ETV Bharat / business

RBI: రెపో రేటు మళ్లీ యథాతథం

author img

By

Published : Jun 4, 2021, 10:34 AM IST

Updated : Jun 4, 2021, 1:37 PM IST

రెపో, రివర్స్ రెపో రేట్లను వరుసగా ఆరోసారి స్థిరంగా ఉంచుతూ ఆర్​బీఐ(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో వృద్ధికి ఊతమందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Shaktikanta Das RBI Governor
శక్తికాంత దాస్​, ఆర్​బీఐ గవర్నర్​

నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఆర్​బీఐ(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల సమీక్ష అనంతరం కమిటీ తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం వెల్లడించారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​. కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేఫథ్యంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించినట్లు తెలిపారు. రెపో రేటును స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఆరోసారి. రివర్స్ రెపో రేటును కూడా 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంచింది ఎంపీసీ. రెపో, రివర్స్ రెపో రేట్లను 2020 మే 22న చివరిసారిగా సవరించింది.

వృద్ధి రేటు అంచనాలకు కోత..

కొవిడ్ సంక్షోభం మళ్లీ తీవ్రమైన నేపథ్యంలో 2021-22 వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించినట్లు ఆర్​బీఐ(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలను కూడా 26.2 శాతం నుంచి 18.5శాతానికి సవరించినట్లు పేర్కొన్నారు.

ఇదే సమయంలో ద్రవ్యోల్పణం 5.1 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నారు దాస్​. అయితే 2026 మార్చి 31 వరకు రిటైల్ ద్రవ్యోల్పణం వార్షిక ప్రాతిపాదికన 4 శాతం వద్ద ఉండటం తప్పనిసరి అని ఎంపీసీ అభిప్రాయపడినట్లు తెలిపారు.

జీ-శాప్‌ 2.0 కింద జూన్‌ 17న రూ. 40వేల కోట్ల విలువైన సెక్యూరిటీస్‌ కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇకపై గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు కూడా డిపాజిట్ల సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి కల్పించింది. ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడం కోసం రూ.6వేల కోట్ల ద్రవ్యాన్ని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐడీబీఐ)కి ఇవ్వనున్నట్లు వివరించింది.

కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీలకు అండగా ఉండేందుకు.. రుణాల పునర్నిర్మాణ పరిధిని విస్తరించింది. రూ.50 కోట్ల లోపు రుణాలు ఉన్న కంపెనీలన్నింటికీ దీన్ని వర్తింపజేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ధరలు

Last Updated : Jun 4, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.