ETV Bharat / business

BlueLeaves Farm startup : నీటిలో కూరగాయలు పెంచేద్దాం

author img

By

Published : Jan 15, 2023, 2:23 PM IST

BlueLeaves Farm startup: ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు పొలం నుంచో, ఇంటి పెరటి నుంచే తీసుకొనే వాళ్లం. నగరాలే కాదు పట్టణాల్లోనూ ఇంటి ఆవరణల విస్తీర్ణం తగ్గినందున, అత్యధికులు కూరగాయల వ్యాపారుల దగ్గర తెచ్చుకుంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే మట్టి అవసరం లేకుండా, నీటిలోనే తాజా ఆకుకూరలను పండించుకునేందుకు అనువైన పరికరాలను అందిస్తున్నామని చెబుతున్నారు బ్లూలీవ్స్‌ సహ వ్యవస్థాపకులు శ్వేత కోండ్రు. సంస్థ గురించి ఆమె ఇలా వివరిస్తున్నారు...

బ్లూలీవ్స్‌
బ్లూలీవ్స్‌

BlueLeaves Farm startup: తక్కువ స్థలంలో ఎక్కువ పంట పండించాలనే తపన నుంచి పుట్టిందే మా బ్లూలీవ్స్‌. సంస్థ సహ వ్యవస్థాపకుడు లిఖిత్‌ శ్యాం అమెరికాలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశారు. నేను అగ్రికల్చర్‌ సైన్స్‌ (జెనెటిక్స్‌, ప్లాంట్‌ బ్రీడింగ్‌) చదివాను. లిఖిత్‌ ప్రాజెక్టులో భాగంగా ఆఫ్రికాకు వెళ్లి, తక్కువ వనరులతో ఆహార పదార్థాలను ఎలా పండించాలి అనే అంశంపై పనిచేశారు. పలు విధాలుగా పంటలు పండించడంపై పరిశోధనలు చేశారు. అలా వచ్చిన ఆలోచనే ఈ హైడ్రోఫోనిక్స్‌ ప్లాంటర్స్‌. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దశలో ఇక్కడికి వచ్చారు. అలా 2018లో సంస్థ ప్రారంభం అయ్యింది. అందులో నేనూ చేరాను. 2021 నాటికి మా పరిశోధనలకు తుది రూపం తీసుకొచ్చాం.

..

40 ఎకరాల్లో వచ్చే పంట దిగుబడిని ఒక ఎకరం స్థలంలోనే తీసుకురావడమే మా లక్ష్యం. ఇందుకు అనుగుణంగా నిలువుగా ఉండేలా క్వాంటం ఫామ్స్‌ పేరుతో పరికరాలను రూపొందించాం. 30 అడుగుల ఎత్తు వరకూ ఇవి ఉంటాయి. వీటిని నిర్వహించేందుకు రోబోలనూ తయారు చేశాం. ఒక చదరపు అడుగు విస్తీర్ణంలో 20-24 మొక్కలు పెంచుకునే వీలు కల్పించాం.

..

సూపర్‌ మార్కెట్లలోనూ.. హైడ్రోఫోనిక్స్‌ ప్లాంటర్లను సూపర్‌ మార్కెట్లలోనూ ఏర్పాటు చేయబోతున్నాం. దీనివల్ల వినియోగదారులు తమకు కావాల్సిన ఆకుకూరలను అప్పటికప్పుడు కోసుకునేందుకు వీలుంటుంది. అపార్ట్‌మెంట్లలో ఉండే వాళ్లూ తాజా ఆకుకూరలను పెంచుకునే విధంగా ఒక అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకూ ఉండే పరికరాలు ఉన్నాయి. సూర్యరశ్మి అందుబాటులో లేకున్నా ఇబ్బంది లేకుండా వీటిని తీసుకొస్తున్నాం. తక్కువ విస్తీర్ణంలోనూ 100-200 మొక్కలు పెంచుకునే వీలుంది. ఆకుకూరలే కాదు.. రకరకాల కాయగూరలు, పుట్టగొడుగులూ పెంచుకోవచ్చు.

అవసరాన్ని బట్టి.. మా దగ్గర ఎనిమిది రకాల ప్లాంటర్లు అందుబాటులో ఉన్నాయి. అవసరానికి అనుగుణంగా తయారు చేసి ఇస్తున్నాం. బ్లూలీవ్స్‌.ఫామ్‌ వెబ్‌సైట్‌తోపాటు, ప్రముఖ ఇ-కామర్స్‌ సైట్లలోనూ మా ఉత్పత్తులు బ్లూలీవ్‌ ఫామ్స్‌ హైడ్రోఫోనిక్స్‌ కిట్‌ పేరుతో లభిస్తున్నాయి. రకాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.50వేల వరకూ వీటి ధర ఉంటుంది. ప్రస్తుతం ఈ కిట్లను బ్రిటన్‌కూ ఎగుమతి చేస్తున్నాం. బహుమతులుగానూ మా పరికరాలను అందిస్తున్న వారి సంఖ్య పెరిగింది.

భవిష్యత్తులో.. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక చోట క్వాంటం ఫామ్‌ ఏర్పాటు చేయాలనేది మా లక్ష్యం. ఇప్పటికే కొన్ని ఆర్డర్లు లభించాయి. చాలా మంది రైతులు క్వాంటం ఫామ్స్‌ కోసం మమ్మల్ని సంప్రదించారు. మా బృందంలో 20 మంది సభ్యులున్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికోసం దాదాపు రూ.4 కోట్ల వరకూ పెట్టుబడి అవసరం అవుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.