ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లలో లాభాలు రావాలా? ఈ వ్యూహాలను పాటిస్తున్నారా మరి!

author img

By

Published : Jul 8, 2022, 7:46 AM IST

Stock Market Investment Tips: మార్కెట్‌లో కొన్ని నెలలుగా దిద్దుబాటు చోటు చేసుకోవడం చూస్తున్నాం. పెట్టుబడి పెట్టేవారు ఇలాంటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మార్కెట్‌ పయనం ఎటువైపున్నా.. ఆయా దశల్లో మదుపు చేసి, లాభాలను సంపాదించేందుకు సరైన వ్యూహాల్ని, క్రమశిక్షణతో ఆచరించాలి. అవేమిటో తెలుసుకుందాం.

investment planning
పెట్టుబడి ప్రణాళికలు

Stock Market Investment Tips: వ్యక్తులను బట్టి పెట్టుబడి ప్రణాళిక మారుతూ ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తికి సరిపోయే పెట్టుబడి విధానం, శైలి 60 ఏళ్ల వ్యక్తికి సరిపోకపోవచ్చు. మదుపు మొత్తం, పెట్టుబడి కాలం, వేచి ఉండే వ్యవధి, నష్టాన్ని తట్టుకునే సామర్థ్యం, ఎంత లాభాలను ఆశిస్తున్నారు, ఎంచుకునే వ్యూహం ఇలా పలు అంశాలు పెట్టుబడులను ప్రభావితం చేస్తుంటాయి. మార్కెట్‌ ఒక్కో దశలో కొన్ని వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తుంటాయి. ఈ విధానమే సరైనది, ఇదే కచ్చితమైనది అని చెప్పలేం.

సొంతంగా.. సూచీల ఆధారంగా..: మార్కెట్‌ సూచీని మించి రాబడిని పొందాలనుకునే వారు తరచూ, చురుకుగా షేర్ల క్రయవిక్రయాలు చేస్తుంటారు. ఇలాంటి వ్యూహాన్ని 'యాక్టివ్‌ ఇన్వెస్టింగ్‌'గా చెప్పొచ్చు. మార్కెట్‌పై పూర్తి అవగాహన, నైపుణ్యం అవసరం. ఈ వ్యూహం ఎవరికి వారు సొంతంగా పాటించవచ్చు. నిపుణుల సహాయంతోనూ కొనసాగించవచ్చు.

షేర్లు లేదా ఇండెక్స్‌, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌)లాంటివి కొనుగోలు చేసి, వాటిల్లో దీర్ఘకాలం కొనసాగడం 'పాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' వ్యూహం. స్వల్పకాలిక హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో మెరుగైన రాబడి పొందడమే దీని లక్ష్యం. నిఫ్టీ, సెన్సెక్స్‌, బ్యాంకింగ్‌ మొదలైన ఇండెక్స్‌, ఈటీఎఫ్‌లు, నాణ్యమైన షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు ఈ కోవలోకే వస్తాయి. పెట్టుబడి వృద్ధి కంటే.. రిస్క్‌తో సంపద సృష్టి కోసం చూస్తున్నవారు యాక్టివ్‌ ఇన్వెస్టింగ్‌ వైపు మొగ్గు చూపించొచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో రాబడిని సాధించాలనుకుంటే.. పాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పరిశీలించాలి.

విలువ.. వృద్ధి..: గత పనితీరు బాగుండి, బలమైన ఆర్థిక పునాదులు ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ షేరు ఉండాల్సిన వాస్తవిక ధరకన్నా తక్కువకు లభిస్తుంటుంది. ఇలాంటి షేర్లను ఎంచుకోవడం విలువ ఆధారిత పెట్టుబడి. ఈ కంపెనీలు భవిష్యత్‌లో మంచి పనితీరు కనబరిస్తే.. లాభాలు సొంతం చేసుకోవచ్చు.

అధిక వృద్ధిని నమోదు చేస్తున్న, భవిష్యత్‌లో చేయగల కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి, అధిక రాబడిని ఆర్జించడం వృద్ధి ఆధారిత పెట్టుబడి వ్యూహం. ఆయా కంపెనీల వస్తూత్పత్తులు, సేవల్లో కొత్తదనం, నాణ్యత, ప్రయోజనాలు మొదలైన అంశాలు ఇక్కడ కీలకం. సహజంగా మిగిలిన వాటికంటే ఇవి అధిక వృద్ధిని నమోదు చేస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో కాస్త అధిక నష్టభయం ఉంటుంది. లాభాలూ ఎక్కువగానే ఉంటాయి.

విలువ ఆధారిత వ్యూహంలో తక్కువ ధర, తక్కువ నష్టభయం ఉండటంతోపాటు, ఓపికతో ఎక్కువ కాలం కొనసాగడం ముఖ్యం. ఈ షేర్లు ఆర్థిక వ్యవస్థ, మార్కెట్‌ తిరిగి పుంజుకున్నప్పుడు మంచి రాబడులను అందిస్తాయి. వృద్ధి ఆధారిత వ్యూహంలో షేర్లు బలమైన ఆదాయాలు, లాభాలు ప్రకటిస్తున్నప్పుడు, తక్కువ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నప్పుడు లాభాలను పంచుతాయి.

పెద్ద షేర్లలో..: సహజంగా ఒక రంగంలో ఆధిపత్యంతో, స్థిరమైన పనితీరును చూపించే వాటిని లార్జ్‌క్యాప్‌ షేర్లుగా చెప్పొచ్చు. ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోనూ ఇవి నిలకడగా ఉంటాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలను భవిష్యత్‌లో వృద్ధికి ఆస్కారం ఉన్న కంపెనీలుగా చెప్పొచ్చు. ఇక్కడ రిస్క్‌-రివార్డు రెండూ ఎక్కువే. మార్కెట్‌, ఆర్థిక వ్యవస్థ కోలుకునే దశలో ఇవి మంచి రాబడులను ఇస్తుంటాయి.

భిన్నమైన మార్గంలో..: మార్కెట్లో నలుగురు ఆచరిస్తున్న నిర్ణయాలకు, ఆశ-నిరాశావాదాలకు భిన్నంగా షేర్ల క్రయ విక్రయాలు చేస్తూ రాబడిని పొందడమే ఈ వ్యూహ లక్షణం.

10-12 కంపెనీల్లో..: కేవలం ఒకటో రెండో రంగాలు, లేదా ఒకటి రెండు షేర్లలో పెట్టుబడులు సరికాదు. 4-5 రంగాల్లోని నాణ్యమైన 10-12 కంపెనీలను ఎంచుకోవడం మంచిది. నష్టాన్ని భరించే సామర్థ్యం, అవగాహన తదితర అంశాలను బట్టి, ఏ కంపెనీలను ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. వైవిధ్యం పాటించడం వల్ల నష్టభయం పరిమితం అవుతుంది. అదే సమయంలో అతి వైవిధ్యమూ మంచి ఫలితాలను ఇవ్వదు.

ఎక్కువ నష్టభయం భరించలేని వారు.. స్థిరమైన ఆదాయం కోరుకునే వారు.. షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, రీట్స్‌, ఇన్‌విట్స్‌లాంటి వాటిల్లో మదుపు చేయాలి. డివిడెండ్లు, వడ్డీ రూపంలో కొంత ఆదాయాన్ని తక్కువ నష్టభయంతో పొందడం ఇక్కడ లక్ష్యం.

నష్టానికి పరిమితి..: పెట్టుబడులకు నష్టభయం అంతర్లీనంగా ఉంటుంది. స్వల్ప, మధ్యకాలిక ట్రేడర్లు ఎంత నష్టాన్ని భరించగలరు అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక షేరు మీ నష్టభయ సామర్థ్యాన్ని మించి తగ్గుతున్నప్పుడు స్టాప్‌లాస్‌ వ్యూహాన్ని పాటించాలి. ఉదాహరణకు..

సందర్భం 1: ధర పెరుగుతుందన్న నమ్మకంతో మీరు ఏబీసీ షేరు రూ.100కి కొన్నారు. మార్కెట్‌ తగ్గితే.. షేరుకు రూ.5 నష్టంతో బయటపడాలి అనుకున్నారు. అందుకు రూ.95 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకున్నారు. పరిస్థితి బాగా లేక ఆ షేరు ధర రూ.90కి చేరిందనుకుందాం. స్టాప్‌లాస్‌ వ్యూహం వల్ల మీరు రూ.5 నష్టంతో బయటపడ్డారు.

సందర్భం 2: షేరు రూ.100 నుంచి రూ.110కి వెళ్లింది. మీ స్టాప్‌ లాస్‌ రూ.95 నుంచి రూ.105కి చేశారు. షేరు ధర రూ.120కి చేరింది. అప్పుడు స్టాప్‌ లాస్‌ రూ.115కు మార్చారు. ఇలా చేయడం వల్ల పెట్టుబడి కొనసాగించుకుంటూ, లాభాలను రక్షించుకోవచ్చు. దీన్ని ట్రెయిలింగ్‌ స్టాప్‌ లాస్‌ అంటారు. షేర్ల రాబడులను కంపెనీల పనితీరుతోపాటు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వార్తలు, ఆయా రంగాల మంచి చెడులు ప్రభావితం చేస్తుంటాయి. అన్ని వ్యూహాల్లో లాభనష్టాలు, పరిమితులు ఉంటాయి. ఆయా వ్యూహాలను మనకు అనుగుణంగా మార్చుకొని, ఆచరించినప్పుడే పెట్టుబడులు లాభాల తీరాన్ని చేరుతాయి.

- జాగర్లమూడి వేణుగోపాల్‌, జెన్‌మనీ

ఇదీ చదవండి: 'పన్ను ఎగవేతకు 'వివో' పక్కా కుట్ర.. చైనాకు రూ.62వేల కోట్లు!'

రోజుకు 10 లక్షల స్పామ్​​ అకౌంట్లు తొలగిస్తున్నాం​ : ట్విట్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.