ETV Bharat / business

వర్క్​ ఫ్రమ్​ హోం ఉద్యోగులకు షాక్​, అలా చేయకుంటే కోతలే

author img

By

Published : Aug 27, 2022, 8:59 AM IST

Updated : Aug 27, 2022, 9:20 AM IST

కొవిడ్​ కారణంగా వర్క్​ ఫ్రమ్​ హోం ద్వారా పని చేయించుకున్న ఐటీ కంపెనీలు ఇప్పుడు తమ ఉద్యోగస్థులను ఆఫీసుకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ వారు ఆఫీసు రాకపోతే వారి అలవెన్సుల్లో కోతలు విధించే దిశగా ప్రణాళికలు చేపట్టాయి.

it employees news
ఐటీ ఉద్యోగులు

IT companies: కొవిడ్‌ పరిణామాల వల్ల ఇంటి నుంచి పనిని పూర్తిస్థాయిలో అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు సిబ్బందిని కార్యాలయాలు రప్పించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు- రాకపోతే అలవెన్సుల్లో కోతలు, బదిలీలు ఉండే క్యారట్‌ అండ్‌ స్టిక్‌ పాలసీని అమలు చేసేందుకూ సిద్ధపడుతున్నాయి. కార్యాలయాలకు వస్తున్న సిబ్బందికి అదనపు సెలవులు, అధికమొత్తం వేరియబుల్‌ పే, బృంద సభ్యుల మధ్య అనుబంధం పెంచేలా వినోద-ఆతిథ్య కార్యక్రమాలకు అధిక నిధులు ఇచ్చేందుకూ కంపెనీలు సిద్ధపడుతున్నాయి.
ఎంత చెప్పినా వినకుండా, ఇంటి నుంచే పని చేస్తామనే ఉద్యోగులకు ఇంటర్నెట్‌ అలవెన్సు తీసివేయడంతో పాటు ఇతరత్రా సదుపాయాలు తగ్గిస్తున్నాయని సమాచారం. కొన్ని కంపెనీలు, తమ ఉద్యోగులను కనీసం వారంలో 3 రోజులైనా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. కీలక ప్రాజెక్టుల్లోని సిబ్బంది తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల హాజరు క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
వలసల నేపథ్యంలోనే ఆచితూచి
ఐటీ పరిశ్రమలో సిబ్బంది వలసల రేటు (ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారడం) 15 - 20 శాతంగా ఉంది. నిపుణులకు డిమాండ్‌ అధికంగా ఉన్నందున, మంచి ప్యాకేజీ ఇచ్చే మరొక కంపెనీకి మారడం గత ఏడాదిన్నర కాలంలో అధికమైంది. పెద్దఎత్తున ప్రాజెక్టులు లభిస్తున్నందున, వాటికి కావాల్సిన నిపుణులకు ఎక్కువమొత్తం జీతభత్యాలు ఇచ్చేందుకు ఐటీ కంపెనీలు వెనుకాడటం లేదు. అదనంగా కళాశాల ప్రాంగణాల్లో తాజా ఉత్తీర్ణులనూ ఎంపిక చేసుకుంటున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీల్లో సగటున 30- 40 శాతం మంది కొత్త ఉద్యోగులే ఉంటున్నారు.
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కంపెనీ పని పరిస్థితులు, ప్రాజెక్టులు చేపట్టే విధానం, లక్ష్యాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. కనుక ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందిగా సూచిస్తున్నాం అని స్థానిక ఐటీ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రాంగణాల్లో నియమించుకున్న ఇంజినీర్లకు 3-5 నెలల పాటు ఇంటి నుంచి పనికి అవకాశం కల్పిస్తున్నామని.. కాస్త అనుభవం వచ్చి ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం కావాల్సిన పరిస్థితి రాగానే ఆఫీసుకు పిలిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
కంపెనీలకు వ్యయాలు తగ్గినా
ఐటీ నిపుణులు ఇంటి నుంచి పనిచేయడం వల్ల కంపెనీలకు భవనం అద్దె, విద్యుత్తు, రవాణా, ఇంటర్నెట్‌ ఖర్చులు, ఇతర వ్యయాలు కొంత తగ్గాయి. ఆ మేరకు లాభాలు పెంచుకునే అవకాశం ఏర్పడింది. కానీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం, డేటా సెక్యూరిటీ, సమర్థత, ఉత్పాదకతకు తోడు బృందంగా పనిచేయడం వల్ల ఏర్పడే సానుకూలతను పరిగణనలోకి తీసుకుంటే.. సిబ్బంది ఆఫీసుకు వచ్చి పనిచేస్తేనే మెరుగ్గా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటి నుంచి పని వల్ల డేటా సెక్యూరిటీ, సంబంధిత ఇతర అంశాలకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, ఉద్యోగులు కార్యాలయాలకు వస్తే ఆ ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. ప్రాజెక్టులను సకాలంలో, భద్రంగా పూర్తిచేసి క్లయింట్ల విశ్వాసాన్ని పొందడం ముఖ్యమని, అందుకు ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.
40 శాతానికి చేరుతున్న హాజరు
సిబ్బందిని ఐటీ కంపెనీలు కార్యాలయాలకు పిలిపిస్తున్న ఫలితంగా నెమ్మదిగా ఐటీ కార్యాలయాల్లో హాజరు పెరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వరకు 15- 20 శాతం సిబ్బందే కార్యాలయాలకు వస్తుంటే, దాదాపు 80 శాతం మంది ఇంటి నుంచి పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాదాపు 35- 40 శాతం సిబ్బంది కార్యాలయాలకు వస్తున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ఐటీ సిబ్బందిలో సగానికి పైగా కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని స్థానికి ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు మాత్రం ‘ఫ్లెక్సి- వర్కింగ్‌’ విధానాన్ని ఇంకా అమలు చేస్తున్నాయి. అంటే వారంలో 2-3 రోజులు మాత్రమే ఆఫీసుకు వస్తే సరిపోతుంది. మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి పనిచేయాలి. ఈ విధానాన్ని మరికొంతకాలం పాటు కొన్ని ఐటీ కంపెనీలు కొనసాగిస్తాయని భావిస్తున్నారు.

ఇవీ చదవండి: అప్పుల ఊబిలో చిక్కుకున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టమే

5జీ అందుబాటులోకి వచ్చేది అప్పుడే, ఆ నగరాల్లోనే ఫస్ట్

Last Updated :Aug 27, 2022, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.