హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని లక్షలకు తీసుకుంటే బెటర్?

author img

By

Published : Aug 5, 2022, 11:23 AM IST

health insurance policy for family

Health insurance policy for family : అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు.. ఆర్థికంగా భారం పడకుండా ఆదుకునేది ఆరోగ్య బీమా. ఎప్పుడో ఏళ్ల క్రితం తీసుకున్న పాలసీకి క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. కానీ, ఆ ధీమా మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు సరిపోతుందన్నది మాత్రం సమీక్షించుకోరు. ఇది ఎంతమాత్రం సరికాదనే చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన బీమా పాలసీలోనూ మార్పులు, చేర్పులు తప్పనిసరి.

బీమా పాలసీ తీసుకున్నాం అంటేనే ఒక రక్షణ చక్రంలో ఉన్నట్లు. చాలామంది దీని అవసరం మనకేమిటి.. ఇప్పటికే చెల్లిస్తున్న ప్రీమియం వృథా అయ్యింది అనే భావనలో ఉంటారు. బీమా పాలసీని క్లెయిం చేసుకోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు. దురదృష్టవశాత్తూ క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు.. అది మనకు పూర్తి భరోసా కల్పిస్తుందా లేదా అనేది మాత్రం రెండు మూడేళ్లకోసారైనా చూసుకోవాలి. ఒకప్పుడు నలుగురు ఉన్న కుటుంబానికి రూ.3 లక్షల పాలసీ సరిపోయేది. ఇప్పుడు కనీసం రూ.10లక్షలు ఉంటే తప్ప.. సరైన మొత్తం కాదనేది నిపుణుల సూచన. ఆరోగ్య బీమా పాలసీ మొత్తాన్ని ఏఏ సందర్భాల్లో సమీక్షించుకోవాలో చూద్దాం..

కుటుంబం పెరిగితే..
Health insurance policy for family : ఒక వ్యక్తికి కనీసం రూ.5 లక్షల పాలసీ సరిపోతుందనుకుందాం. కానీ, జీవిత భాగస్వామి రాక, పిల్లలు ఇలా కుటుంబం పెరిగినప్పుడు.. వ్యక్తిగత పాలసీ.. ఫ్యామిలీ ఫ్లోటర్‌గా మారుతుంది. కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చినప్పుడల్లా బీమా మొత్తం అందుకు అనుగుణంగా పెంచుకోవాలి. పిల్లలు పుట్టినప్పుడు 90 రోజుల తర్వాత ఆరోగ్య బీమా పాలసీలో చేర్పించేందుకు అవకాశం ఉంటుంది. పుట్టిన వెంటనే రక్షణ కల్పించేవీ ఉన్నాయి. పిల్లలను పాలసీలో చేర్చడానికి మీ బీమా సంస్థ అనుసరిస్తున్న నిబంధనలు తెలుసుకోండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. కొత్త సభ్యులు చేరినప్పుడు.. బీమా మొత్తం పెంచుకున్నప్పుడు ప్రీమియం పెరగడం సహజం. దీనికి సిద్ధంగా ఉండండి.

ఎంత మొత్తానికి..
Health insurance limit : అయిదారేళ్ల క్రితం రూ.3లక్షల పాలసీ అంటే ఎక్కువే. మరీ ప్రాణాల మీదకు వస్తే తప్ప.. ఆసుపత్రిలో అంత ఖర్చయ్యేదీ కాదు. ఒక్కసారి ఆసుపత్రికి వెళ్తే.. ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేని పరిస్థితి ఇప్పుడు. వైద్య ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోందన్నది మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం పలు చికిత్సలకు అవుతున్న ఖర్చును దృష్టిలో పెట్టుకుంటే.. నలుగురున్న కుటుంబానికి కనీసం రూ.10లక్షల వరకూ పాలసీ ఉండాలి. బీమా సంస్థ కేవలం పాలసీ పునరుద్ధరణ సమయంలోనే బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు అవకాశం ఇస్తుంది. వ్యక్తిగత పాలసీ లేదా యాజమాన్యం అందించే బృంద బీమా పాలసీల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ప్రాథమిక పాలసీ మొత్తాన్ని పెంచుకోవడం ఇష్టం లేకపోతే కనీసం సూపర్‌టాపప్‌ పాలసీనైనా తీసుకోవడం ఉత్తమం. దీనికి ప్రీమియం కాస్త తక్కువగా ఉంటుంది. ఉండాల్సిన మొత్తం కన్నా తక్కువ పాలసీ ఉంటే.. ఆసుపత్రిలో చేరడం దగ్గర్నుంచి, చికిత్స వరకూ అన్నింట్లోనూ రాజీ పడాల్సి ఉంటుందని మర్చిపోకండి.

నిబంధనలు మారితే..
బీమా రంగంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. సంస్థల విలీనం, ఐఆర్‌డీఏఐ నిబంధనలు మారడం వల్ల పాలసీపై ప్రభావం చూపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పాలసీ మొత్తాన్ని అధికం చేయడం, ప్రీమియాన్ని పెంచడంలాంటి చూస్తుంటాం. ఈ నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటే పాలసీని కొనసాగించండి. లేదా ఇతర బీమా సంస్థకు పోర్టబిలిటీ చేసేందుకు ప్రయత్నించండి. పునరుద్ధరణకు కనీసం 45 రోజుల ముందే దీనికోసం దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థను సంప్రదించి..
మీ పాలసీపై అందిస్తున్న ప్రయోజనాలు.. ఇతర సంస్థల పాలసీలలో ఉన్న అంశాలను పరిశీలిస్తూ ఉండాలి. పాలసీలో అనుమానాలుంటే.. బీమా సంస్థను సంప్రదించి, వాటిని నివృత్తి చేసుకోవాలి. అదనంగా ఏదైనా కొత్త వ్యాధులు, చికిత్స పద్ధతులకు రక్షణ కల్పిస్తోందా చూడండి. మినహాయింపులు, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల గురించి మీరు పూర్తి సమాచారం తెలుసుకోండి. పాలసీ పునరుద్ధరణ సమయంలోనైనా.. అది అందిస్తున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.