ETV Bharat / business

ఈ కొత్త ఏడాదిలో మీ ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? ఈ టాప్​-25 టిప్స్​ మీ కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 2:10 PM IST

How to Set Financial Goals for Your Future
how to achieve financial goals

How To Achieve Financial Goals In Telugu : మనం కొత్త ఏడాదిలోకి సగర్వంగా అడుగుపెట్టాం. కానీ ఆర్థికంగా మనం ఎక్కడ ఉన్నాం? మన లక్ష్యం ఏమిటి? దానిని చేరుకోవడానికి ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి? లక్ష్య సాధన కోసం అవలంభించిన సూత్రాలు ఏమిటి? అనే విషయాలను ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

How To Achieve Financial Goals : కొత్త ఏడాదిలో అందరూ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు కూడా వేసుకుంటారు. మరి మీ ఆర్థిక లక్ష్యం ఏమిటి? దానిని సాధించేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఎలాంటి సూత్రాలు పాటించాలి? ఈ విషయంపై చాలా మందికి క్లారిటీ ఉండదు. అందుకే కొత్త ఏడాదిలో మన ఆర్థిక ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఉన్న 25 మార్గాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే ప్రతి నెలా మీ ఆదాయంలో కనీసం 20 శాతం వరకు ఆదా చేయడం నేర్చుకోవాలి. 3 నుంచి 6 నెలలకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి.
  2. ఈ మధ్యకాలంలో బ్యాంక్​ డిపాజిట్‌ రేట్లు బాగా పెరిగాయి. అందువల్ల మెరుగైన రాబడి కోసం దీర్ఘకాలిక రికరింగ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ప్రారంభించవచ్చు. చాలా బ్యాంకులు 5-10 ఏళ్ల డిపాజిట్లపై 6.5%-8% వరకు వడ్డీని అందిస్తున్నాయి. మీ పొదుపు, మదుపులను పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం.
  3. వ్యక్తుల అవసరాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ సాధారణ ఖర్చులు, ఆర్థిక అవసరాలు దాదాపు అందరికీ ఒకేలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లు, పొదుపు, మంచి ఆరోగ్యం, పిల్లలకు ఉన్నత చదువులు, స్థిరమైన ఆదాయం కోరుకుంటారు. అందుకే ఈ 2024లో మీ ఆర్థిక లక్ష్యాన్ని ఎలా సాధించాలనే దానిపై లోతుగా ఆలోచిన చేయాలి.
  4. మీరు కచ్చితంగా బడ్జెట్ వేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, వ్యయాలపై సరైన ప్రణాళిక వేసుకోవాలి. ఆహారం, దుస్తులు, ఇంటి అద్దె, చదువులు, వైద్య ఖర్చులు, కొనుగోళ్లు, ప్రయాణాలు, పెట్టుబడులు లాంటి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్​ కేటాయింపులు చేసుకోవాలి.
  5. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు సెక్షన్‌ 80సీని ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఒక ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో మదుపు చేయాలి. గత 20 ఏళ్లుగా ఇవి సగటున 12-15 శాతం వరకు రాబడిని ఇస్తున్నాయి.
  6. మీరు చిన్న వయస్సులో ఉన్నప్పటికీ, పదవీ విరమణ నాటికి సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. వాస్తవానికి ఉద్యోగంలో చేరిన వెంటనే దీనికి శ్రీకారం చుట్టాలి. మీ వార్షిక అవసరాలకు సరిపోయే మొత్తానికంటే, కనీసం 25 రెట్ల వరకు జమ చేసేందుకు కృషి చేయాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు కనీసం రూ.500 అయినా సిప్​ విధానంలో ఇన్వెస్ట్ చేయాలి.
  7. భవిష్యత్​ భద్రత కోసం ఆస్తులను కూడబెట్టే ప్రయత్నం చేయాలి. ఈక్విటీలు, బంగారం, స్థిరాస్తి, బాండ్లు లాంటి వైవిధ్య భరితమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. అంకుర సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. మీ దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినప్పటికీ, చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించాలి. వాటిని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. బంగారంలో మదుపు చేయాలనుకున్నప్పుడు గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, వాణిజ్య స్థిరాస్తులలో పెట్టుబడుల కోసం రీట్స్‌ లాంటి వాటిని ఎంచుకోవాలి.
  8. క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక స్తోమతను, అప్పు తీర్చగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్​ బాగున్నప్పుడే మీకు తక్కువ వడ్డీకి, సులభంగా బ్యాంకు రుణం లభిస్తుంది. అందుకే క్రెడిట్ స్కోర్ తగ్గకుండా, చక్కగా మెయింటైన్​ చేయాలి.
  9. క్రెడిట్‌ కార్డు బిల్లులను వాయిదా వేయకుండా, సకాలంలో చెల్లించాలి. మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై రివార్డులను పెంచుకోవాలి. ఇలా రివార్డుల ద్వారా ఆదా అయిన మొత్తాన్ని మీరు సంపాదించినట్లే లెక్కవేసుకోవాలి.
  10. నేడు చిన్న మొత్తాల్లో రుణాలు ఇచ్చేందుకు అనేక డిజిటల్‌ రుణ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో చాలా రిస్క్ ఉంది. కనుక ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల లాంటి ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల నుంచి మాత్రమే రుణం తీసుకోవాలి. అధిక వడ్డీ రుణాలను వీలైనంత తొందరగా తీర్చేయాలి.
  11. 2024లో అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రయత్నించాలి. రెండు మూడు విధాలుగా ఆదాయాన్ని ఆర్జించినప్పుడే మీ లక్ష్యాలను వేగంగా అందుకోవడానికి వీలవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి.
  12. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం చేయకూడదు. లేకపోతే అనవసరంగా అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుంది. పైగా క్రెడిట్‌ స్కోరు కూడా దెబ్బతింటుంది. మీ క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, విద్యుత్‌, నీటి బిల్లులు, ఈఎంఐలను నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు జరిగేలా ఆటోమేట్‌ చేయాలి. దీని వల్ల బిల్లు చెల్లింపులు ఆలస్యం కావు.
  13. పన్ను ఆదా చేసుకునేందుకు అనువైన మార్గాలను చూసుకోవాలి. ఎంత పన్ను చెల్లించాలి? దాన్ని ఎలా ఆదా చేసుకోవాలి? మొదలైన అంచనాలు వేసుకోవాలి.
  14. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం కుటుంబం అంతటికీ వర్తించేలా కనీసం రూ.10 లక్షల విలువైన ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవాలి. అలాగే కనీసం రూ.40 లక్షల సూపర్‌ టాపప్‌ పాలసీ ఉండాలి. వ్యక్తిగత బీమా తీసుకోవడం కూడా చాలా మంచిది.
  15. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలి. ఇది మీ వార్షికాదాయానికి కనీసం 20 రెట్లు ఉండేలా చూసుకోవాలి.
  16. రుణాలను సాధ్యమైనంత వేగంగా వదిలించుకోవాలి. అప్పుడే మీకు మానసిక, ఆర్థిక ప్రశాంతతలు లభిస్తాయి. మీ రుణ మొత్తంలో ఏటా కనీసం 5 శాతాన్ని అదనంగా చెల్లించేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల అనుకున్న వ్యవధికన్నా ముందే అప్పు తీరుతుంది. పైగా వడ్డీ భారం కూడా తగ్గుతుంది.
  17. అనవసర వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు వెంటనే దాన్ని కొనుగోలు చేయకూడదు. కనీసం వారం రోజులు వ్యవధి ఇవ్వాలి. కచ్చితంగా అవసరమైతేనే దానిని కొనుగోలు చేయాలి.
  18. ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఇంటి విలువలో కనీసం 30% - 50% వరకూ మీ దగ్గర సొంత డబ్బు ఉండాలి. మిగిలిన మొత్తాన్నే గృహ రుణంగా తీసుకోవాలి.
  19. నేడు చాలా మంది డిజిటల్ యాప్​లు, ఓటీటీ ప్లాట్​ఫామ్​లను సబ్​స్క్రైబ్​ చేస్తున్నారు. ఇవి మీపై తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయి. కనుక అత్యవసరమైన వాటికి మాత్రమే చందాలు చెల్లించాలి. అప్పుడే సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.
  20. నేడు పెట్టుబడి పథకాల తీరు చాలా వేగంగా మారిపోతోంది. అందుకే మీ జీవిత లక్ష్యాలను సాధించేందుకు ఉన్న అత్యుత్తమ మార్గాన్ని ఎంచుకోవాలి. దీని కోసం పత్రికలను చదవాలి. నిపుణుల సూచనలు వినాలి. ఎప్పటికప్పుడు అథంటిక్​ సోర్సెస్​ నుంచి కొత్త విషయాలను తెలుసుకోవాలి.
  21. నేడు దేశీయ ఆర్థిక వ్యవస్థ పనితీరు చాలా వరకు బాగుంది. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలంటే, కాలానుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఉన్న నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలి.
  22. మీ పొదుపు, పెట్టుబడి, డీమ్యాట్‌ ఖాతాలకు నామినీ పేర్లను జతచేసుకోవాలి. ఒక వేళ ఇప్పటికీ మీరు నామినీలను ఏర్పాటుచేసుకోకపోతే, 2024లో వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి.
  23. విరాళాలు ఇచ్చే వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అందుకే వీలైనంత మేరకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడం మంచిది. దీని వల్ల మీకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. పైగా సమాజానికి సేవ చేసిన తృప్తి కూడా మీకు కలుగుతుంది.
  24. ఆర్థిక పురోగతి సాధించాలంటే, చాలా ఓర్పు, క్రమశిక్షణ అవసరం. జీవన ప్రయాణంలో అనేక ఆర్థిక ఒడుదొడుకులు వస్తుంటాయి. పోతుంటాయి. అన్నింటిని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. చిన్నచిన్న లక్ష్యాలను సాధించినప్పుడు, మీకు మీరే ఆ విజయాన్ని సెలబ్రేట్​ చేసుకోండి. అది మీకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
  25. మీరు స్వయంగా ఆర్థిక ప్రణాళిక వేసుకోలేకపోతే, ఒక మంచి సర్టిఫైడ్​ ఫైనాన్సియల్ అడ్వైజర్​ సలహాలను తీసుకోవడం మంచిది.

ఈ తప్పులు చేశారో అప్పుల ఊబిలో చిక్కుకోవడం గ్యారెంటీ!

సైబర్‌ మోసానికి గురయ్యారా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.