ETV Bharat / business

250 విమానాలు కొంటున్న ఎయిర్​ఇండియా.. ప్రపంచంలోనే అతిపెద్ద డీల్!

author img

By

Published : Feb 14, 2023, 5:36 PM IST

Updated : Feb 14, 2023, 6:11 PM IST

air india aircraft order
ఎయిర్​బస్​తో ఎయిర్​ఇండియా ఒప్పందం

ఎయిర్ఇండియా ఆపరేషన్స్‌ మరింత విస్తరింపజేయాలని నిర్ణయించిన టాటా గ్రూప్‌ 250 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎయిర్ఇండియాను లాభాలబాట పట్టించేందుకు వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది.

గతేడాది నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌ దాని సేవలు విస్తరించడం ద్వారా లాభాల బాట పట్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలు కొనుగోలు చేయనుంది. 17 ఏళ్ల తర్వాత ఎయిర్ఇండియా తొలిసారి విమానాల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో విశాలమైన బాడి కలిగిన 40 A-350 విమానాలతోపాటు 210 సన్నని బాడి కలిగిన విమానాలు ఉన్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు.

వర్చువల్‌గా జరిగిన ఎయిర్ఇండియా-ఎయిర్‌ బస్‌ ఒప్పంద కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. విశాలమైన బాడీ కలిగిన విమానాలను అల్ట్రా లాంగ్‌హాల్‌ విమానాల కోసం ఉపయోగించనున్నట్లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. సాధారణంగా 16 గంటల కంటే కొంచెం ఎక్కువ వ్యవధి కలిగిన విమానాలను అల్ట్రా-లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటారు.

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా చివరిసారి 2005లో 111 విమానాల కోసం ఆర్డర్‌ చేసింది. బోయింగ్‌ నుంచి 68, ఎయిర్‌ బస్‌ నుంచి 43 విమానాలను 10.8 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి 27తో ఎయిర్ఇండియా యాజమాన్యం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్త విమానాల కొనుగోలు కోసం చారిత్రాత్మక ఒప్పందానికి తుదిరూపం ఇస్తున్నట్లు ప్రకటించింది. విహాన్ కార్యక్రమం ద్వారా ఎయిరిండియా ఆపరేషన్స్‌ విస్తరించేందుకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధంచేసిన టాటా గ్రూప్‌ వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

Last Updated :Feb 14, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.