ETV Bharat / business

రూ.లక్షన్నర కోట్లు దానం చేసిన బిల్​గేట్స్​.. కుబేరుల జాబితా నుంచి బయటకు!

author img

By

Published : Jul 15, 2022, 10:43 AM IST

Updated : Jul 15, 2022, 11:01 AM IST

Bill Gates: ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ తన సంపదలో 20 బిలియన్‌ డాలర్లు (సుమారు లక్షన్నర కోట్ల)ను బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ సంస్థకు అందజేస్తానని ప్రకటించారు. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే బయటకు వస్తానని వెల్లడించారు.

bill gates donation
bill gates donation

Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌.. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే బయటకు వస్తానని వెల్లడించారు. తన సంపదలో మరో 20 బిలియన్‌ డాలర్లు (సుమారు లక్షన్నర కోట్ల)ను బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ సంస్థకు అందజేస్తానని ప్రకటించారు. తద్వారా గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు, ప్రణాళికకు సంబంధించిన విషయాలను తన వ్యక్తిగత బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

'ఒకసారి భవిష్యత్తులోకి తొంగిచూస్తే.. నాకు, నా కుటుంబానికి ఖర్చుచేసినవి మినహా నా సంపదనంత ఫౌండేషన్‌కే ఇవ్వాలనేది నా ప్రయత్నం. ఇందులో భాగంగా తాజాగా మరో 20 బిలియన్‌లను ఫౌండేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇలా చేయడం వల్ల కొంతకాలం తర్వాత ప్రపంచ సంపన్నుల జాబితాలోనుంచి బయటకు వస్తాను. ఈ తరహాలో నగదు సహాయం చేయడం త్యాగం కాదు. ప్రపంచం చవిచూస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో భాగస్వామ్యం కావడాన్ని గొప్పగా భావిస్తాను. ప్రజల జీవితాన్ని మరింత మెరుగుపరచడంలో భాగంగా సమాజానికి తన దగ్గర ఉన్న వనరులను అందించడాన్ని ఉపకారంగా భావిస్తాను' అని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.

70 బిలియన్‌ డాలర్ల ఫౌండేషన్‌..: 'రెండు దశాబ్దాల నుంచి ఒక బిలియన్‌ డాలర్ల నుంచి మొదలుకొని ప్రతిఏటా 6బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసే (కొవిడ్‌ విజృంభణకు ముందు) స్థాయికి ఫౌండేషన్‌ చేరుకుంది. కరోనా సమయంలోనూ ఏటా 2బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాం. 2026 నాటికి దీనిని 9 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇచ్చే 20 బిలియన్‌ డాలర్లతో గేట్స్‌ ఫౌండేషన్‌ విరాళాల విలువను 70 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.5 లక్షల కోట్లు) పెంచాలని నిర్ణయించాం' అని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. ఇటీవల చవిచూస్తోన్న కరోనా వైరస్‌, ఉక్రెయిన్‌ యుద్ధం, వాతావరణ మార్పులతో పాటు ఇతర సంక్షోభాలను ప్రస్తావించిన ఆయన.. ఇటువంటి కష్టకాలంలో మన భాగస్వామ్యం కూడా మరింత పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం, బిల్‌గేట్స్‌ సంపద 113 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. కాగా 217 బిలియన్‌ డాలర్ల సంపదతో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తొలిస్థానంలో ఉన్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (134 బి.డాలర్లు), బెర్నార్డ్‌ జీన్‌ ఆర్నాల్ట్‌ (127 బి.డాలర్లు) రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇలా ప్రపంచ సంపన్నుల జాబితాలో కొనసాగుతున్న బిల్‌గేట్స్‌.. విరాళాలను మరింత పెంచడం ద్వారా త్వరలోనే ఆ జాబితా నుంచి బయటకు రానున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

క్రెడిట్​ కార్డ్​తో నష్టం కాదు లాభమే! ఈ సింపుల్​ ట్రిక్స్​ పాటిస్తే చాలు!!

మరమ్మతు ఇక మన ఇష్టం.. కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్​ పెట్టేలా 'రైట్ టు రిపేర్'

Last Updated :Jul 15, 2022, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.