ETV Bharat / business

పెరిగిన డిపాజిట్ రేట్లు.. పొదుపు పథకాల్లో ఏది బెటర్?

author img

By

Published : Jan 3, 2023, 2:07 PM IST

deposit rates are going high
డిపాజిట్‌ రేట్లు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్‌బీఐ రెపోరేటును పెంచింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు డిపాజిట్‌ రేట్లను సైతం పెంచాయి. మరి చిన్న పొదుపు పథకాల్లో ఏవి మంచి రాబడినిస్తున్నాయో చూద్దాం..!

ప్రభుత్వం వరుసగా రెండో త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల పై వడ్డీ రేట్లను పెంచింది. ఇవి 20 నుంచి 110 బేసిస్ పాయింట్ల మధ్య పెరిగి 4.0 శాతం నుంచి 7.6 శాతం వరకు చేరుకున్నాయి. 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే లక్ష్యంతో మే 2022 నుంచి రెపో రేటును 225 బీపీఎస్‌ పెంచిన నేపథ్యంలో డిపాజిట్‌ రేట్లు సైతం పెరుగుతున్నాయి. చిన్న పొదుపు పథకాల రేట్లు ముందుగా నిర్వచించిన సూత్రం ఆధారంగా మార్కెట్‌కు అనుసంధానమై ఉంటాయి. సెప్టెంబరులో విడుదల చేసిన చివరి ద్రవ్య విధాన నివేదిక ప్రకారం ఈ రేట్లు సూత్రం ఆధారిత రేట్ల కంటే 44- 77 bps తక్కువగా ఉన్నాయి. అందువల్లే డిపాజిట్‌ రేట్ల పెంపు అనివార్యమైంది.

వీటిలోనే గరిష్ఠ పెంపు..
డిపాజిట్‌ రేట్లు అత్యధికంగా ఒక ఏడాది, రెండు సంత్సరాలు, మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పెరిగాయి. అంతకంటే తక్కువ గడువు గల డిపాజిట్లు రేపో రేటుపై ఆధారపడి ఉంటాయి. అలాగే మూడేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటు ప్రభుత్వ సెక్యూరిటీల వంటి మార్కెట్‌ సాధనాలపై ఆధారపడి ఉంటుంది. రెపోరేటు 225 బీపీఎస్‌ పెరిగిన నేపథ్యంలో డిపాజిట్‌ రేట్ల పెరుగుదల అత్యధికంగా తక్కువ గడువు ఉన్న డిపాజిట్లపైనే ఉంటుంది.

ఎందులో రాబడి ఎక్కువ?
డిపాజిట్‌ రేట్లు పెరిగిన నేపథ్యంలో సురక్షిత మదుపు మార్గాల్లో ఏది ఆకర్షణీయమైన రాబడినిస్తోందనే ప్రశ్న తలెత్తుతోంది? 'సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్​సీఎస్ఎస్​)'లో ప్రస్తుతం 8 శాతం వడ్డీరేటు లభిస్తోంది. మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దాదాపు అన్నింట్లో 7 శాతానికి కొంచెం అటుఇటుగా ఉంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగువకు చేరింది. సమీప భవిష్యత్తులో అనూహ్యంగా పెరిగే సూచనలు కూడా లేవని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్న పొదుపు పథకాలన్నీ ప్రస్తుతం ఆకర్షణీయమైన రాబడినే ఇస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, పన్నును పరిగణనలోకి తీసుకుంటే ఫలితం మారొచ్చు. కాబట్టి మదుపర్లు ఏ పన్ను శ్లాబులోకి వస్తారనేది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం. దిగువ పన్ను శ్లాబుల్లో ఉన్నవారికి ఎస్‌సీఎస్‌ఎస్‌ మెరుగైన రాబడినిస్తుందని నిపుణుల సూచన.

వీటి మాటేంటి?
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై) రేట్లు మాత్రం మారలేదు. ఇవి వరుసగా 7.1 శాతం, 7.6 శాతంగా కొనసాగుతున్నాయి. అయితే, ఇవి ఆకర్షణీయం కాదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇవి దీర్ఘకాల పెట్టుబడి సాధనాలు. వీటికి రెపోరేటుతో సంబంధం లేదు. పైగా పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాల లక్ష్యాల సాధన, రిడెమ్షన్‌ ప్రక్రియ.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై ఎప్పటికీ ఆకర్షణీయమే అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

పోస్టాఫీస్‌ V/S బ్యాంకులు
పోస్టాఫీస్‌, బ్యాంకులు.. ఈ రెండింటిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వడ్డీరేటు దాదాపు ఒకేరకంగా ఉంటుంది. ఏమైనా వ్యత్యాసం ఉన్నా 0.1- 0.3 శాతం వరకే పరిమితమవుతుంది. అయితే, బ్యాంకుల్లో డిపాజిట్‌ కాలపరిమితి ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. పోస్టాఫీసులు మాత్రం ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల గడువుతో మాత్రమే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. పోస్టాఫీసు ఎఫ్‌డీలను ఆరు నెలలు గడిచిన తర్వాత మాత్రమే ముందస్తు ఉపసంహరణకు వీలుంటుంది. ఈ విషయంలో బ్యాంకులు మాత్రం కొంత వెసులుబాటు కల్పిస్తాయి. మరోవైపు పోస్టాఫీసుల్లో వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు. బ్యాంకుల్లో మాత్రం నెల, త్రైమాసికం, అర్ధవార్షికం, ఏడాది.. ఇలా కస్టమర్లకు వెసులుబాటు ఉంటుంది. అయితే, మూడు, ఐదేళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసుల్లోనే ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లతో పోలిస్తే తక్కువ పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చేవారికి చిన్న పొదుపు పథకాలే మేలని నిపుణుల సూచన. అదే ఎగువ పన్ను శ్లాబు వర్తించేవారు దీర్ఘకాలంలో డెట్‌ ఫండ్లలో మదుపు చేయడం వల్ల ఇండెక్సేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. పైగా వాటిని విక్రయించే వరకు ఎలాంటి పన్ను వర్తించదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.