దిగొచ్చిన ట్విట్టర్.. ఎలాన్‌ మస్క్‌తో చర్చలు.. డీల్​ ఖాయం!

author img

By

Published : Apr 25, 2022, 4:17 PM IST

elon musk twitter

Twitter in talks with Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలు విషయంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మస్క్​ చర్యలతో ట్విట్టర్​ బెట్టువీడక తప్పలేదు. షేర్​హోల్డర్ల ఒత్తిడితో మస్క్​తో ట్విట్టర్​ బోర్డు సోమవారం తెల్లవారుజామున సమావేశమైంది. ఒప్పందం కుదిరితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.

Twitter in talks with Musk: ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించి పది రోజుల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం టెస్లా సీఈఓతో ట్విట్టర్​ బోర్డు చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఒప్పందం కుదిరితే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, కాల వ్యవధి​, ఖర్చులు వంటి కీలక అంశాలపై ఇరువర్గాలు చర్చించాయని ఈ అంశానికి సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపినట్లు ద టైమ్స్​ పేర్కొంది.

10 రోజుల క్రితం ట్విట్టర్​ కొనుగోలు చేసేందుకు 46.5 బిలియన్​ డాలర్ల ఆఫర్​ ఇచ్చారు మస్క్​. తొలుత ఈ ప్రతిపాదనను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ట్విట్టర్‌ బోర్డు సైతం తాము కంపెనీని విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలిచ్చింది. కానీ, మస్క్‌ ఊరుకోలేదు. తాను ఈ విషయంలో ఎంత స్పష్టతతో ఉన్నారో తెలియజేసేలా ఎప్పటికప్పుడు సంకేతాలిస్తూ వచ్చారు. చివరకు లావాదేవీకి కావాల్సిన నిధుల్ని కూడా సిద్ధం చేసుకున్నారు. కొనుగోలు సౌలభ్యం కోసం హోల్డింగ్‌ కంపెనీని సైతం రిజిస్టర్‌ చేయించారు. మస్క్‌ చర్యలతో ట్విట్టర్‌ బెట్టువీడక తప్పలేదు. 'పాయిజన్‌ పిల్‌' వ్యూహంతో అడ్డుకట్ట వేయాలనకున్న యత్నాలన్నింటినీ ట్విట్టర్‌ దాదాపు పక్కన పెట్టేసింది. షేర్‌హోల్డర్లు సైతం ఒత్తిడి తేవడం వల్ల ట్విట్టర్‌ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఈ మేరకు సోమవారం తెల్లవారు జామున మస్క్​తో ట్విట్టర్​ బోర్డు సమావేశమై ఒప్పందంపై చర్చించినట్లు తెలుస్తోంది.

మస్క్‌ ఒక్కో ట్విట్టర్‌ షేరుకు 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్‌ డాలర్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన వివిధ బ్యాంకుల నుంచి 46 బిలియన్‌ డాలర్ల రుణాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ట్విట్టర్‌ బోర్డుతో సంబంధం లేకుండా టెండర్‌ ఆఫర్‌ ద్వారా ఆయన నేరుగా వాటాదారులతో చర్చలు జరపాలని నిశ్చయించుకొన్నారు. ఈ మేరకు గత శుక్రవారం పలువురితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడినట్లు సమాచారం. ట్విట్టర్‌ ఎదుగుదలకు వాక్‌ స్వేచ్ఛపై నియంత్రణలు ప్రతిబంధకంగా మారాయని.. వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ట్విట్టర్‌ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవుతూ వస్తోందని మస్క్‌ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను ఆఫర్‌ చేసిన ధర కంటే మంచి విలువను తీసుకురావడం ప్రస్తుత ట్విట్టర్‌ యాజమాన్యానికి సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆదాయం కోసం ప్రకటనలపై ఆధారపడడాన్ని తగ్గించడం, పొడవైన ట్వీట్లను అనుమతించడం, ఎడిట్‌ బటన్‌ సహా పలు మార్పులను మస్క్‌ ఇప్పటికే ప్రతిపాదించారు.

ఇదీ చూడండి: ట్విట్టర్​ కొనుగోలుకు మస్క్​ ప్లాన్​- 46.5బిలియన్​ డాలర్లతో ప్రణాళిక

ట్విట్టర్ మాస్టర్​ ప్లాన్​.. 'పాయిజన్​ పిల్'​తో మస్క్​ ప్రయత్నాలకు చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.