ETV Bharat / business

ఈ తప్పులు చేశారో అప్పుల ఊబిలో చిక్కుకోవడం గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 7:14 PM IST

How To Identify That We Strucked In Debt Trap : అత్యవసర ఆర్థిక పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే ఏకైక మార్గం అప్పు చేయడం. అయితే ఈ అప్పులు పరిమితికి మించి ఉండకూడదు. ఒకవేళ ఇవి హద్దులు దాటితే గనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Identify That We Strucked In Debt Trap
How To Identify That We Strucked In Debt Trap And Tips To Get Rid From This

How To Identify That We Strucked In Debt Trap : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తుంటారు. కొందరు అవసరాల కోసం అప్పులు చేస్తే, మరికొంతమంది దుబారా ఖర్చుల కోసం కూడా విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటారు. ఈ ధోరణి తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చినా, భవిష్యత్​లో మిమ్మల్ని అప్పుల ఊబి (డెట్​ ట్రాప్​)లో పడేయడం మాత్రం ఖాయం. అందుకే ఈ డెట్ ట్రాప్​లో పడుతున్న సంకేతాలను ఎలా గుర్తించాలి? దాని నుంచి ఏ విధంగా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదాయంలో సగం వాటికే
ఈ మధ్య చాలా మంది నో-కాస్ట్‌ ఈఎంఐ, రాయితీ, తగ్గింపుల్లాంటి ఆఫర్లకు ఆకర్షితులై భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారు. ఒకవేళ చేతిలో డబ్బు లేకున్నా ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇలా ఆఫర్ల ఉచ్చులో పడి కొంటూ పోతే మన ఆదాయంలో నెలవారీ ఈఎంఐల వాటా పెరుగుతూ పోతుంది. చివరకు నిత్యావసరాల కోసం కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే ఆదాయంలో ఈఎంఐల వాటా 50% దాటకుండా చూసుకోవాలి. ఒక ఈ పరిమితికి మంచి అప్పులు దాటుతుంటే, మీరు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని గుర్తించాలి.

స్థిర ఖర్చులు పరిమితికి మంచితే!
ప్రతి కుటుంబం కూడా స్థిరంగా కొన్ని ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఇంటి అద్దె, నిత్యావసర సరకులు, పిల్లల బడి ఫీజులు తదితరాలు ఇందులోకి వస్తాయి. ఇలాంటి స్థిర ఖర్చుల వాటా మన ఆదాయంలో 50 శాతానికి మించకుండా చూసుకోవాలి. కానీ, కుటుంబంలోని పరిస్థితుల అధారంగా ఈ ఖర్చులు 70 శాతం వరకు కూడా చేరే అవకాశం ఉంది. అంతకు మించితే మాత్రం ముప్పు ముంచుకొస్తున్నట్లేనని గమనించాలి.

ఏదైనా ఒక దశలో ఒక్కసారిగా ఆసుపత్రి వ్యయాలు లాంటి పెద్ద ఖర్చులు వచ్చి పడ్డాయంటే, పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఆ సమయాల్లో పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సి వస్తుంది. స్థిర వ్యయాల వాటా ఎక్కువగా ఉంటే, అప్పులు తీర్చడానికి తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

రోజువారీ ఖర్చుల విషయంలోనూ
రోజువారీ ఖర్చులు తీర్చుకునేందుకు కూడా బయట నుంచి డబ్బులు తీసుకోవాల్సి వస్తుందంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. పిల్లల స్కూల్‌ ఫీజులు, ఈఎంఐల కోసం తరచూ అప్పు చేస్తున్నారంటే మీరు అప్పుల ఊబిలోకి జారుకుంటున్నారని అర్థం. కొంత మంది నెమ్మదిగా తర్వాత తీర్చేయవచ్చనే ధైర్యంతో అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు. కానీ, తరచూ చేసే అప్పులు గుట్టలా పేరుకుపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు
చాలా కాలంగా పేరుకుపోయిన అప్పులను తీర్చడానికి కొంత మంది మళ్లీ మళ్లీ అప్పులు చేస్తుంటారు. ఒకరి దగ్గర తీసుకున్న రుణాన్ని క్లియర్​ చేయడానికి మరొకరి దగ్గర చేయి చాస్తుంటారు. ముఖ్యంగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అలాగే మరికొందరు ఈఎంఐల ఎగవేత ముప్పు తప్పించుకోవడానికి, పిల్లల స్కూల్‌ ఫీజులు గడువులోగా చెల్లించడం లాంటి అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేస్తారు. ఇలాంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని రుణ ఉచ్చులోకి దింపుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి.

క్రెడిట్‌ కార్డుతో డబ్బులు విత్​డ్రా
క్రెడిట్‌ కార్డు నుంచి కూడా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సదుపాయాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించుకోవాలి. వెసులుబాటు ఉంది కదా అని రోజువారీ ఖర్చులు, రుణ చెల్లింపులు, వడ్డీ కోసం క్రెడిట్‌ కార్డు నుంచి నగదును విత్​డ్రా చేసి వాడుకుంటే ప్రమాదంలో పడతారు. క్రెడిట్‌ కార్డు నుంచి తీసుకునే నగదుపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. సకాలంలో తీర్చలేదంటే తిరిగి అదో పెద్ద అప్పుగా మారుతుంది. అంతేకాకుండా మీ సిబిల్​ స్కోర్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకని క్రెడిట్​ కార్డు నుంచి నగదును ఉపసంహరించుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

బ్యాంకు లోన్స్​కు నో చెప్పారంటే
రుణం కావాలంటే ముందుగా అందరికి గుర్తుకువచ్చేది బ్యాంకులు. కానీ బ్యాంకులు మన రుణ దరఖాస్తును తరచూ తిరస్కరిస్తున్నాయంటే, మీరు అప్పుల ఊబికి అంచున ఉన్నారన్న విషయం గ్రహించాలి. దరఖాస్తుదారుడి ఆర్థిక స్తోమత ఆధారంగానే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. అందుకోసం పాన్‌, ఆధార్‌ వివరాల సాయంతో దరఖాస్తుదారుడి ఇతర రుణాలు, క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ చరిత్రను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. తిరిగి చెల్లించలేని స్థితికి, దరఖాస్తుదారుడు చేరాడనుకుంటేనే అతను లేదా ఆమె పెట్టిన లోన్​ అప్లికేషన్​ను తిరస్కరిస్తాయి. ఇది కూడా మీ అప్పుల గుట్ట పెరిగిపోతుందనటానికి ఒక సంకేతం.

అంచనాలు తప్పితే అంతే సంగతి
మున్ముందు ఆదాయం పెరుగుతుందని ఒక అంచనాకు వచ్చి రుణాలు తీసుకోవడం కూడా మీరు అప్పులపై అధికంగా ఆధారపడుతున్నారనే సంకేతాన్ని సూచిస్తుంది. భవిష్యత్​లో బోనస్‌లు, రివార్డులు, రాయితీలు వస్తాయని అనుకోవడం ఈ కోవలోకి వస్తుంది. ఒకవేళ మీ అంచనాలు తప్పితే మాత్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. అందుకని ప్రస్తుత ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే రుణాలు తీసుకోవడం మంచిది.

జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌ - ఆ ప్లాన్‌పై ఏకంగా 24 డేస్ ఎక్స్​ట్రా వ్యాలిడిటీ!

వర్క్​ ఫ్రమ్​ హోమ్ చేస్తున్నారా?​ ఆ Mi-Fi ప్లాన్స్​తో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్​ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.