ETV Bharat / business

మళ్లీ అదే 'కరోనా' కథ- మార్కెట్లకు రికార్డు నష్టాలు

author img

By

Published : Mar 23, 2020, 9:24 AM IST

Updated : Mar 23, 2020, 3:49 PM IST

STOCK MARKETS CRASH AGAIN
కరోనా ఎఫెక్ట్​.. భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

15:43 March 23

వారాంతంలో భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు కుదేలయ్యాయి. తొలుత 10 శాతం నష్టపోయిన కారణంగా 45 నిమిషాల పాటు ట్రేడింగ్​ను నిలిపేశాయి ఎక్స్ఛేంజిలు. పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితులు ఏమీ మారలేదు. అంతకంతకూ నష్టాలు పెరిగి 13 శాతం మేర మార్కెట్లు పతనమయ్యాయి.  

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్​ 3,935 పాయింట్లు పతనమై 25,981 పాయింట్లకు చేరుకుంది. 1,135 పాయింట్లు దిగజారిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 7,610 పాయింట్లు పడిపోయింది.  

అన్నీ నష్టాల్లోనే..

యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​ 20 శాతానికిపైగా నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ సుజుకీ, ఎల్​ అండ్​ టీ, టెక్​ మహీంద్రా షేర్లు 15 శాతానికిపైగా పడిపోయాయి.  

భారత్​లో లాక్​డౌన్​..

దేశంలో ఏపీ, తెలంగాణ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, జమ్ము-కశ్మీర్‌, చండీగఢ్‌లు మార్చి 31వరకు పూర్తిగా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. వైరస్​ ప్రభావిత 80 జిల్లాలలో కేంద్రం లాక్​డౌన్​ విధించింది. మారుతీ సుజుకీ, మహీంద్రా, హీరోమోటోకార్ప్​ ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేశాయి. మరోపక్క ఎల్‌జీ కూడా భారత్‌లోని రెండు ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.  

భారత్​లో కరోనా వైరస్​ నిర్ధరిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి కరోనా కేసులు 415కు చేరుకున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా ధాటికి దేశంలో ఏడుగురు మృతి చెందారు.  

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం..

జపాన్‌ మార్కెట్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై పడింది. న్యూజిలాండ్​ 9 శాతానికి పైగా నష్టపోగా.. ఆస్ట్రేలియా సూచీలు 6 శాతం పతనమయ్యాయి.  

అమెరికా బెయిల్​ అవుట్​ ప్యాకేజీపై సందిగ్ధత..

అమెరికాకు 1.7 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఆమోదంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొనటం ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టింది.  అక్కడ వైద్యసేవలకు నిధులు అవసరమైన సమయంలో జాప్యం చేయకుండా మంజూరు చేయాలనే డిమాండ్లు నెలకొన్నాయి. కీలకమైన ఓట్లను ఇది ఇంకా సాధించలేదనే ప్రచారంతో అక్కడ ఆందోళన నెలకొంది.  

సెబీ నిబంధనల ప్రభావం..

సెబీ ఆదేశాల వల్ల ఎఫ్‌ఐఐలు, డీఐఐలకు ప్రస్తుతం షార్ట్‌సెల్లింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతోందే కానీ.. మార్కెట్‌ ట్రెండ్‌ను మార్చలేకపోయింది. ఇప్పటి వరకు సెబీ ఆశించినట్లుగా హెచ్చుతగ్గులైతే పరిమితంగానే ఉన్నాయి. విక్రయించే ట్రెండింగ్‌లో మార్పులేదు.

15:12 March 23

4 వేల పాయింట్ల నష్టానికి చేరువలో సెన్సెక్స్​

భారీ పతనం దిశగా స్టాక్ మార్కెట్లు కదులుతున్నాయి. రికార్డు స్థాయిలో 4 వేల పాయింట్ల నష్టానికి చేరువలో సెన్సెక్​ ఉంది. 3,904 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 26,012 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 1,141 పాయింట్లు నష్టపోయి 7,604 పాయింట్లకు పడిపోయింది. 

14:23 March 23

అంతకంతకూ పెరుగుతున్న నష్టాలు

స్టాక్ మార్కెట్లు నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెన్సెక్స్​ 3,611 పాయింట్లు లేదా 12 శాతం నష్టపోయి 26,304 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 1,043 పాయింట్లు లేదా 11.93 శాతం కోల్పోయి 7,702 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

13:28 March 23

3 వేల పైన సెన్సెక్స్ ఊగిసలాట

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమయింది. వైరస్ ప్రభావిత 75 జిల్లాలను లాక్​డౌన్​ చేసింది. ఈ ఆంక్షలు మదుపరుల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఫలితంగా ట్రేడింగ్  ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

సెన్సెక్స్​ 3,386 పాయింట్లు లేదా 11.32 శాతం నష్టపోయి 26,530 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 959 పాయింట్లు లేదా 10.97 శాతం కోల్పోయి 7,786 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

ఇండస్​ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్​ ఫినాన్స్​, ఎల్​ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంకు భారీ నష్టాల్లో ఉన్నాయి. 

11:59 March 23

భారీ నష్టాల్లోనే..

స్టాక్​ మార్కెట్లు పునఃప్రారంభమైన తర్వాత కూడా అంతకంతకూ పడిపోతున్నాయి స్టాక్ మార్కెట్లు. 10 శాతానికి పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి దేశీయ మార్కెట్లు. ఒకానొక దశలో సెన్సెక్​ 3,500 పాయింట్లకుపైగా పడిపోగా.. నిఫ్టీ 15 శాతం మేర పతనమైంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 3,391 పాయింట్లు కోల్పోయి 26,524 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 1006 పాయింట్ల నష్టపోయి 7,739 పాయింట్లకు పడిపోయింది.  

అంతటా నష్టాలే..

అన్నీ రంగాల షేర్లు నష్టాల్లోనే సాగుతున్నాయి. ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంకు షేర్లు 20 శాతానికిపై పతనమయ్యాయి. బజాజ్​ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రా సిమెంట్స్, హీరోమోటోకార్ప్​ 10 శాతానికిపైగా నష్టాల్లో ఉన్నాయి.  

అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..  

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు పెరుగుతున్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లోనే ఉన్నాయి. న్యూజిలాండ్ మార్కెట్లు 9.3 శాతం పతనం కాగా.. సింగపూర్​ 7.5 శాతం నష్టపోయింది. హాంకాంగ్​ సూచీ 3.7 శాతం, దక్షిణ కొరియా 3.4 శాతం, షాంఘై 2.5 శాతం, తైవాన్​ 2.8 శాతం పడిపోయాయి. 

11:11 March 23

ట్రేడింగ్ పునఃప్రారంభం

 45 నిమిషాల విరామం అనంతరం స్టాక్ మార్కెట్లు పునః ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 3180 పైగా నష్టపోయి 26, 730 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 867 పాయింట్ల మేర క్షీణతతో 7870కి పైగా ట్రేడవుతోంది.

11:03 March 23

రూ. 10 లక్షల కోట్ల సంపద ఆవిరి..

స్టాక్ మార్కెట్ తాజా నష్టాలతో రూ. 10 లక్షల కోట్ల విలువైన మదుపరుల సంపద ఆవిరైంది. దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీల నిలిపివేతకు ముందు కొనసాగిన నష్టాల్లో మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. బీఎస్​ఈలో నమోదైన కంపెనీల విలువ ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే రూ. 10, 29, 847 లక్షల కోట్లు నష్టపోయి  రూ. 1, 05, 79, 296 కోట్లకు చేరుకుంది.  

10:24 March 23

మార్కెట్ల నిలిపివేత

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రారంభంలో భారీగా ఊగిసలాడిన సూచీలు 10 శాతం మేర నష్టపోయిన కారణంగా కార్యకలాపాలు నిలిపివేశాయి. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 10 శాతం మేర 2991 పాయింట్లు కోల్పోయి 26, 924కి చేరిన కారణంగా సెన్సెక్స్ లావాదేవీలను నిలిపేశారు. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 9.63 శాతం మేర.. 842 పాయింట్లు క్షీణించి 7903 పాయింట్లు క్షీణించిన కారణంగా కార్యకలాపాలను ఆపేశారు.

09:30 March 23

భారీ నష్టాల్లో సూచీలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొనడం, భారత్​లో ఆయా రాష్ట్రాలు లాక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2410 పాయింట్లకు పైగా క్షీణించి 27, 501 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ 680 పాయింట్లకు పైగా కోల్పోయి 8063 వద్ద కొనసాగుతోంది. 

09:10 March 23

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. కరోనా వైరస్​ భయమే ఇందుకు కారణం. బీఎస్​ఈ సెన్సెక్స్ 2వేల532 పాయింట్లు కోల్పోయి​ 27,383 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 720 పాయింట్ల నష్టంతో 8,024 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Last Updated : Mar 23, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.