ఆధార్‌కార్డుపై మీ ఫొటో మార్చాలనుకుంటున్నారా? ఇలా చేయండి..

author img

By

Published : Mar 19, 2022, 4:59 PM IST

Aadhaar photo change

Aadhaar photo update: ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్​ కార్డు అవసరం. అయితే.. ఆధార్​ కార్డుల్లోని తప్పుల్ని సరిచేసుకోవడంలో ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిపై ఉన్న ఫొటో బాగోలేదని చాలామంది బాధపడుతుంటారు. మరి ఆధార్​కార్డుపై ఫొటోను ఎలా మార్చుకోవచ్చు, దాని ప్రక్రియ ఏమిటి?

Aadhaar photo update: ప్రతి భారతీయుడు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన గుర్తింపు కార్డు ఆధార్‌. ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవలు పొందాలన్నా ఇది లేనిదే పని జరగదు. చివరకు విద్యాలయాల్లో అడ్మిషన్లు, సిమ్‌ కార్డులు, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, పింఛను.. ఇలా ప్రతిదానికీ ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్‌ సమాచారం కూడా ఈ 12 అంకెలతో కూడిన కార్డులో నిక్షిప్తమై ఉన్నందున దీని భద్రత చాలా ముఖ్యం.

అయితే, చాలా మంది ఆధార్‌ కార్డుల్లో తప్పుల్ని సరిచేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇదే క్రమంలో చాలా మందికి ఆధార్‌కార్డుపై ఉన్న తమ ఫొటో నచ్చదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ముఖంలో మార్పులు వస్తుంటాయి. మరి చాలా ఏళ్ల క్రితం తీసిన ఆధార్‌పై ఫొటోకు ఇప్పటి మన ముఖానికి పోలికలే ఉండవు. అలాంటప్పుడు గుర్తింపు తప్పనిసరైన చోట ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మరి ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చుకునే ప్రక్రియ ఏంటో చూద్దాం..

  1. యూఐడీఏఐ (UIDAI) వెబ్‌సైట్‌ (https://uidai.gov.in/) నుంచి ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌/కరెక్షన్‌/అప్‌డేట్‌ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకొని సరైన వివరాలతో పూరించాలి.
  2. దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారంను సమర్పించాలి.
  3. అక్కడ వారు కొత్త ఫొటోను తీసుకుంటారు.
  4. మీ బయోమెట్రిక్‌తో వివరాలను ధ్రువపరుస్తారు.
  5. రూ.100+ జీఎస్టీ చెల్లించాలి.
  6. అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌తో పాటు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌(URN)ను తీసుకోవాలి.
  7. యూఆర్‌ఎన్‌తో కొన్ని రోజుల తర్వాత మీ అప్‌డేట్‌ స్థితిని తెలుసుకోవచ్చు.

కొత్త ఫొటోతో మీ ఆధార్‌ అప్‌డేట్‌ కావడానికి గరిష్ఠంగా 90రోజుల వరకు పట్టొచ్చు. అలాగే ఫొటో అప్‌డేట్‌ చేయడానికి ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అసవరం ఉండదు.

డౌన్‌లోడ్‌ ఇలా..

  • UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'డౌన్‌లోడ్‌ ఆధార్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  • ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేముందు అక్కడ ఉన్న క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.
  • ఆ తర్వాత సెండ్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేసి.. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మీకు పీడీఎఫ్‌ రూపంలో ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్‌ ద్వారా వస్తాయి.
  • లేదా దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి యూఆర్‌ఎన్‌ సహా ఇతర వివరాలు చెప్పి కూడా ఆధార్‌కార్డు తీసుకోవచ్చు.

ఇదీ చూడండి: రెడ్​మీ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్.. కింద పడినా ఏమీ కాదట​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.