ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి అదానీ, అంబానీ ర్యాంకు ఎంతంటే

author img

By

Published : Aug 30, 2022, 9:31 AM IST

gautam adani net worth
gautam adani net worth

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల ర్యాంకుల్లో మూడో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మాత్రమే అదానీ కంటే ముందున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. వీరి సంపద ఎంతంటే

Gautam Adani net worth : భారత అపర కుబేరుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ సూచీలో అదానీ దూసుకెళ్తున్నారు. తాజాగా ఫ్రాన్స్ సంపన్నుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్​ను వెనక్కినెట్టి.. ప్రపంచంలోనే మూడో అత్యంత ధనికుడిగా ఘనత సాధించారు. 60 ఏళ్ల అదానీ సంపద ప్రస్తుతం 137.4 బిలియన్ డాలర్లు అని బ్లూమ్​బర్గ్ లెక్కగట్టింది. ఈ సూచీలో ఆసియా నుంచి టాప్ 3లో చోటు దక్కించుకున్న తొలి వ్యక్తి అదానీనే కావడం విశేషం.

మరో భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 91.9 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాత్రమే అదానీ కంటే ముందున్నారు. మస్క్ సంపద 251 బిలియన్ డాలర్లు కాగా, జెఫ్ బెజోస్ 153 బిలియన్ డాలర్ల సంపద కలిగిఉన్నారు.

గత రెండేళ్లలో అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని లిస్టెడ్‌ కంపెనీల షేర్ల విలువలు 600 శాతానికి పైగా పెరిగాయని బ్లూమ్​బర్గ్ గతంలో వెల్లడించింది. దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 25 శాతం వాటా కలిగిన 7 విమానాశ్రయాలు గత 3 ఏళ్లలోనే అదానీ పరం అయ్యాయని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో హోల్సిమ్‌ గ్రూప్‌ వాటాను 10.5 బి.డా.కు గత మే నెలలో కొనుగోలు చేయడం ద్వారా, ఒక్కసారిగా దేశీయ సిమెంటు తయారీలో రెండోస్థానానికి అదానీ గ్రూప్‌ చేరింది. ఇజ్రాయెల్‌లో అతిపెద్ద నౌకాశ్రయమైన హైఫాను గత వారంలో 1.18 బి.డా.కు కొనుగోలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.