ETV Bharat / business

'సంస్కరణలు దీర్ఘకాలానికి మంచివే'

author img

By

Published : Jan 31, 2021, 7:24 PM IST

కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ చట్టాలు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఉద్యోగాలు సైతం పెరుగుతాయని చెప్పారు. ఈ మేరకు ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

CEA K Subramanian
'సాగు సంస్కరణలు దీర్ఘకాలానికి మంచివే'

మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాలు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే కాక ఉద్యోగ కల్పన సైతం సాధ్యమవుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. 2023 నాటికి ఆర్థిక వ్యవస్థ కరోనా పూర్వ స్థితికి చేరుతుందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 11 శాతం వృద్ధి నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 'బడ్జెట్' ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన కృష్ణమూర్తి.. కీలక విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంతో ఇంటర్వ్యూ

సంస్కరణలతో వృద్ధి

సంస్కరణల వల్ల విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు తయారీ రంగానికి ఊతమందిస్తాయని చెప్పారు. ఎంఎస్ఎంఈల నిర్వచనం మార్చడం వల్ల ఆ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైందని అన్నారు. వాటి ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. అన్​లాక్ దశ ప్రారంభమైన తర్వాత ఎంఎస్ఎంఈ రంగమే వేగంగా పుంజుకుందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ఈ వృద్ధి కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సాగు చట్టాలు మంచికే

గత కొన్నేళ్లలో వ్యవసాయ రంగం గణనీయంగా పురోగమించిందని పేర్కొన్నారు సుబ్రహ్మణ్యం. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థించారు. సంస్కరణలు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తాయని అన్నారు. అర్థశాస్త్ర పరంగా చూస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు ఈ చట్టాలు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. దేశంలో చిన్నరైతులపై దృష్టిసారించడం చాలా ముఖ్యమని... గత కొన్నేళ్లలో వీరి సమస్యలపై చర్చలు జరిగాయి కానీ, చట్టాలు రాలేదని తెలిపారు. ఇతర అంశాలే.. చట్టాలపై తప్పుడు అభిప్రాయాలకు కారణమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం-రైతుల మధ్య చర్చలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ గౌరవాన్ని కాపాడతాం: టికాయత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.