ETV Bharat / business

ఐటీఆర్ దాఖలుకు ఫారాలు ఇవే..

author img

By

Published : Dec 8, 2020, 4:37 PM IST

2020-21 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు 7 ఫారాలను నోటిఫై చేసింది ఐటీ విభాగం. మరి ఎవరెవరికి ఏఏ ఫారమ్ వర్తిస్తుంది? ఐటీఆర్​లో ఫారాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? అనే వివరాలు మీ కోసం.

full details of ITR forms
ఐటీఆర్ ఫారాల పూర్తి వివరాలు

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. దాఖలు చేసేందుకు ఏడు ఫారమ్​లను ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఇవి 2020-21 మదింపు సంవత్సరానికి వర్తిస్తాయి. అంటే 2019-20 సంవత్సరం ఆదాయం గురించి సూచిస్తాయి.

ఆదాయ మార్గాల ఆధారంగా ఈ ఫారమ్​లు మారుతుంటాయి. ఫారమ్​లను ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ఫారమ్ నింపినట్లైతే రిటర్న్ దాఖలు తప్పుగా జరిగి.. ఐటీ శాఖ నోటీసు పంపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరి అలాంటి తప్పులు జరగకుండా ఎవరికి ఏ ఫారమ్ వర్తిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

ఐటీఆర్ 1

దీనినే సహజ్ అని కూడా అంటారు. ఇది రూ.50 లక్షల వరకు ఆదాయం ఉంటూ దేశంలో నివసిస్తోన్న వారికి వర్తిస్తుంది. ఈ ఆదాయంలో వేతనాలు, ఒక గృహం, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే అదాయం (వడ్డీ తదితరాలు), వ్యవసాయ ఆదాయం వంటివి పరిగణనలోకి వస్తాయి.

రిటర్న్ దాఖలు చేసే వ్యక్తితో పాటు భార్య, పిల్లలు, ఇతరులు ఎవరైనా ఒకరి ఆదాయాన్ని కూడా కలపాలనుకుంటే.. ఆదాయం పైన తెలిపిన వాటి నుంచే ఉండాలి. అయితే వీరి ఆదాయం నుంచి పన్ను డిడక్ట్ అయ్యి.. రిటర్న్ దాఖలు చేసే వ్యక్తి దాని క్రెడిట్ కావాలనుకుంటే మాత్రం ఐటీఆర్ 1 ఫారమ్ ఉపయోగించకూడదు.

భారతదేశంలో నివసించేందుకు అర్హత ఉన్నప్పటికీ... ఇక్కడ నివసించని వారు లేదా సాధారణ నివాసం లేని వారు, మూలధన లాభాలున్న వారు, ఒకటి కన్నా ఎక్కువ ఇళ్లు ఉన్న వారు ఈ ఫారమ్​ను ఉపయోగించుకోకూడదు. ఏదైనా కంపెనీలో డైరెక్టర్​గా స్థానంలో ఉన్నవారు, లిస్టవ్వని షేర్లలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఈ ఫారమ్ ద్వారా రిటర్ను దాఖలు చేసేందుకు అనర్హులు.

ఐటీఆర్ 2

వ్యాపారం లేదా ఇతర యాజమాన్యం లేనటువంటి వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబంలోని వ్యక్తులు ఈ ఫారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు గడించే వ్యక్తులు ఐటీఆర్-2ను ఉపయోగించుకోరాదు. 10ఏఏ లేదా చాప్టర్ 4-ఏ ప్రకారం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు కూడా ఈ ఫారమ్ ద్వారా రిటర్న్స్ దాఖలు చేయకూడదు.

ఐటీఆర్ 3

వ్యాపారం లేదా వృత్తి నుంచి వ్యాపారాల ద్వారా లాభాలను గడించే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం ఈ ఫారమ్ ద్వారా రిటర్ను దాఖలు చేసుకోవచ్చు.

ఐటీఆర్ 4

దీనినే సుగమ్ అని కూడా అంటారు. వ్యాపారం, వృత్తి (44ఏడీ, 44ఏడీఏ, 44ఏఈ సెక్షన్లు) ద్వారా ఆదాయం పొందుతున్న వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబం, ఎల్ఎల్​పీ కానీ సంస్థలు దీనిని ద్వారా రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్ 5

హిందూ ఉమ్మడి కుటుంబం, కంపెనీ, వ్యక్తి, ఐటీఆర్ 7 దాఖలు చేసే వ్యక్తి కాకుండా.. ఇతర వ్యక్తులకు ఇది వర్తిస్తుంది.

ఐటీఆర్ 6

సెక్షన్ 11 ప్రకారం మినహాయింపు క్లెయిమ్ చేసుకోని కంపెనీలు దీనిని ఉపయోగించుకోవచ్చు.

ఐటీఆర్ 7

ఇది వ్యక్తులతో పాటు కంపెనీలకు అందుబాటులో ఉంటుంది. సెక్షన్ 139(4ఏ) లేదా 139(4బీ) లేదా 139(4సీ), 139(4డీ) ప్రకారం ఐటీఆర్​ దాఖలు చేసే సమయంలో మాత్రమే దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:పసిడి కొనుగోలుకు 10 సూత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.