్​ 30లోగా పాన్​కార్డ్​తో అనుసంధానం చేసుకోండి.

ఫామ్​ 16 :
స్థిర ఆదాయం వచ్చే ఉద్యోగం చేస్తున్నవారు కచ్చితంగా ఫామ్​-16ను నింపాల్సి ఉంటుంది. వాస్తవానికి దీనిని మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ లేదా యజమాని మీకు అందిస్తారు. దీని ఆధారంగా ఐటీఆర్​ ఫైల్​ చేయాల్సి ఉంటుంది.

ఫామ్​ 16ఏ, 16బి, 16సీ :
మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ లేదా యజమాని TDS సర్టిఫికేట్లను ఇస్తారు. మీరు ఒక ఆస్తిని అమ్మినా లేదా కొన్నా లేదా అద్దె ద్వారా ఆదాయం పొందుతున్నా ఈ ఫామ్స్​ అవసరమవుతాయి. ఫామ్​ 16Aను టాక్స్​ డిడక్టర్​, ఫామ్​ 16Bని చరాస్థి కొన్న వ్యక్తి, 16Cని అద్దె చెల్లిస్తున్న ఒక వ్యక్తి గానీ లేదా HUF గానీ అందిస్తారు.

బ్యాంక్​ స్టేట్​మెంట్​ :
ఐటీఆర్​ ఫైల్​ చేయాలంటే బ్యాంక్​ స్టేట్​మెంట్​ కూడా చాలా అవసరం. బ్యాంక్​ అకౌంట్​ వివరాలు, అంటే మీ పేరు, ఖాతా నంబరు, IFSC కోడ్​ మొదలైన వివరాలు మీరు దరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది. అప్పుడే మీకు వచ్చే టాక్స్​ రిఫండ్​ను ఆదాయ పన్ను శాఖ మీ ప్రైమరీ బ్యాంకు ఖాతాలో జమ చేయగలుగుతుంది.

ఫారమ్​ 26ఏఎస్​ :
దీనిని ఇన్​కం టాక్స్​ పోర్టల్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవాలి. వాస్తవానికి ఇది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను స్టేట్​మెంట్​ లాంటిది. దీనిలో ఈ సంవత్సరం మీరు కట్టిన పన్నుల వివరాలు, మీకు వచ్చిన పన్ను రాయితీల వివరాలు ఉంటాయి.

పెట్టుబడికి సంబంధించిన ఆధారాలు :
మీరు పాత పన్ను విధానాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే, మీరు కచ్చితంగా మీ పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు పన్ను రాయితీ వస్తుంది. ముఖ్యంగా PPF (పబ్లిక్​ ప్రావిడెంట్​​ ఫండ్​), మ్యూచువల్​ ఫండ్స్​ మొదలైన వాటి వివరాలు అందించాల్సి ఉంటుంది.

అద్దెకు సంబంధించిన ఒప్పంద పత్రాలు :
మీకు ఏదైనా స్థిర, చరాస్థుల నుంచి అద్దె వస్తుంటే, అలాంటి సమయంలో మీ వద్ద కచ్చితంగా రెంట్​ అగ్రిమెంట్​ పత్రాలు ఉండాల్సి ఉంటుంది.

విక్రయ పత్రాలు (సేల్​ డీడ్​) :
మీరు ఏదైనా ఆస్తులను అమ్మి ఆదాయాన్ని పొందినట్లయితే, దానికి సంబంధించిన సేల్​ డీడ్​ మీ వద్ద ఉండాలి.

డివిడెండ్​ వారెంట్స్​ :
సాధారణంగా కంపెనీలు తమ నికర ఆదాయంలో నుంచి షేర్​ హోల్డర్లకు డివిడెండ్​లను అందిస్తూ ఉంటాయి. ఇవి కూడా మన ఆదాయం కిందకే వస్తాయి కనుక ఐటీఆర్​ ఫైల్​ చేసేటప్పుడు ఈ డివిడెండ్​ వారెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
మీరు ఇంకా ఆదాయ పన్ను రిటర్నులు చేయకపోతే.. వెంటనే ఆ పని చేయండి. అంత కంటే ముందు పైన పేర్కొన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. అప్పుడే మీరు పన్ను రాయితీలు పొందగలిగే అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.