ETV Bharat / business

పండుగలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

author img

By

Published : Oct 12, 2020, 6:29 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం సరికొత్త పథకాలను ప్రకటించింది. వినియోగదార డిమాండ్ పెంచి, కొవిడ్​తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం కోసం నగదు ఓచర్లు, రూ.10 వేలు వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. వీటితో పాటు మరిన్ని ఉద్దీపనలను ప్రకటించింది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Govt announces cash-for-LTC
ఎల్​టీసీ ఓచర్లపై పూర్తి వివరాలు

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమందించే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. పండుగ సీజన్​లో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్​టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్​) నగదు ఓచర్లును, రూ.10 వేల పండుగ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు.

డిమాండ్ పెంచడంలో భాగంగా రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా రూ.12,000 కోట్ల రుణ సదుపాయాన్ని ప్రకటించారు.

ఎల్​టీసీ ఓచర్ల వివరాలు ఇవి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగేళ్లకు ఒక సారి విహార యాత్రలకు, సొంతూళ్లకు వెళ్లేందుకు ఎల్​టీసీ తీసుకునే వీలుంటుంది. అయితే సారి ప్రయాణాలు కష్టతరమైనందున.. ఎల్​టీసీకి బదులు అంతే మొత్తానికి సమానమైన పన్ను వర్తించని నగదు ఓచర్లు ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

'ఉద్యోగులు ఈ ఓచర్లను ఉపయోగించి కేవలం ఆహారేతర వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి. అవి కూడా 12శాతం అంతకంటే ఎక్కువ జీఎస్‌టీ అమలయ్యే వస్తువులే అయి ఉండాలి. వీటిని జీఎస్‌టీ నమోదిత అవుట్‌లెట్లలో డిజిటల్‌ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాలి' అని సీతారామన్ తెలిపారు. ఈ ఓచర్లను 2021 మార్చి 31లోపు వినియోగించుకునేందుకు వీలుందని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను కల్పించొచ్చని చెప్పారు.

పండుగ అడ్వాన్స్..

ఎల్​టీసీ ఓచర్​తో పాటు ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ కింద రూ.10 వేలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది . ఈ మొత్తాన్ని వడ్డీ లేకుండానే ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఈ రుణం రూపే ప్రీపెయిడ్ కార్డుల్లో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని గరిష్ఠంగా 10 ఈఎంఐల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణం మొత్తాన్ని కూడా వచ్చే ఏడాది మార్చి 31 లోపు వినియోగించుకోవాలని కేంద్ర స్పష్టం చేసింది.

మొత్తం మీద ఈ రెండు పథకాల ద్వారా వినియోగ డిమాండ్ రూ.28,000 కోట్లు పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అదే విధంగా వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి డిమాండ్ రూ.73 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తోంది.

పండుగ సీజన్​లో సాధారణంగానే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమందించే ఉద్దేశంతో ఈ పథకాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది కేంద్రం.

కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్' పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

అదనపు కేటాయింపు..

రోడ్లు, రక్షణ మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, పట్టణాభివృద్ధి, దేశీయంగా ఉత్పత్తి చేసిన రక్షణా పరికారాల కోసం రూ.25 వేల కోట్ల అదనపు మూలధన సహాయాన్ని అందించనున్నట్లు నిర్మలా సీతారమన్ ప్రకటించారు.

ఇదీ చూడండి:గోల్డ్ బాండ్ల సబ్​స్క్రిప్షన్ షురూ- కొంటే లాభాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.