ETV Bharat / business

'వాణిజ్య వివాదాల పరిష్కారంలో 'మధ్యవర్తిత్వ విధానం' మేలు'

author img

By

Published : Jul 6, 2022, 6:38 AM IST

CJI ARBITRATION
CJI ARBITRATION

CJI NV Ramana News: ప్రపంచ వాణిజ్య రంగానికి మధ్యవర్తిత్వం ఉత్తమమైన వివాద పరిష్కార యంత్రాంగం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆయా అంశాల్లో నిపుణులైన న్యాయమూర్తులను ఈ కోర్టుల్లో నియమించాలని సూచించారు.

CJI NV Ramana Arbitration: కోర్టుల్లో పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్న తరుణంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానాన్ని ఆశ్రయించడమే మంచిదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. 'భారత్‌-యూకే వాణిజ్య వివాదాలు.. మధ్యవర్తిత్వం' అంశంపై మంగళవారం లండన్‌లో ఫిక్కీ, ఐసీఏ సంస్థలు నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆర్థిక, బీమా, స్టాక్‌, వాణిజ్య రంగాలన్నింటికీ లండన్‌ ముఖద్వారంగా మారిందని చెప్పారు.

"భారత్‌లో కేసుల పెండింగ్‌.. ప్రధాన సమస్యగా మారిందన్నది నిర్వివాదాంశం. నేను భారత్‌లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, సంఖ్య పెంపు కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాను. వివాద పరిష్కారానికి సంప్రదాయ మార్గాల బదులు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించడమే మేలు. వేగంగా, సమర్థంగా వివాదాలను పరిష్కరించేందుకు భారత్‌ అంతటా పలు అంతర్జాతీయ వివాద పరిష్కార సంస్థలు ఏర్పాటయ్యాయి. దేశంలో వివిధ రాష్ట్రాలు కూడా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నాయి. వ్యవస్థాగత ఆర్బిట్రేషన్‌ కేంద్రాల ద్వారా సమర్థ పరిపాలన సాధ్యమవుతుంది. అడ్డంకులు లేకుండానే వివాద పరిష్కారం సాధ్యమవుతుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటు వల్ల పెట్టుబడుల అనుకూల దేశంగా భారత్‌ పేరు పొందడమే కాకుండా దేశీయంగా న్యాయవాద వృత్తి పురోగమిస్తుంది" అని జస్టిస్‌ రమణ చెప్పారు.

తగిన సమయంలో పరిష్కారం అతి ముఖ్యం
"ప్రపంచంలో ఏటా లక్ష కోట్ల డాలర్ల విలువైన సంస్థల విలీనాలు, స్వాధీనతలు జరుగుతున్నాయి. భారీ ఆర్థికాంశాలతో ముడిపడిన లావాదేవీలకు తగిన సమయంలో వివాద పరిష్కారం అతి ముఖ్యం. మధ్యవర్తిత్వ వ్యవస్థను అత్యంత సమర్థ వివాద పరిష్కార కేంద్రంగా మార్చాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులో ప్రధానమైనవి..

  1. ఆర్బిట్రేషన్‌ కేసుల విచారణకు మరిన్ని వాణిజ్య కోర్టులు ఏర్పాటుచేసి, ఆ రంగంలో నిపుణులైన వారిని న్యాయమూర్తులుగా నియమించాలి.
  2. ఆర్బిట్రేషన్‌ ప్రక్రియలో పర్యవేక్షణకే కోర్టుల పాత్ర పరిమితం కావాలి. సహాయానికి, జోక్యానికి మధ్య తేడాను గుర్తించి లక్ష్మణ రేఖ దాటకుండా మసలుకోవాలి.
  3. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌, ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిజొల్యూషన్‌ లాంటి నైపుణ్యవంత సంస్థలు మరిన్ని రావాలి.
  4. ఆర్బిట్రేషన్‌ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన అంశం తీర్పును అమలు చేయడమే. పెట్టుబడుల కేంద్రంగా మారిన భారత్‌కు ఇది చాలా ముఖ్యం. వివాదాల పరిష్కారం కోసం ఏదైనా పెట్టుబడి ఒప్పందాన్ని మల్లోకి తీసుకురావడానికి ముందు, దాన్ని మదింపుచేసి లోపాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరిదిద్దే ప్రత్యేక అధికార వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
  5. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న వ్యవస్థాగత ఆర్బిట్రేషన్‌ సెంటర్లన్నీ చేతులు కలిపి ఒక మండలిగా కానీ, సమాఖ్యగా కానీ ఏర్పడితే బాగుంటుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ వివాద పరిష్కార, మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నేను చొరవ తీసుకున్నాను. గుజరాత్‌లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడం సంతోషకరం. లండన్‌లోని ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ నుంచి ఈ రెండూ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది" అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: '28% పన్ను బాదుడు తప్పదు.. జీఎస్​టీ పరిధిలోకి చమురు అప్పుడే!'

హోటల్స్, రెస్టారెంట్స్​ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.