Gold Bonds: పసిడి బాండ్లు దీర్ఘకాలంలో లాభమే

author img

By

Published : Mar 20, 2022, 5:58 AM IST

Gold Bonds

Gold Bonds: సంప్రదాయంగా పసిడిని సురక్షిత పెట్టుబడి పథకంగా భావిస్తుంటారు. కొనుగోలు చేసేటప్పుడు చాలామందికి నాణ్యత విషయంలో సందేహం ఉంటుంది. పైగా దాన్ని భద్రపర్చుకోవడం ఒక సమస్యగానూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా వచ్చినవే సార్వభౌమ పసిడి బాండ్లు (సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు- ఎస్‌జీబీ). రష్యా- ఉక్రెయిన్‌ పరిణామాల కారణంగా ఇటీవల బంగారం ధరలు మళ్లీ పెరగడంతో బాండ్లపై ప్రతిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది.

Gold Bonds: బంగారంలో మదుపు చేయాలనుకునే వారికి సులభంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ సార్వభౌమ పసిడి బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. 2015 నవంబరు 5న ఈ బాండ్లను తొలిసారిగా ఆర్‌బీఐ విడుదల చేసింది. దాదాపు 9,15,953 గ్రాముల బంగారానికి విలువైన బాండ్లను విక్రయించడం ద్వారా రూ.246 కోట్లు వసూలయ్యాయి. అప్పుడు గ్రాము అంటే ఒక యూనిట్‌ ధర రూ.2,684. ఆదరణ బాగుండటంతో ఆర్‌బీఐ వరసగా ఈ బాండ్లను విడుదల చేయడం ప్రారంభించింది. 2017-18 లో ఏకంగా 14 విడతల్లో ఈ బాండ్లను జారీ చేసింది. తక్కువ డబ్బుతో బంగారంలో పెట్టుబడికి అవకాశం ఉండటం, పెట్టిన పెట్టుబడిపై ఏటా 2.5శాతం వడ్డీ లెక్కన, ఆరు నెలలకోసారి చెల్లించడంలాంటి ప్రయోజనాలతో చాలామంది తమ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం వీటిని ఎంచుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదో విడత బాండ్ల ఇష్యూ ఈనెల 4 వరకు జరిగింది. వీటికి యూనిట్‌ కనీస ధర రూ.5,109గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసే రిటైల్‌ మదుపరులకు రూ.50 తగ్గింపు లభించింది. అదే గత జనవరిలో ఈ బాండు ధర రూ.4,786గా ఉంది.

75 శాతానికి పైగానే రాబడి..

2015-16లో 3 విడతల్లో ఈ బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. 2016-17లో నాలుగు విడతల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి 10 విడతల్లో ఈ బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. 2015-16లో తొలి విడత బాండ్లు వచ్చినప్పుడు ధర రూ.2,684. ఇప్పుడు ఇవి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో దాదాపు రూ.4,700 పలుకుతున్నాయి. అంటే, ఈ ఆరేళ్లలో దాదాపు 75 శాతం వరకు రాబడి వచ్చిందన్నమాట. 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో వచ్చిన బాండ్‌ విలువ రూ.2,951. ఈ నాలుగేళ్లలో 59శాతానికి దరిదాపుల్లో రాబడి అందింది. దీనికి ఆరు నెలలకోసారి వచ్చే వడ్డీ అదనం అన్నది గుర్తుంచుకోవాలి. కొత్తగా జారీ చేస్తున్న బాండ్లకు బదులు స్టాక్‌ ఎక్సేంజీల్లో వివిధ వ్యవధుల బాండ్లను పరిశీలించి కొనుగోలు చేయడం ద్వారా మరింత తక్కువ ధరకే బాండ్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, స్వల్పకాలిక పెట్టుబడులకు వర్తించే పన్ను నిబంధనలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:

ఆధార్‌కార్డుపై మీ ఫొటో మార్చాలనుకుంటున్నారా? ఇలా చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.